సిటీ బ్యూరో, మే 19 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేస్తున్న జలమండలికి అవినీతి మరక అంటుకున్నది. అధికారుల అవినీతి బాగోతం బట్టబయలవుతున్నది. తాగు నీటి సరఫరా, నిర్వహణ పేరిట పెద్ద మొత్తంలో అవినీతికి పాల్పడుతున్నట్లు తేటతెల్లమవుతున్నది. నగర ప్రజలకు తాగునీరు సరఫరా చేసే అధికారులు పెద్ద మొత్తంలో ప్రజాధనాన్ని లూటీ చేయడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నది. రెడ్ హిల్స్‌లోని డివిజన్-8 జీఎం ఏసీబీ దాడుల్లో కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డట్లు తేలడం కలకలం సృష్టిస్తున్నది. జలమండలిలో ఈ అంశం తీవ్ర ప్రకంపనలు రేపుతున్నది.
జలమండలిలో జీఎం స్థాయి అధికారి ఇంట్లో ఏకంగా రూ.1.1కోట్ల నగదు, రెండు కిలోలకు పైగా బంగారు ఆభరణాలు, తొమ్మిది కిలోలకు పైగా వెండి ఆభరణాలతో పాటు అనేక చోట్ల ప్లాట్లు, ఇండ్ల స్థలాలు, వ్యవసాయ భూములు ఉన్నట్లు తేలింది. ఒక జీఎం స్థాయి అధికారి ఇంట్లో అంతపెద్ద మొత్తం అవినీతి సొమ్ము దొరకడంతో ఏసీబీ అధికారులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. నోట్ల కట్టలు కుప్పలు తెప్పలుగా దొరుకుతుండటంతో మిషన్ల ద్వారా లెక్కించారు. వెతుకుతున్న కొద్ది నోట్ల కట్టలు, బంగారు, వెండి ఆభరణాలు లభించడంతో అధికారులు షాకయ్యారు.
జీఎం ఇంట్లో పెద్దమొత్తంలో నగదు, ఆభరణాలు, భూములు, ఇండ్ల డాక్యుమెంట్లు లభించడం జలమండలి అధికారుల అవినీతికి పరాకాష్ఠగా నిలుస్తున్నది. ఇటీవల కాలంలో జలమండలి అధికారులు ఏసీబీకి పట్టుడబడటం ఇదే కావడంతో మరింత మంది అవినీతి అధికారులు ఉన్నట్లు చర్చ జరుగుతున్నది. జీఎం స్థాయి అధికారికి కోట్లాది రూపాయల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెడ్‌హిల్స్ జీఎం సగ్గం అనంత లక్ష్మీకుమార్ కోట్లా ది రూపాయల నోట్ల కట్టలు, పెద్ద మొత్తంలో అక్రమాస్తులు ఉన్నట్లు ఏసీబీ తనిఖీల్లో దొరకడంతో జలమండలిలో ఏం జరుగుతున్నదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌కు తాగునీటిని సరఫ రా చేస్తున్న జలమండలిపై ప్రజల్లో తీవ్ర అసహనం కలిగిస్తున్నది.
తాగునీటి సరఫరా, పనుల నిర్వహణ, ప్రాజెక్టుల నిర్మాణం వంటి పనులతో జలమండలి లోటు బడ్జెట్లో ఉందని చెప్తున్న అధికారుల ఇండ్లలో నోట్ల కట్టలు ప్రత్యక్షమవడం కలకలం సృష్టిస్తున్నది. స్వ యం ప్రతిపత్తి సంస్థ అయిన వాటర్ బోర్డులో అధికారులు ఇతర ప్రభుత్వ శాఖల కంటే ఎక్కువ జీతాలు, అలవెన్సులు తీసుకుంటున్నారనే అపవాదు ఉన్నది. బోర్డులో జరిగే కార్యకలాపాలు, పదోన్నతులు, బదిలీల విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోకపోవడాన్ని అదునుగా తీసుకుని ఇష్టమొచ్చినట్లు అవినీతికి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ప్రాజెక్టులు, పనుల టెండర్లలో భారీగా అవినీతి జరుగుతున్నదనే ఆరోపణలకు తాజాగా జీఎం స్థాయి అధికారి ఇంట్లో కోట్ల రూపాయలు దొరకడం ఆజ్యం పోస్తున్నది. కాంట్రాక్టర్లు, బిల్డర్ల నుంచి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడుతున్నట్లు తేటతెల్లమవుతున్నది. ఉన్నతాధికారులు ఇప్పటికైనా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని నగర ప్రజలు కోరుతున్నారు. అవినీతి అధికారులను గుర్తించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న వారిపై నిఘా ఉంచాలని కోరుతున్నారు.