సిటీబ్యూరో, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఓటర్ల సవరణ ప్రక్రియ తీవ్ర జాప్యంతో కొట్టుమిట్టాడుతోంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ప్రక్రియలో భాగంగా హైదరాబాద్ జిల్లాతో పాటు కోర్ అర్బన్ రీజియన్ (క్యూర్) పరిధిలో అనామలీస్, నాన్-మ్యాపింగ్ ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ క్షేత్రస్థాయిలో ఆశించిన రీతిలో సాగడం లేదు. క్యూర్ సిటీ పరిధిలో (హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్-మలాజిగిరి) 38.93 లక్షలు ఉండగా, హైదరాబాద్ జిల్లాలో మాత్రమే 12,53000 పైచిలుకు ఉన్నారు.
ఇప్పటి వరకు కేవలం 7.26 లక్షలు మాత్రమే నోటీసులు జారీ చేశారు. అత్యధికంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో 57,052ల మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉంది. రెండో స్థానంలో ముషీరాబాద్‌లో 56, 425, మూడో స్థానంలో జూబ్లీహిల్స్ 48, 565, నాలుగో స్థానంలో అంబర్‌పేట 41,203, ఐదో స్థానంలో ఖైరతాబాద్‌లో 39,189 మందికి నోటీసులు జారీ చేయాల్సి ఉంది. అత్యల్పంగా చాంద్రాయణ గుట్టలో కేవలం 17, 116 మందికి నోటీసులు ఇవ్వాల్సి ఉంది.
ఓటరు ముసాయిదా జాబితా విడుదల చేసి, నాన్-మ్యాపింగ్, అనామలీస్ వివరాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే గత నెల 29న హియరింగ్‌లు ప్రారంభించగా, 16వ తేదీ నాటికి ప్రక్రియ ముగించాలని ఎన్నికల విభాగం లక్ష్యంగా పెట్టుకుంది. అక్టోబర్ 19న తుది ఓటరు జాబితాను ప్రచురించాల్సి ఉంది. ఇప్పటివరకు కనీసం 65 శాతం మందికి కూడా నోటీసులు అందలేదు. నిర్ణీత గడువులోగా సర్ నోటీసుల జారీ ప్రక్రియ సాధ్యమైనా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నోటీసుల జారీ నత్తనడకన సాగుతుండటంతో, హియరింగ్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఒకో సరిల్ కు అదనంగా 10 మంది అడిషనల్ అసిస్టెంట్ ఎలక్టోరల్ ఆఫీసర్ల (ఏఏఈఓ)ను నియమించారు.
ఓటర్లకు పునః పరిశీలన ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. నేడు, ఆదివారం, 12, 13 తేదీల్లో కార్యక్రమాలు జరుగుతాయని అధికారులు తెలిపారు. ఓటర్ల జాబితా పునః పరిశీలన, గైర్హాజరు తరలిన, మరణించిన పునరావృత ఓటర్ల వివరాలు, అసాధారణ అంశాలు, అభ్యర్థనలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. కాగా కొత్తగా ఓటరుగా నమోదు చేసుకోవడం, ఓటరు వివరాల్లో మార్పులు చేయడం, పేరు తొలగింపు లేదా ఇతర సవరణలు అవసరమైన వారు సంబంధిత దరఖాస్తుల ద్వారా విజ్ఞప్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.