సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని యాదాద్రి, బాసర, భద్రాచలం తదితర ప్రముఖ దేవాలయాల్లో జరుగుతున్న వేదపండితుల నియామకాల్లో స్థానికులకు జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తూ తెలంగాణ వేదపండితులు మాజీ మంత్రి హరీశ్‌రావును కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు దేవాదాయశాఖ నిర్వహిస్తున్న మతపరమైన ఉద్యోగ నియామకాల్లో జరుగుతున్న అవకతవకలపై హరీశ్‌రావుకు వివరించారు.
నీళ్లు, నిధులు, నియామకాల పేరుమీద వచ్చిన తెలంగాణలో ఈ ప్రాంతంలో పుట్టి వేదం చదువుకున్న తమకు అన్యాయం జరుగుతున్నదని, వేరే ప్రాంతంలో పుట్టి ఇక్కడికి వచ్చి చదువుకున్నవారు సర్టిఫికెట్లు సంపాదించుకుని వేదపండితులుగా నియామకమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా రాష్ట్రంలోని దేవాలయాల్లో స్థానిక వేద పండితులకు దక్కాల్సిన అవకాశాలు ఇతర రాష్ర్టాలకు చెందిన వారికి దక్కుతున్నాయని, తెలంగాణ యువత, స్థానిక వేదపండితుల హక్కులను పరిరక్షించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అన్నారు.
తెలంగాణ దేవాలయాల్లో భర్తీ చేస్తున్న వేదపండితుల పోస్టుల్లో స్థానికులకు ప్రాధాన్యం కల్పించాలని, స్థానిక రిజర్వేషన్ నిబంధనలను ఖచ్చితంగా అమలుచేయాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆవిర్భావంలో స్థానికుల హక్కుల పరిరక్షణే ప్రధాన లక్ష్యమని, అలాంటి రాష్ట్రంలో స్థానిక వేద పండితులకు అన్యాయం జరిగే పరిస్థితి ఉండకూడదని హరీశ్ రావు అన్నారు. తెలంగాణకు చెందిన అర్హులైన వేదపండితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని నియామక ప్రక్రియను సమీక్షించి, స్థానికులకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇటీవల తాడ్బంద్ ఆంజనేయ స్వామి దేవాలయంలో జరిగిన పరీక్షల నియామక ప్రక్రియ మొత్తం లోపభూయిష్టంగా ఉందని, వేదపండితులను అర్చకులు పరీక్షించారని, దేవాదాయశాఖలో ఉన్నతాధికారిగా ఉన్న వ్యక్తి సహకారంతో ప్రధాన పరీక్షాధికారి తన దగ్గర చదువుకున్న వ్యక్తికి అవకాశమిచ్చేందుకు ఇతరులను ఇబ్బంది పెట్టారని వేదపండితులు ఆరోపించారు.