ఇబ్రహీంపట్నం, నవంబర్ 10 : రాచకొండలో 50 వేల ఎకరాల భూములను లాక్కుంటామన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డిపై రైతులు, గిరిజనులు భగ్గుమంటున్నారు. అధికారంలోకి రాగానే ఇక్కడి భూములు ఏపీలోని అమరావతి మాదిరి లాక్కుంటామని అనడంపై దుమ్మెత్తిపోస్తున్నారు. తెలంగాణ వచ్చాక ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న రాచకొండ రైతులు, గిరిజనుల జీవితాలను ఆగం చేసేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరిస్తున్నారు.
మా తాత.. ముత్తాతల నుంచి ఈ భూములనే నమ్ముకొని జీవిస్తున్నాం. ఒకప్పుడు గుట్టల్లో ఉన్న మమ్ముల్ని ఎవరూ పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిషన్ కాకతీయ కింద చెరువులు, కుంటలను కొత్తగా ఏర్పాటు చేయటంతో పాటు ఉన్నవాటికి మరమ్మతులు చేయటంతో ఈ ప్రాంతంలో భూగర్భజలాలు పెరిగి దేనికి పనిరాకుండా ఉన్న భూముల్లో సాగు చేసుకుంటున్నామని రాచకొండ పరిసర ప్రాంతాల్లోని రాచకొండ తండా, తిప్పాయిగూడ, కడీలబావి తండా, తుంబావి తండా, పటేల్‌చెరువు తండా, ఆరుట్ల, అల్లాపురం, అల్లాపురం తండా, పీపల్పహడ్, ఐదుదోనల తండా, డీ నాగారం, కొయ్యలగూడం, నారాయణపుం, కొత్తగూడం తదితర ప్రాంతాలకు చెందిన సుమారు 50వేల కుటుంబాలు పేర్కొంటున్నారు.
24గంటల ఉచిత విద్యుత్‌తో పాటు రైతుబంధు కింద పెట్టుబడి సహాయం అందిస్తుండటంతో సాగును మరింత సులభతరం చేసుకున్నాం. మా తాతముత్తాల నుంచి వస్తున్న పొలాలను గుంజుకుంటవా..? నాడు ఉమ్మడి రాష్ట్రంలో బీడీఎల్ పేరుతో కుట్ర చేస్తే తిప్పికొట్టినం. ఇప్పుడు కూడా రాచకొండ పేరెత్తితే, మా భూముల జోలికొస్తే తన్ని తరిమేస్తాం. సెంట్ భూమి కూడా ఇచ్చేది లేదని కుండబద్ధలు కొడుతున్నారు. అధికారంలోకి రాక ముందే రేవంత్‌రెడ్డి రైతులకు వ్యతిరేకంగా కుట్రలకు తెరదీస్తున్నారని, ఇక ప్రభుత్వంలో ఉంటే ఇంకెంత కుయుక్తులు చేస్తారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం చెబుతామని రైతులు, గిరిజనులు పేర్కొన్నారు.
రాచకొండ పరిసర ప్రాంతాల్లో గతంలో ఉన్న అనేక గుట్టలు నేడు సాగుభూములుగా మారాయి. గత ప్రభుత్వాలు రైతులను పట్టించుకోకపోవటంతో ఈ ప్రాంతంలోని రైతులు కేవలం వర్షాదార పంటలపైనే ఆదారపడేవారు. వర్షాలు పడకపోవడంతో పంటల సాగుకూడా అంతంత మాత్రంగానే ఉండేది. వర్షాలు పడితేనే గిరిజనులు పంటలు సాగుచేసుకునేవారు. వారికి సరైన పని దొరుకని సమయంలో ఉపాధి కోసం వలసలు వెళ్లేవారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతులకు ఉచితంగా 24గంటల విద్యుత్‌తో పాటు రైతుబంధు ద్వారా పెట్టుబడి సహాయం అందిస్తుండటంతో బంజరు భూములను సాగులోకి తీసుకువచ్చారు. మరోవైపు భూగర్భజలాలు పెరుగటంతో రైతులు బోర్లు వేసుకుని పెద్ద మొత్తంలో వ్యవసాయాన్ని సాగుచేస్తున్నారు. ఈ భూములపైనే ఆధారపడి రైతులు ఎన్నో ఏళ్లుగా జీవనం సాగిస్తున్నారు. ఈ తరుణంలో కాంగ్రెస్ నాయకులు తమ భూములు లాక్కుంటామని ప్రకటించటంతో రైతుల్లో పెద్ద ఎత్తున ఆందోళన మొదలైంది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మా భూములకు ఏం ధర ఉండేది కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంక ముఖ్యమంత్రి కేసీఆర్ మా ప్రాంతానికి వచ్చి ఇక్కడ ఫిలింసిటీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆయన వచ్చిపోయినంక ఇక్కడ పెద్దపెద్ద వెంచర్లు చేస్తున్నరు. మా భూములకు మంచిగ ధరలు పలుకుతున్నాయి. మా భూముల జోలికి ఎవరైనా వస్తే ఊరుకునేది లేదు.
– ఆవ వెంకటేష్ (కడీలబావితండా)
నల్గొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దుల్లో ఉన్న రాచకొండ పరిసర ప్రాంతాల్లోని భూములకు గతంలో ఏమాత్రం డిమాండ్ ఉండేది కాదు. ఈ గుట్టల ప్రాంతానికి రావటానికే ఇతర ప్రాంతాల వారు వెనుకడుగు వేసేవారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాచకొండను అభివృద్ధి చేయటంతో పాటు ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా మారుస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఈ ప్రకటనతో భూములకు అమాంతం రెక్కలొచ్చాయి. దీంతో గతంలో రూ.10లక్షలు ఉన్న భూములు ఎకరాకు నేడు యాభై నుంచి అరవై లక్షలకు చేరుకుంది. మరోవైపు సరళమైసమ్మ ఆలయం ఎంతో అభివృద్ధికి నోచుకోవటంతో ఆలయ పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వెంచర్లు వెలుస్తున్నాయి. గతంలో గుట్టలవైపు తొంగిచూడని పరిస్థితి ఉండేది. నేడు ఎంతోమంది పర్యాటకులు రాచకొండ గుట్టలకు వస్తున్నారు. అలాగే, సరళమైసమ్మ ఆలయం కూడా ఎంతో ప్రసిద్ది చెందటంతో ఈ ప్రాంతానికి నగరంతో పాటు పరిసర ప్రాంతాల వారు పెద్ద ఎత్తున వస్తుండటంతో రాచకొండ ప్రాంతానికి మంచి డిమాండ్ పెరిగింది.
కేసీఆర్ వచ్చినంక మాకు అప్పుల బాధలు పూర్తిగా తీరిపోయాయి. గతంలో పంటలు సాగుచేసుకోవాలంటే అప్పులు తెచ్చేదివారము. తీర పంటచేతికొచ్చే సమయానికి అకాల వర్షాలతో నష్టపోయి మిత్తిపైసలు కూడా వెల్లేవికాదు. కాని ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చినంక రైతుబంధు కింద ఎకరానికి రూ.5వేలు ఇస్తుండు, మంచిగ పంటలు సాగుచేసుకుని బతుకుతున్నాం. మంచిగ 24గంటల కరెంటు ఇస్తుండు. మా భూములు మా దగ్గరే ఉండాలి.
– అండాలు (ఆరుట్ల)
నలభైఏళ్లుగా ఈ భూమినే నమ్ముకుని జీవిస్తున్నాం. గతంలో గుట్టలుగా ఉన్న ఈ భూమిని చదును చేసుకుని సాగుచేసుకుంటున్నాం. ప్రస్తుతం ఈ భూమిలో పత్తివేసుకుని పత్తిని సాగుచేస్తున్నాం. ఈ పత్తిసాగు వలన వచ్చే ఆదాయంతో మా కుటుంబం అంతా పోషిస్తున్నాం. మాకు భూమి లేకుంటే వేరు ఆధారంలేదు. ఈ భూమి పోతే మా జీవితాలు రోడ్డున పడతాయి. ఈ భూమికోసం తాము ఎంతకైనా పోట్లాడుతాం. ఎవరైనా మా భూమిజోలికోస్తే ఊరుకునేది లేదు.
-మెగావత్ మోతి (రాచకొండ తండా)
మా తాతలు.. తండ్రుల నుంచి మేము, మా పిల్లలు కూడా ఈ భూములపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఈ భూములే మా కుటుంబాలకు పెద్ద ఆధారం. ఈ భూములను సాగుచేసుకుని తాము జీవిస్తున్నాం. మా భూములను తీసుకుంటామని అనడం భావ్యం కాదు. మేం ఇక్కడే పుట్టాం. ఈ భూమిలోనే చనిపోతాం. కానీ భూములను మాత్రం విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఎవరొచ్చినా ఊరుకునేది లేదు.
– మెగావత్ భూమా (పటేల్చెర్వుతండా)