సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ): అభివృద్ధికి దిక్సూచిగా నిలవాల్సిన ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ)లు ప్రస్తుతం తీవ్ర ‘ఇంజినీరింగ్’ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)తో పాటు కొత్తగా ఏర్పాటైన సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (సీఎంసీ), మలాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)లోఇంజినీర్లు నిరవధిక పదవీ విరమణతో ఖాళీల కొరత ఏర్పడుతున్నది. ఎంఎంసీలో చీఫ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న అశోక్ రెడ్డి ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్నారు.
ఈ క్రమంలోనే వచ్చే ఆగస్టు 31తో జీహెచ్ఎంసీ సీఈ సహదేవ్ రత్నాకర్ కూడా రిటైర్డ్ కానున్నారు. వీటితో పాటు సీఈ తర్వాత ఎస్ఈల సంఖ్య కూడా సరిగా లేకపోవడం, ఈ నెలాఖరులో జీహెచ్ఎంసీ ఎస్ఈ మోహన్‌రెడ్డి రిటైర్డ్ కాబోతున్నారు. మొత్తంగా మూడు కార్పొరేషన్లలో సమర్థవంతమైన ఇంజినీరింగ్ వ్యవస్థ లేకపోవడంతో వేల కోట్ల రూపాయలతో చేపట్టాల్సిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, ప్రజావసరాల పనులు పర్యవేక్షించే నాథుడే కరువయ్యారన్న చర్చ మొదలైంది.
టీపీహెచ్ఎంఈలో సిబ్బంది కొరత..
తెలంగాణ పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజినీరింగ్ (టీపీహెచ్ఎంఈ) విభాగం తీవ్ర సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రంలో అత్యంత కీలకమైన జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, జలమండలి, మెట్రోరైలు ప్రాజెక్టులతో పాటు రాష్ట్రవ్యాప్త మున్సిపాలిటీల్లో మౌలిక వసతుల కల్పనలో కీలక పాత్ర పోషించే ఈ విభాగంలో కొత్త నియామకాలు లేకపోగా, పదవీ విరమణ పొందుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. నిరవధికంగా పెరుగుతున్న ఇంజినీర్ల ఖాళీల వల్ల భవిష్యత్తులో కీలక ప్రాజెక్టుల నిర్వహణపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ విభాగంలో కొత్త రక్తం ఎకకపోగా, అనుభవజ్ఞులైన అధికారులు ఒకొకరుగా విరమణ పొందుతున్నారు. 2025లో 24 మంది ఇంజినీర్లు రిటైర్ అవ్వగా, ప్రస్తుత 2026 సంవత్సరంలో ఏకంగా 25 మంది ఉన్నతాధికారులు పదవీ విరమణ చేయనున్నారు. వీరిలో 11 మంది సూపరింటెండెంట్ ఇంజినీర్లు (ఎస్ఈ), 9 మంది ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (ఈఈ), ఐదుగురు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు (డీఈఈ) ఉన్నారు. ఇప్పటికే ముగ్గురు ఎస్ఈలు, ఇద్దరు ఈఈలు, ఇద్దరు డీఈఈలు రిటైర్ కాగా, మిగిలిన వారు ఈ ఏడాది ఆఖరి నాటికి విధులకు దూరం కానున్నారు.
ఇన్చార్జిలతో ప్రాజెక్టులు సాధ్యమేనా?
ప్రస్తుతం ఉన్న అరకొర సిబ్బందితోనే మూడు కార్పొరేషన్లను నెట్టుకురావాల్సి వస్తోంది. చాలామంది డీఈఈలకు శానిటేషన్ బాధ్యతల్లోనే ఉండటం మరింత భారమైన పరిస్థితి. కీలకమైన ఎస్ఈ పోస్టులను సైతం ఇన్‌చార్జిలతోనే నడిపిస్తున్నారు. పూర్తిస్థాయి బాధ్యతలు, సాంకేతిక అవగాహన లేని ఇన్చార్జి అధికారులపై వందల కోట్ల ప్రాజెక్టుల భారాన్ని వేస్తే అవి ఎలా సాకారమవుతాయని ఆయా జోనల్ కమిషనర్లు అంతర్గతంగా మథనపడుతున్నారు.
నిధులున్నా, ప్రణాళికలున్నా… వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసే పరిపాలనా, సాంకేతిక దక్షత కలిగిన ‘సారథులు’ లేకపోవడం కమిషనర్లకు పెద్ద తలవొప్పిగా మారింది. అంతేకాకుండా ఈ నిరవధిక ఖాళీల ప్రభావం ట్రై కార్పొరేషన్లలో సాగుతున్న అభివృద్ధి పనులపై తీవ్రంగా పడింది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపడుతున్న ‘హైదరాబాద్ సిటీ ఇన్నోవేటివ్ అండ్ ట్రాన్స్ ఫార్మేటివ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్’ (హెచ్-సిటీ) ప్రాజెక్టు రెండున్నరరేళ్లుగా పట్టుమని 10శాతం కూడా పూర్తి కాలేకపోయింది. వర్షాలు ముంచుకొచ్చినా నాలాల విస్తరణ, వ్యూహాత్మక నాలా అభివృద్ధి (ఎస్ఎన్డీపీ) పనులు నత్తనడకన సాగుతున్నాయి.
ఖాళీలను భర్తీ చేయాలి..
పనులను పర్యవేక్షించాల్సిన ఇంజినీర్లపై సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ వంటి ఇతర అదనపు బాధ్యతలు వేయడంతో వారు ఏ పనికీ న్యాయం చేయలేకపోతున్నారని ఆవేదన చెందుతున్న పరిస్థితి. వారిపై అదనపు పనిభారం పడుతుందన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మూడు కార్పొరేషన్లలో యుద్ధ్దప్రాతిపదికన ఇంజనీరింగ్ విభాగం ఖాళీలను భర్తీ చేయకపోతే, విశ్వనగర ప్రగతి కుంటుపడటమే కాకుండా.. ఈ వర్షాకాలంలో నగర ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కూప్పకూలుతున్న ఇంజినీరింగ్ సేవలు
కొత్తవారి రిక్రూట్ మెంట్ నిలిచిపోవడంతో పాటు, పాతవారికి రావాల్సిన ప్రమోషన్లు కూడా నిలిచిపోవడంపై అధికారులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈఎన్సీతో పాటు జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీల్లో ముగ్గురు అధికారులు కేవలం చీఫ్ ఇంజినీర్ ఇన్చార్జి హోదాల్లోనే కాలం వెళ్లదీస్తున్నారు. వీరికి రెగ్యులర్ పోస్టులు దకాలంటే డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ) ఆమోదం తెలపాల్సి ఉంది. కానీ ఆ దిశగా ప్రతిపాదనలు పంపడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫలితంగా డీఈఈ నుంచి ఈఈగా, ఈఈ నుంచి ఎస్ఈగా, ఎస్ఈ నుంచి సీఈగా పదోన్నతులు రాకుండానే అధికారులు రిటైర్ కావాల్సిన దుస్థితి ఏర్పడింది.
స్వయంగా సీఎం రేవంత్ శాఖ అయిన పురపాలిక శాఖను బలోపేతం చేసేందుకు పీహెచ్ఎంఈ విభాగానికి 187 మంది, కొత్త మున్సిపాలిటీలకు 454 మంది, ఎలక్ట్రికల్ ఇంజినీర్లు 113 మంది, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 132మందితో సహా కొత్త ఇంజినీర్లను కేటాయించలేకపోయింది. హైదరాబాద్, వరంగల్ సరిళ్ల పరిధిలోని వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, ఖమ్మం, రంగారెడ్డి, నిజామాబాద్, నల్లగొండ, మెదక్, మహబూబ్ నగర్ వంటి కీలక డివిజన్లలో పనులు పర్యవేక్షించే నాథుడే లేకుండా పోతున్నాడని ఇంజినీర్ల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డీపీసీ నిర్వహించి, ఖాళీలను భర్తీ చేయకపోతే మున్సిపల్ సేవలు కుప్పకూలే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
రిలీవైనా పోస్టింగ్‌కు నోచుకోని ఇంజినీర్లు
మల్కాజిగిరి, జూన్ 28: ట్రై కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో ఇంజినీర్ల బదిలీల్లో పాలకుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఒకవైపు వర్షాకాలం, ముంచుకొస్తున్న వేళ అప్రమత్తంగా ఉండాల్సిన ఇంజినీరింగ్ విభాగం..అధికారుల కొరతతో కొట్టుమిట్టాడుతోంది. నిబంధనల ప్రకారం బదిలీలైతే చేశారు కానీ ఆ స్థానాల్లో కొత్తవారిని నియమించకపోవడంతో పాలన అస్తవ్యస్తంగా మారింది. ఎంఎంసీ పరిధిలో గత 25 రోజులుగా ఇంజినీరింగ్ విభాగం పాలన గాడి తప్పింది. ఇక్కడ ఇన్‌చార్జిలతోనే పాలన నెట్టుకొస్తున్నారు. ఎంఎంసీ పరిధిలో ఈఈ, 8 మంది డీఈఈలు, 5 మంది ఏఈలకు పనిలేకుండా పోయింది. వీరికి జూన్ 1న బదిలీ ఆదేశాలు ఇచ్చారు…ఎంఎంసీ నుంచి జీహెచ్ఎంసీకి అటాచ్ చేశారు. ఎంఎంసీ నుంచి వీరిని రిలీవ్ చేశారు. కానీ జీహెచ్ఎంసీలో మాత్రం పోస్టింగ్ ఇవ్వలేదు.దీంతో వీరికి పనిలేకుండా పోయింది. ఎంఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న వీరి స్థానంలో ఎవరూ రాకపోవడంతో ఇతర అధికారులపై భారం పడుతున్నది.