సిటీబ్యూరో, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : మెట్రో రైలు మూడవ దశ కారిడార్ సవివరణాత్మక ప్రాజెక్టు నివేదికల తయారీకి కన్సల్టెన్సీ సంస్థల ఎంపిక కోసం పిలిచిన టెండర్లలో 5 కన్సల్టెన్సీ సంస్థలు తమ బిడ్లను సమర్పించాయని హైదరాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో సంస్థ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ఆర్వీ అసోసియేట్స్, సిస్ట్రా, యూఎంటీసీ, రైట్స్ సంస్థలు సాంకేతిక అర్హతను సాధించాయన్నారు. వాటి ఆర్థిక బిడ్లను ఆగస్టు 30వ తేదీన మెట్రో రైలు భవన్లో తెరిచినట్లు తెలిపారు. వీటన్నింటిలో ఆర్వీ అసోసియేట్స్ సాంకేతికంగా అత్యంత అధిక మార్కులను పొందడమే కాకుండా మొత్తం 4 ప్యాకేజీల్లోనూ అతి తక్కువ ఆర్థిక బిడ్లను సమర్పించిందని చెప్పారు. టెండర్ నిబంధనల ప్రకారం ఆర్వీ అసోసియేట్స్‌కి రెండు ప్యాకేజీలను ఇచ్చామని, మిగిలిన రెండు ప్యాకేజీలను సాంకేతిక పరంగా రెండవ స్థానంలో ఉన్న సిస్ట్రా సంస్థకు ఇచ్చినట్లు పేర్కొన్నారు.
రెండు నెలల్లో ప్రాథమిక ప్రాజెక్టు నివేదికలు
ఈ రెండు కన్సల్టెన్సీ సంస్థలు వచ్చే రెండు నెలల్లో ట్రాఫిక్ సర్వేలు, రవాణా రద్దీ అంచనాలు, ట్రాఫిక్ అంచనాలు, పలు రకాల రవాణా వ్యవస్థల విశ్లేషణ వంటి వివిధ అధ్యయనాలు పూర్తి చేసి ప్రాథమిక ప్రాజెక్టు నివేదికను (పీపీఆర్) సమర్పించాలన్నారు. ఆ తరువాత 3 నెలల్లో మెట్రో రైలు అలైన్మెంట్, వయాడక్ట్, భూమి ఉపరితల మార్గం, భూగర్భ మార్గం వంటి ఐచ్చికాలు, స్టేషన్లు, డిపోలు, రైల్వే విద్యుత్ ఏర్పాట్లు, సిగ్నలింగ్, రైల్వే సమాచార వ్యవస్థ, రైలు బోగీలు, పర్యావరణం, సామాజిక ప్రభావం, ఆదాయ వ్యయ అంచనా, చార్జీల పట్టిక, ప్రాజెక్టు అమలు విధానం వంటి విషయాలపై సవివరణాత్మక ప్రాజెక్టు నివేదికలను సమర్పించాల్సి ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశానుసారం కన్సల్టెన్సీ సంస్థలను వివిధ కారిడార్లలో సత్వరమే సర్వే పనులను ప్రారంభించాలని ఆదేశించామని తెలిపారు.
ఎస్కలేటర్ ప్రారంభం
మెట్రో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని ఎండీ.ఎన్వీఎస్ రెడ్డి, ఎల్అండ్టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి అన్నారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లో శనివారం కొత్తగా ఎస్కలేటర్‌ను ప్రారంభించారు. ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ నుంచి ప్రతి రోజూ 70వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారని, అందులో భాగంగానే మరో ఎస్కలేటర్ ఏర్పాటు చేశామని తెలిపారు.
Pp