సిటీబ్యూరో, జూలై 18(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అస్సెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఏర్పాటై నేటికి సరిగ్గా ఏడాది పూర్తయింది. చెరువుల విపత్తునిర్వహణతో పాటు ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకోసం ఏర్పాటు చేసిన హైడ్రా ఇప్పటివరకు ఓఆర్ఆర్ లోపల 588 నిర్మాణాలు కూల్చివేసింది. విపత్తు నిర్వహణ, ఆస్తుల రక్షణగా హైడ్రాను ఏర్పాటు చేస్తున్నట్లు జూలైలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. జీహెచ్ఎంసీ, దాని చుట్టూ ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, 33 గ్రామపంచాయతీల వరకు ఈ విభాగం పనిచేస్తుందని ప్రకటించారు.
హైడ్రా ఏర్పాటు చేస్తున్నట్లు జీవోనెం.99 ను గత సంవత్సరం జూలై 19న ప్రభుత్వం విడుదల చేసింది. ఈ సంవత్సరం మొత్తంలో హైడ్రా పెద్దల కంటే పేదల పైనే ఫోకస్ చేసి వారి ఇళ్లపైనే బుల్డోజర్లు పంపడం, చాలామంది ఇళ్లు కోల్పోయి బతుకులు రోడ్డుపాలయిన పరిస్థితిపై విమర్శలు వెల్లువెత్తాయి. కోర్టు సైతం హైడ్రా కమిషనర్‌ను ఈ విషయంలో సీరియస్‌గా ప్రశ్నించింది. అయినా హైడ్రా తనతీరు మార్చుకోలేదు. హైదరాబాద్‌లో చాలా ప్రాంతాల్లో సామాన్యులకు హైడ్రా చేసిన గాయాలు మానడం లేదు. కొందరికి ఒకవైపు ఇల్లు నేలమట్టమై కంటిముందు కనిపిస్తుంటే .
మరోవైపు ఈఎంఐలు కట్టాలంటూ బ్యాంకుల ఒత్తిడి ఆగడం లేదు. మరికొంతమంది తమ దగ్గర అన్ని పర్మిషన్లు ఉన్నా.. అన్ని డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ తమ ఇళ్లు కూల్చివేశారంటూ బాధపడుతున్నారు. బ్యాంకులు లోన్లు ఇచ్చేటప్పుడు చూసుకున్న డాక్యుమెంట్లన్నీ సరిగా ఉంటేనే కదా లోన్లు ఇచ్చేది.. మరి అలాంటిది తమ ఇల్లు బఫర్‌జోన్, ఎఫ్టీఎల్లో ఉంటే బ్యాంకులు లోన్లు ఎలా ఇచ్చాయి.. రిజిస్టేష్రన్లు ఎలా జరిగాయి.. హైడ్రా సంవత్సరంకాలంగా చేసిన కూల్చివేతల్లో పేద, మధ్యతరగతి వారే ఎక్కువగా నష్టపోగా.. వారి జీవితాలు ఆగమ్యగోచరంగా మారాయి. పుండుపై కారం చల్లినట్లు ఒకవైపు ఇల్లు కూలగొట్టారంటూ వాళ్లు బాధపడుతుంటే ఈఎంఐలు కట్టించుకోవడంలో బ్యాంకులు మాత్రం తమ పని తాము చేసుకుపోతున్నాయి. ఇలా ఒకట్రెండు చోట్ల కాదు.. హైడ్రా కూల్చివేతల్లో చాలామంది బతుకులు రోడ్డునపడ్డాయి. తాము పెట్టుకున్న వ్యాపారాలు, తాము బతుకుతూ మరో ఐదారుకుటుంబాలను బతికిస్తున్న వారంతా ప్రస్తుతం వ్యాపారాలు కోల్పోయి కూలీలుగా మారారు.
హైడ్రా ఏర్పాటైన ఈ సంవత్సర కాలంలో ఓఆర్ఆర్ పరిధిలోని చెరువులు, నాలాలు, ప్రభుత్వ ఖాళీ స్థలాలు, జంట జలాశయాలు ఎఫ్టీఎల్లో కట్టడాలను, పార్కు స్థలాల్లో మొత్తం 588 నిర్మాణాలను కూల్చివేసి సుమారు 500 ఎకరాలు స్వాధీనం చేసుకుంది. వీటిలో అత్యధికంగా గాజుల రామారంలోని చింతల్చెరువుల ఒడ్డున 54 నిర్మాణాలను కూల్చేశారు. రాజేంద్రనగర్‌లోని భూమురక్డౌలాలో 45 నిర్మాణాలు ఉన్నాయి. ఇదే క్రమంలో లోటస్‌పాండ్, మన్సురాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, బాచుపల్లి, చందానగర్, ఆమీర్‌పేట, అమీన్పూర్, గుట్టల బేగంపేట, మల్లంపేటలలో పలు నిర్మాణాలను నేలమట్టం చేశారు. రికార్డ్ స్థాయిలో అమీన్పూర్లో నాన్‌స్టాప్‌గా 17 గంటలపాటు కూల్చివేతలు చేపట్టింది. పటేల్‌గూడలో 16 విల్లాలు, ఒక హాస్పిటల్, 2 అపార్ట్మెంట్లు కూల్చేశారు.
మేం కబ్జాదారులం కాదు.. రిటైర్డ్ ఉద్యోగులం.1956 నుంచి మాకు డాక్యుమెంట్లు ఉన్నాయి. కష్టపడి ఇక్కడ కొనుక్కున్నాం. కానీ హైడ్రా ఇప్పుడొచ్చి మా భూముల ఇల్లు సున్నంచెరువులో ఉన్నాయని బెదిరిస్తున్నారు. గత సంవత్సరం నుంచి మా కంటిమీద నిద్ర లేకుండా చేస్తున్నారు. మాకు అన్ని రకాల పర్మిషన్లు ఉన్నాయి, ఎల్ఆర్ఎస్ కట్టినా కానీ ఈ భూములు చెరువు ఎఫ్టీఎల్లో ఉన్నాయంటున్నారు. కోర్టు ఆర్డర్లు కూడా పట్టించుకోవడం లేదు. సున్నం చెరువు విస్తీర్ణం విషయంలోనే రెవెన్యూ, ఇరిగేషన్, హెచ్ఎండీఏ శాఖల మధ్యే సమన్వయం లేదు. చెరువు అల్లాపూర్‌లో ఉంటే గుట్టలబేగంపేటలో సంబంధం లేని సర్వే నెంబర్లను టార్గెట్ చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఏదైనా కావాలంటే కోర్టుకు వెళ్లండి. లేదా సీఎంను కలుద్దామంటున్నారు.
– శివశంకర్, సియేట్ కాలనీ వాసి
పీర్జాదిగూడలో అక్రమనిర్మాణాలపై హైడ్రా విరుచుకుపడింది. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పీర్జాదిగూడ అక్రమ నిర్మాణాలను హైడ్రా నేలమట్టం చేసింది. ఇక్కడి రోడ్లు, ప్రభుత్వ స్థలాలు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినప్పటికీ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పర్వతాపూర్‌లో నిర్మాణాలను కూల్చేశారు. ఈ స్థలం తాము కొనుగోలు చేసి న తర్వాత ఎల్ఆర్ఎస్ కట్టాం. అన్ని అనుమతులు కూడా తీసుకున్నాం. ఇంటి పన్ను, కరెంట్ బిల్లు కడుతూనే ఉన్నాం. అయినా ఇప్పుడు హైడ్రా వచ్చి ప్రభుత్వభూమిలో కట్టుకున్నాం అని అంటున్నారు. తెల్లవారుయామునే వచ్చి కూల్చేశారు. మా బతుకులు రోడ్డున పడేశారు.
– శ్రీకాంత్‌రెడ్డి, పీర్జాదిగూడ
కత్వా చెరువు సమీపంలో విల్లా కొనేందుకు రూ.70 లక్షలు లోన్ తీసుకున్నా. సరిగ్గా పదకొండు నెలల క్రితం మా ఇల్లు హైడ్రా కూల్చేసింది. అయినా ప్రతినెలా రూ.51,258 ఈఎంఐ నా అకౌంట్ నుంచి కట్ అవుతుంది. ఇళ్లు కూల్చేసినా.. కనీసం స్థలం నాదే అయినా నాది కాదని తెలిసినా డబ్బులు కట్టాల్సిందే. న్యాయం కోసం ప్రతి అధికారిని కలిశాం. ఎక్కడా మా గోడు వినే దిక్కే లేదు. ఇదెక్కడి ప్రభుత్వం. ఇదేం పద్ధతి. మా ఇల్లు కూల్చేసి మాకు వేరే దారి చూపించదా. బ్యాంక్‌లకు వెళ్లి ఏదైనా రిక్వెస్ట్ చేస్తే వన్‌టైమ్ సెటిల్మెంట్ చేసుకోండి అంటున్నారు.. తప్ప మా నష్టాన్ని పట్టించుకోరట. ఇక హైడ్రా ఆఫీస్‌కు వెళ్లినా.. కమిషనర్‌ను కలిసినా ఏం ఫలితం లేదు. న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలి.. ఎవరిని కలవాలి. సర్కార్ తీరు బాగాలేదు.
– శశాంక్, మల్లంపేట్