సిటీబ్యూరో, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. దీంతో అర్ధరాత్రి నుంచి కొన్ని ప్రాంతాల్లో బస్సులు బంద్ అయ్యాయి. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉన్నవే.. పరిష్కరించాలని ఆర్టీసీ జేఏసీ కోరినా సర్కార్ పట్టించుకోలేదు. సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి సెక్రటేరియెట్లో చర్చలు జరిపినా సమస్యల పరిష్కారానికి దారి పడలేదు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో పాటు 32 డిమాండ్లను కమిటీ ముందు ఉంచారు. సుదీర్ఘంగా సాగిన చర్చలు చివరికి విఫలమయ్యాయి. తమ సమస్యలను పట్టించుకునే స్థితిలో ప్రభుత్వం లేదని సమ్మెకు దిగుతున్నట్టు ఆర్టీసీ జేఏసీ ప్రకటించింది. డైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది అంతా సమ్మె పోరులో కదం తొక్కారు. తమను కాదని ప్రభుత్వం మొండి పట్టుదలకు పోయి అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడిపించాలని చూస్తే.. అది ప్రజల ప్రాణాలకే ప్రమాదమని ఆర్టీసీ జేఏసీ నాయకులు వెంకన్న, థామస్ రెడ్డి హెచ్చరించారు.
బస్సులు రోడ్లపైకి వస్తే ఆగమాగం చేస్తామని హెచ్చరించారు. గ్రేటర్లో ప్రతి రోజు 2800 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. సుమారు 24 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇందులో మహాలక్ష్మి స్కీం ఉచిత బస్సుతో 17 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. ఇప్పుడు సమ్మె తో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోనున్నారు. ఆర్టీసీ కార్మికులు తమ సమ్మెపై ప్రభుత్వానికి ముందస్తుగా నోటీసు ఇచ్చినప్పటికీ డిమాండ్లు పరిష్కరించడంలో ప్రభుత్వం చొరవ చూపకపోవడంపై నగర ప్రయాణికులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సర్కార్ మొండి వైఖరితో తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. కాగా, నగరంలో 1700 బస్సులు రాకపోకలు సాగిస్తాయని గ్రేటర్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రైవేట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందితో బస్సులు నడిపిస్తామని అన్నారు. మరోవైపు ఆర్టీసీ సమ్మెకు వాహన సంఘాల నాయకులు, పేద ప్రజల సంక్షేమ సంఘం తదితర నాయకులు మద్దతు పలికారు.
సమ్మె విజయవంతం చేస్తాం
ఈవీ బస్సుల పేరుతో తమ ఉద్యోగాలపై వేటు వేయాలని సర్కార్ చూస్తున్నది. ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే ఆలోచనలు రద్దు చేసుకోవాలి. మీకు వచ్చే కమీషన్ల కోసం ఆర్టీసీ కార్మికుల పొట్ట కొట్టొద్దు. సమ్మెలో ప్రతి ఒక్కరం పాల్గొని విజయవంతం చేస్తాం. ఎవ్వరి బెదిరింపులకు భయపడేది లేదు. ప్రభుత్వం దిగివచ్చి మా డిమాండ్లను పరిష్కరించాలి.
-శ్రీరాములు, డ్రైవర్
బెదిరింపులకు భయపడం
సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెకు దిగుతామని గతంలోనే ప్రభుత్వానికి నోటీసు ఇచ్చాం. నెల రోజులు సమయమిచ్చాం. అయినా ఇంకా సమయం అడుగుతున్నారు. ఇది సరైనది కాదు. కార్మికుల సమస్యలను పట్టించుకోని రేవంత్ సర్కార్ చివరికి మొండిచెయ్యి చూపించింది. దీంతో మేము ఉద్యమ బాట పట్టాల్సి వచ్చింది. ప్రైవేట్ పరం చేసి ఆర్టీసీని ఎత్తేయ్యాలనే కుట్ర జరుగుతోంది. నష్టాల్లో ఉన్న మెట్రోను ప్రభుత్వం చేరదీసినప్పుడు ఆర్టీసీ ఏం అన్యాయం చేసింది? ఆర్టీసీలో కార్మికులపై యాజమాన్యం వేధింపులు ఎక్కువయ్యాయి. ఎవరి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు. రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిలన్నింటిని చెల్లించాలి.
– శ్రీనివాస్, సికింద్రాబాద్ రీజియన్ జేఏసీ చైర్మన్