సిటీబ్యూరో, జూలై 30 (నమస్తే తెలంగాణ): చినుకు పడితే చాలు నగరంలో చీకట్లు అలుముకుంటున్నాయి. గాలివానకు తరచూ విద్యుత్ అంతరాయాలు ఏర్పడుతున్నాయి. చిన్న వర్షం పడితే చాలు కరెంట్ పోవడం, మరమ్మతులకు ఎక్కువ సమయం పట్టడంతో నగరవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిసార్లు రాత్రిళ్లు జాగారమే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఈ పదిరోజులుగా హైదరాబాద్‌లో కురుస్తున్న వర్షాలకు చాలా చోట్ల విద్యుత్ సరఫరాల్లో అంతరాయం ఏర్పడటం, చెట్లు విరిగిపడడం, కొమ్మలు పడిపోవడం వంటివి జరిగాయి.
అధికారుల అలసత్వం..
వానను సైతం లెక్కచేయక సిబ్బంది, అధికారులు రాత్రింబవళ్లు పనిచేస్తున్నారని డిస్కం చెబుతోంది. కానీ కొన్ని ప్రాంతాల్లో అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది సరిపడా లేకపోయినా.. కొన్నిచోట్ల ఉన్నప్పటికీ స్తంభాలు ఎక్కేందుకు ముందుకు రావడం లేదని చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితిని సంస్థ సీఎండీ ముషారఫ్ ఫరూఖి సమీక్షించినప్పుడు సరఫరా పునరుద్ధరించకుండానే కొందరు ఇంజినీర్లు పూర్తయినట్లు చెప్పడంతో సీఎండీ సీరియస్ అయ్యారు. మరమ్మతులు పూర్తయితే ఫీడర్ ఔటర్ మేనేజ్మెంట్ సిస్టంలో రెడ్‌మార్క్ ఎందుకు చూపిస్తున్నదంటూ ప్రశ్నించారు. కాగా, స్తంభాలు కూలినప్పుడు ఇతర నిర్వహణకు సంబంధించి కాంట్రాక్టర్లు, అధికారులకు మధ్య నిబంధనల గొడవ సరఫరా పునరుద్ధరణ ఆలస్యమవడానికి కారణమవుతోంది.
కొమ్మలు తొలగించడంలో జాప్యం..
ఇటీవల కురిసిన వర్షాలకు సరూర్‌నగర్, మేడ్చల్, రాజేంద్రనగర్ తదితర సర్కిళ్లలో పలుచోట్ల కొమ్మలు కొట్టేసినట్లు మెయింటెనెన్స్‌లో చూపి నామమాత్రంగా తీసేశారని డిస్కంలో చెవులు కొరుక్కుంటున్నారు. మెయింటెనెన్స్‌లో ఇది కామన్ అని, కానీ క్షేత్రస్థాయిలో సైప్లె సమస్యలు ఎదురైనప్పుడు ఇలాంటివి బయటకు వస్తున్నాయని, అయితే వర్షాకాలం కావడంతో మళ్లీ చెట్లకొమ్మలు పెరిగాయని చెబుతున్నట్లు అధికారులు అంటున్నారు.
ఈ మధ్యకాలంలో కురిసిన వర్షాలకు 140కి పైగా విద్యుత్ స్తంభాలు, 90 డీటీఆర్లు దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. సుమారుగా 1300 ఫీడర్లలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి మళ్లీ పునరుద్ధరించారు. ఇందులో సగానికిపైగా చెట్ల కొమ్మలు పడిపోవడమే కారణంగా తెలుస్తోంది. వర్షాకాలంలో ఇబ్బందిగా ఉంటుందని ముందు నుంచే చెట్లకొమ్మలు తొలగించాలని టెలీ కాన్ఫరెన్స్‌లో అధికారులకు సీఎండీ చెప్పినప్పటికీ తమ పద్ధ్దతి మార్చుకోకపోవడంపై సీఎండీ ఇటీవల సీరియస్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో మెయింటెనెన్స్‌లో లోపం రావొద్దని హెచ్చరించారు.
గంటలకొద్దీ బంద్..
మంగళ్‌హట్‌లో ఐదుగంటలుగా కరెంట్ లేదని, ప్రతీసారి ఇదే పరిస్థితి ఉంటుందని వంశీయాదవ్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. నిజాంపేటలో రోజులో మూడు గంటలు కరెంట్ పోగా, మరికొన్ని గంటల్లో పదిసార్లు కట్ చేశారని రాజేశ్ అనే స్థానికుడు ఫిర్యాదు చేశాడు. చాదర్‌ఘాట్ మూసానగర్‌లో గంటల కొద్దీ కరెంట్ తీసేస్తున్నారని, ఫిర్యాదు చేయడానికి ఫ్యూజ్ ఆఫ్ కాల్‌కు ఫోన్‌చేసినా, విద్యుత్ శాఖ తమ సర్కిల్‌కు సంబంధించి ఇతర ఏ అధికారికి చేసినా స్పందన లేదని, ఆఫీసుకు వెళ్తే కూడా.. పెద్దగా స్పందించడం లేదని ఇమ్రాన్ అనే వ్యక్తి చెప్పారు.
వర్షం పడుతున్న సమయంలో తాము ఎన్ని సార్లు ఫోన్ చేసినా విద్యుత్ సిబ్బంది స్పందించడం లేదని చాలామంది వినియోగదారులు సోషల్‌మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రాత్రంతా జాగారం చేయాల్సిన పరిస్థితి ఉండడంతో తమ పరిస్థితి మరీ దారుణంగా ఉందని పలు ప్రాంతాల నుంచి స్థానికులు తమ ఫిర్యాదుల్లో పేర్కొన్నారు.