బడంగ్‌పేట, జూన్ 29 :తెలంగాణ ఉద్యమ గొంతు సాయిచంద్ హఠన్మరణంతో రాష్ట్రం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఆయన పార్థివ దేహాన్ని కడసారి చూసేందుకు అభిమానులు, బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున గుర్రంగూడకు తరలివచ్చారు. ఎవరిని తట్టినా సాయిచంద్‌తో ఉన్న అనుబంధాలను గుర్తు చేసుకొని బోరున ఏడ్చేశారు. కళాకారులు అంతిమ యాత్రలో పాల్గొని వారి పాటలతో వీడ్కోలు పలికారు.
తెలంగాణ స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ అకాల మరణం కలిచివేసింది. ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ, కుటుంబ సభ్యులకు మనోధైర్యం కల్పించాలని దేవున్ని ప్రార్థిస్తున్నాను.
– నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
అనేక కీలక ఉద్యమాల్లో కవిగా, కళాకారుడిగా, గాయకుడిగా, ఉద్యమకారుడిగా చిన్నతనంలోనే పేరుతెచ్చుకున్న యువ నాయకుడు సాయిచంద్. ఆయన మృతి దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.
– ఎమ్మెల్సీ ఎల్.రమణ
రాతిబొమ్మల్ని సైతం కరిగించిన గాత్రం సాయిది. గట్టి పట్టుదల, నిండైన ఆత్మవిశ్వాసంతో పైకి ఎదిగిండు. అసూయాగ్రస్త లోకం తనను ఆడిపోసుకుంటున్నదని చాలా సార్లు చెప్పిండు. సుడిగాలిలా వచ్చిండు. కండ్లలో నీళ్లు సుడులు తిరిగేట్టు పాడిండు. గులాబీ సభలకు తనే గాన సుగంధమయిండు. అర్ధాయుషుడై ఇట్లా ఆవిరైపోయిండు. అన్నా అని ఆప్యాయంగా పిలిచే తన పిలుపు ఇక వినరాదు. బహిరంగ సభలలో గంటలకొద్దీ మోగిన కంఠం శాశ్వతంగా మూగపోయింది. సాయిచంద్ లేడు . విషాద గీతికను మిగిల్చి వెళ్ళిపోయాడు. జోహార్ సాయీ.
– ఎమ్మెల్సీ, కవి దేశపతి శ్రీనివాస్
ఉద్యమాన్ని పదునెక్కించిన తెలంగాణ ఉద్యమ గాయకుడు, మిత్రుడు సాయిచంద్‌కు నివాళి. రాష్ట్ర పునర్నిర్మాణంలో సైతం ప్రజలను చైతన్యం చేస్తున్న సాయిచంద్ మరణం నమ్మలేకపోతున్నా. తెలంగాణ గొప్ప గొంతుకను కోల్పోయింది.
– అందోల్ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
తెలంగాణ సమాజం గొప్ప గొంతుకను కోల్పోయింది. ఉద్యమంలో, పునర్నిర్మాణంలో తనది విస్మరించలేని పాత్ర. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాధించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్న.
– టీఎస్టీఎస్ చైర్మన్ పాటిమీది జగన్మోహన్రావు
నాలుగు కోట్ల మంది ప్రజల హృదయాల్లోకి తెలంగడాణ అస్తిత్వ పాటను తీసుకెళ్లిన ప్రజల గొంతుక సాయిచంద్ అనే పాటల శిఖరం నేలకొరిగింది. మూడు దశాబ్దాలుగా ప్రజల పాటను తన కంఠంలో పెట్టుకొని పాటే ప్రాణప్రదంగా జీవించిన యువ కవి సాయిచంద్.
– తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్
పాలమూరు మట్టి వాసన నుంచే సాయి చంద్ పాట పల్లె పల్లెకు పాకింది. సాయిచంద్ మాటకాడే, పాటకాడే కాదు గొప్ప ఉద్యమకారుడు. వామపక్ష భావజాలంతో వచ్చిన వాడు కనుకనే ప్రజల సాదక బాధలు తెలిసి తన పాటల ద్వారా చైతన్యం వైపు నడిపించిన గొప్ప వ్యక్తి . అలాంటి సాయి చంద్ లేని లోటు తీర్చలేనిది. తెలంగాణ ఉద్యమానికి, ప్రజలకు తీరని లోటు.
– అల్లం నారాయణ, తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్
ఉద్యమాన్ని ఉగ్గుపాలతో నేర్చుకున్న యువకుడు సాయిచంద్ అర్ధాంతరంగా మరణించడం తెలంగాణ సమాజానికి తీరనిలోటు. ఆయన కవిగా, రచయిత, కళాకారుడిగా ఎంతో మందిని చైతన్యం చేశారు. గొప్ప కవి, కళాకారుడిని తెలంగాణ కోల్పోయింది.
– వి.ప్రకాశ్, టీఎస్ఐడీసీ మాజీ చైర్మన్
ఉడుకు నెత్తురు.. ఉద్యమ స్ఫూర్తి.. ఉప్పొంగిన గేయం సాయిచంద్. నిప్పుల ప్రవాహం నింగినంటేలా నిలిచి ఎగిసిన గానం సాయిచంద్. పికటిల్లే తెలంగాణ పాట ప్రతిరూపం సాయి చంద్. చకటి ప్రగతి పాలపిట్ట ఆట సాయిచంద్. నీ స్వరం నిత్యం మా మనసులో నిలిచి ఉంటుంది. నిషల్మషమైన నీ నవ్వు నిరంతరం మమ్మల్ని పలకరిస్తూ ఉంటుంది. ఉద్యమ వీరుడా జోహారు.
– నమస్తే తెలంగాణ
ఎడిటర్ తిగుళ్ళ కృష్ణమూర్తి
తెలంగాణ జాతి గుండెచప్పుడు మూగబోయింది. మట్టిపాట, సాహితీవేత్త సాయిచంద్ అకాలమరణం తీరనిలోటు. ఉజ్వల భవిష్యత్ ఉన్న నాయకుడు. తెలంగాణ సోయిని నరనరాన పుణికిపుచ్చుకున్న సాయిని కోల్పోవడం దురదృష్టకరం.
– భాషా, సాంస్కృతిక సంచాలకుడు మామిడి హరికృష్ణ,
తెలంగాణ స్వరాష్ట్ర సాధనోద్యమం రెక్కలు తొడుగుతున్న కాలంలో అరుణోదయ నగర కార్యదర్శిగా పనిచేస్తూనే.. విప్లవ పంథా నుంచి ప్రత్యేక తెలంగాణ ఉద్యమంవైపు పయనమయ్యాడు. తెలంగాణ సాధన అనంతరం పునర్నిర్మాణంలో ఆయన భాగమయ్యారు. ఆయన అకాల మరణం తీరనిలోటు.
– కె.గోవర్దన్, సీపీఐఎంఎల్, న్యూ డెమోక్రసీ
సమైక్య పాలకుల అణచివేత ధోరణికి వ్యతిరేకంగా పోరాడారు. ఆత్మగౌరవం ఉన్న కళాకారుడు సాయి చంద్. ఆంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా బడుగు, బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి. భౌతికంగా మనమధ్య లేకపోయినా.. జనం నాలుకల మీద సాయి చంద్ జీవించే ఉంటారు.
– జయరాజ్, కవి
పాటకు ప్రాణం పోసిన గొప్ప వ్యక్తి సాయి చంద్. ఏ బహిరంగ సభ జరిగినా సాయి చంద్ పాటకోసం ప్రజలు వేచి ఉండేవారు. రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా.. రక్తం బంధం విలువ నీకు తెలుసా పాటల ద్వారా సాయిచంద్ ప్రత్యేక గుర్తింపును పొందడమే గాకుండ ప్రజలందరికీ చేరువయ్యారు.
– మిట్టపల్లి సురేందర్, గాయకుడు
కొత్తతరం ప్రజాగాయకుల్లో సాయిచంద్ ఒక సునామి. ఆయన ఒక సాంస్కృతిక విస్ఫోటనం. అమరుల గురించి పాడినా, అంబేద్కర్ గీతం ఆలపించినా, గుండెను సముద్రంగా మార్చే పరమ ఆర్ధ్రమైన అగ్నికంఠ గానం ఆయన సొంతం.
– డాక్టర్ కోయి కోటేశ్వర్రావు