రామచంద్రాపురం, జూన్ 22 : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా కొల్లూరులో 145 ఎకరాల విస్తీర్ణంలో 117 బ్లాక్‌లలో 15,660 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. ఆసియాలోనే అతిపెద్ద సామాజిక గృహ సముదాయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖద్వారంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సీఎస్ శాంతికుమారి, రాష్ట్ర మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, మహమూద్‌అలీ, మల్లారెడ్డి, సబితాఇంద్రారెడ్డిలతో కలిసి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. అనంతరం బగ్గీ వాహనంలో సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని మొత్తం తిరిగి పరిశీలించారు. ప్రాజెక్టు వివరాలను మంత్రి కేటీఆర్, అధికారులు సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఆ తర్వాత 93వ బ్లాక్‌లో ఏర్పాటు చేసిన స్టేజీ వద్దకు సీఎం కేసీఆర్ చేరుకొని డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలు, ఇంటి తాళాలను అందజేశారు. అనంతరం లబ్ధిదారులు గృహప్రవేశం చేశారు.