Real Estate | సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/కుత్బుల్లాపూర్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): గత ఏడాది కాలంగా హైదరాబాద్ మహా నగరంలోని రియల్ రంగాన్ని స్తబ్దత ఆవహించిందనేది బహిరంగ రహస్యం. బయటికి దేశంలోనే ఈ స్తబ్ధ్దత ఉందనే ప్రకటనలు వస్తున్నా… పాలకుల నిర్ణయాల పర్యవసానం కూడా రియల్ రంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపిందనేది అక్షర సత్యం. అప్పులు తీర్చలేకనే తనువు చాలిస్తున్నాను అంటూ కొంపల్లికి చెందిన వేణుగోపాల్‌రెడ్డి బలవన్మరణానికి పాల్పడిన తాజా విషాద సంఘటన ఆందోళనకు గురి చేస్తున్నది. హైదరాబాద్ అనేది రియల్ రంగానికి స్వర్గదామం అని గతంలో ఎన్నో సర్వేలు రుజువు చేశాయి. అంతేకాదు… అత్యంత సురక్షిత, ప్రశాంతమైన ప్రపంచ నగరాల్లో హైదరాబాద్‌కు కూడా సముచిత స్థానం ఉండటంతో జాతీయ, అంతర్జాతీయ రియల్, నిర్మాణ రంగ ప్రాజెక్టులు ఇక్కడికి వచ్చేందుకు పోటీపడ్డాయి. కానీ ఇదంతా ‘గతమెంతో ఘనం’గా మారిపోయింది.
గత ఏడాది కాలంగా హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల్లో రియల్, నిర్మాణ రంగంలో మునుపెన్నడూలేని స్తబ్దత నెలకొందని అనేక సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీనితో పాటు ప్రభుత్వపరంగా వచ్చే స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంలోనూ గతంతో పోలిస్తే గణనీయమైన తగ్గుదల నమోదవుతుంది. ఇక… జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏకు నిర్మాణాలపరంగా వచ్చే ఆదాయాల్లోనూ భారీ తగ్గుదల కనిపిస్తున్నది. అయితే మళ్లీ రియల్ రంగం పుంజుకోకపోదా! అని ఆశగా ఎదురుచూడటం వరకు బాగానే ఉంది. కానీ గతంలో మొదలై ఇప్పుడు విక్రయాల దశలో ఉన్న నిర్మాణ ప్రాజెక్టులకు ఈ పరిణామం దినదిన గండంలా మారింది. చేతిలో ఉన్న కోట్లాది రూపాయలతో పాటు అందినకాడికి ప్రైవేటు అప్పులు, అవసరమైనకాడికి బ్యాంకు రుణాలు తెచ్చి చేపట్టిన ఈ ప్రాజెక్టులపై వడ్డీ భారం నానాటికీ గుదిబండలా మారుతున్నది.
దీనికి తోడు విక్రయాలు జరగకపోవడంతో మార్కెట్లోనూ నైరాశ్యం నిండుకుంటున్నదని రియల్ నిపుణులే వాపోతున్నారు. గత ఏడాది కాలంగా రియల్, నిర్మాణ రంగంలో స్తబ్దత నెలకొనగా… దీనికి తోడు పాలకులు తీసుకున్న నిర్ణయాలు మూలిగే నక్కపై తాటిపండులా మారాయి. ముఖ్యంగా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తీసుకువచ్చిన హైడ్రా కారణంగా సామాన్యుడు హైదరాబాద్, చుట్టుపక్కల ఎక్కడైనా ఫ్లాటు కొనాలన్నా జంకుతున్నారనేది క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవం. ఆ నిర్మాణం చెరువు ఎఫ్టీఎల్, బఫర్‌లో ఉందా? దాని వెనక ప్రభుత్వ, ఇతరత్రా స్థలాల లింకుల ఏమైనా ఉందా? ఇప్పుడు అన్ని అనుమతులు చూపెడుతున్నా… రేప్పొద్దున అవన్నీ అక్రమమని తేలిస్తే మన పరిస్థితి ఏమిటి? అందుకు అనేక ప్రత్యక్ష ఉదాహరణలు కూడా ఉన్నాయి కదా… ఇవీ సామాన్యుడి ఆలోచన తీరు. ఇదే నిర్మాణ ప్రాజెక్టుల విక్రయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని ఓ రియల్టర్ తెలిపారు. ప్రభుత్వ పెద్దలు, అధికారులు తరచూ ఫీల్‌గుడ్ అన్నట్లుగా అంతా బాగుందని చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని అంటున్నారు.
ఒక్కొక్క మెట్టు ఎక్కుదామని…
రెండ్రోజుల కిందట ఆత్మహత్య చేసుకున్న బల్డర్ వేణుగోపాల్‌రెడ్డి దాదాపు ఎనిమిది ఏండ్లుగా రియల్-నిర్మాణ రంగంలో ఉన్నారు. తన మిత్రులతో కలిసి పలు నిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేశారు. అవి విజయవంతంగా పూర్తవ్వడంతో తద్వారా వచ్చిన వ్యాపార, ఆర్థిక ప్రోత్సాహంతో సొంతంగా రియల్ రంగంలో నిలదొక్కుకునేందుకు మొదటి అడుగు వేశారు. తన కుమార్తె ఆద్య పేరిట గుండ్ల పోచంపల్లిలో అపార్టుమెంటు నిర్మాణాన్ని మొదలుపెట్టారు. గుండ్ల పోచంపల్లిలోని ఏజీ కాలనీలో 480 చదరపు గజాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న ఈ అపార్టుమెంటులో పది ఫ్లాట్లు అంటే ఒక్కో ఫ్లాటు విస్తీర్ణం కనీసంగా రెండువేల చదరపు అడుగుల పైమాటే. అక్కడ చదరపు అడుగు రూ.5500-6వేల వరకు నడుస్తున్నది వ్యాపారులు చెబుతున్నారు. ఆ ప్రాజెక్టు టర్నోవర్ పది కోట్లకు పైగా ఉంటుందని తెలుస్తున్నది. కోట్లాది రూపాయల వ్యాపారం చేస్తున్నప్పటికీ వెంట వెంటనే అవి అమ్ముడుపోతే అటు అప్పులు, బ్యాంకు రుణాలు తీరడంతో పాటు చేతిలో పది రూపాయలు కనిపించేవి. నెలల తరబడి ఫ్లాట్స్ బుక్ కాకపోవడం, తెచ్చిన అప్పులు, రుణాలపై వడ్డీ, ఈఎంఐలు పేరుకుపోతుండటంతోనే వేణుగోపాల్‌రెడ్డి ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయారని అక్కడి రియల్ వ్యాపారులు పేర్కొంటున్నారు.