బంజారాహిల్స్, జనవరి 12 : బంజారాహిల్స్ రోడ్ నం 14లోని నందినగర్ గ్రౌండ్‌లోని దాదాపు రూ.30 కోట్లు విలువచేసే ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించినవారిని షేక్‌పేట మండల సిబ్బంది అడ్డుకున్నారు. నందినగర్ బస్టాప్‌లో భారీగా వెలిసిన ఆక్రమణలను 4నెలల క్రితం షేక్‌పేట మండల అధికారులు తొలగించిన విషయం తెలిసిందే. అయితే గత పదిరోజులుగా నందినగర్‌లోని శ్రీ హనుమాన్ ఆలయం వెనకాల ఉన్న సుమారు 1,000 గజాల ప్రభుత్వ స్థలంలో కొంతమంది మట్టిని తీసుకువచ్చి పోయడంతో పాటు చదును చేస్తున్నారు. ఈవిషయమై షేక్‌పేట తహసీల్దార్‌కు పలు ఫిర్యాదులు అందాయి. దీంతో సోమవారం రెవెన్యూ సిబ్బంది అక్కడకు వెళ్లి.. ఇది ప్రభుత్వ స్థలం అని, ఇక్కడ డంపింగ్, ఆక్రమణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంబంధిత స్థలంలో ప్రభుత్వ హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు.