ప్రత్యేక ఓటరు నమోదు(ఎస్ఐఆర్) ప్రక్రియ నగర ప్రజలను తీవ్ర గందరగోళానికి గురిచేస్తున్నది. క్షేత్రస్థాయిలో ఓటరు నమోదు పత్రాల పంపిణీలో బీఎల్వోల తీరు ప్రజల్లో అభద్రతాభావాన్ని పెంచుతున్నాయి. మంగళవారంతో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తిచేయాలనే ఆదేశాలున్నా.. చాలా ప్రాంతాల్లో సగం మంది ఓటర్లకు కూడా ఫారాలు అందజేయనట్లు సమాచారం. అయితే ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉండటంతో అందరికీ ఫారాలు పంపిణీ చేసినట్లు బీఎల్వోలు నివేదికలు సిద్ధం చేసుకుంటున్నారు. సమయం పూర్తయినా తమకు పత్రాలు ఇవ్వకపోవడంతో ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు నింపే క్రమంలో, ప్రజాప్రతినిధులు, బీఎల్ఏలకు ఏమైనా అనుమానాలు వచ్చినప్పుడు నివృత్తి చేసుకునేందుకు ఫోన్ చేస్తే బీఎల్వోలు స్పందించడం లేదు. ఉప్పల్ సర్కిల్ చిలుకానగర్ పరిధిలో.. ఓ బీఎల్వో ఎన్యూమరేషన్ ఫారాలను స్థానిక కాంగ్రెస్ నేత దగ్గర పెట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది. సర్ ప్రక్రియలో ప్రజలకు సహాయం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌లు అలంకారప్రాయంగా మారాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
– సిటీ బ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ)/మల్కాజిగిరి
సిటీ బ్యూరో, మల్కాజిగిరి, జూలై 7 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియ నగర ప్రజలను తీవ్ర అయోమయంలోకి నెట్టేస్తున్నది. ఓటరు నమోదు పత్రాల పంపిణీలో సిబ్బంది నిర్లక్ష్యంతో ఇబ్బందులు పడుతున్నా రు. క్షేత్రస్థాయిలో బీఎల్వోల తీరు ప్రజల్లో అభద్రతాభావం పెంచుతున్నది. మంగళవారంతో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ పూర్తి చేయాలనే ఆదేశాలున్నా సగం మంది ఓటర్లకు కూడా అందజేయలేదు. కానీ అధికారుల ఒత్తిడితో అందరికీ పంపిణీ చేసినట్లు నివేదికలు సిద్ధం చేసుకుంటున్నారు. పంపిణీ చేయని ఎన్యూమరేషన్ పత్రాలను కూడా సర్ యాప్‌లో స్కాన్ చేసుకుని అన్నింటినీ ఓటర్లుకు అందజేసినట్లు లెక్కల్లో చూపుతున్నారు. దీంతో సమయం పూర్తయినా తమకు పత్రాలు ఇవ్వకపోవడంపై ఓట ర్లు ఆందోళన చెందుతున్నారు. ఎన్యూమరేషన్ పత్రాలు అందకపోతే ఓటు పోతుందని భయపడుతున్నారు. బీఎల్వోలు మాత్రం అవేమీ పట్టించుకోకుండా పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మరికొన్ని చోట్ల ఇంట్లో ఉన్నవాళ్లందరికీ ఇవ్వకుండా ఒకరిద్దరికి అందించి పత్రాలు అయిపోయాయని చెప్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఓటు ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు ఫామ్ -8ను ఇవ్వాలని ఓటర్లు కోరినా తమ దగ్గర లేవని చెప్తున్నారని వాపోతున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు నింపే క్రమంలో ఏమైనా అనుమానాలు వచ్చినప్పుడు నివృత్తి చేసుకునేందుకు ఓటర్లు ఫోన్ చేస్తే స్పందించడం లేదు. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారని ఓటర్లు ఆరోపిస్తున్నారు. రాజకీయ పార్టీల బీఎల్ఏలు, ప్రజాప్రతినిధులు ప్రయత్నించినా అందుబాటులో ఉండ టం లేదని తెలుస్తున్నది. బీఎల్వోల తీరుతో నగర ఓటర్లు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.
ఉప్పల్ సర్కిల్ పరిధిలోని చిలుకానగర్ ప్రాంతంలో ఓ ఇంటి యాజమానికి చెందిన ఎన్యూమరేషన్ పత్రాలను కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులకు ఎన్యూమరేటర్లు అందజేసినట్లు తెలుస్తున్నది. దీంతో ఆయన తమ ఓటరు పత్రాలు రాలేదని బీఎల్ఓను సంప్రదిస్తే, ఫలానా నాయకులకు ఇచ్చామని చెప్పడంతో అవాక్కయ్యారు. తాము పార్టీ నాయకుల ఇంటికి వెళ్లి పత్రాలు తెచ్చుకోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఓటర్ల ఇంటికి వెళ్లి పత్రాలు అందజేసి, సంతకాలు తీసుకోవాల్సిన బీఎల్ఓలు రాజకీయ నాయకుల చేతికి పత్రాలు ఎలా ఇస్తారని నిలదీస్తున్నారు. రాజకీయ నాయకుల చేతికి పత్రాలు ఇస్తే, తమకు ఇష్టంలేని వారు, తమ పార్టీ కానీ వారికి పత్రాలు ఇవ్వకుంటే ఓటును కోల్పోయే ప్రమాదం ఉంది. ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి రాజకీయ పార్టీలకు ఎన్యూమరేషన్ పత్రాలు ఇస్తున్నవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మల్కాజిగిరి జోన్ సహా గ్రేటర్‌లోని పలు ప్రాంతాల్లో పంపిణీ చేయకముందే వంద శాతం పూర్తయినట్లు నివేదికలు సిద్ధం చేస్తున్నారు. ఎన్యూమరేషన్ పత్రాల పంపిణీ తక్షణమే పూర్తిచేయాలని ఉన్నతాధికారులు గడువు విధించడంతో పత్రాల పంపిణీలో ఎన్యూమరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పత్రాలను యాప్‌లో స్కాన్ చేస్తూ లెక్కల్లో చూపుతున్నారు. పలు పోలింగ్ బూత్‌లలో వంద శాతం పత్రాలు పంపిణీ చేసినట్లు చూపుతుండగా ఓటర్లు మాత్రం తమకు పత్రాలు చేరలేదని హెల్ప్‌డెస్క్‌లను సంప్రదిస్తున్నారు. వందశాతం పూర్తిచేయడం అంటే పారదర్శకతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చాలా చోట్ల 60-70 శాతం కూడా దాటకపోవడం, పలు చోట్ల వందశాతం పూర్తిచేసినట్లు చూపడంపై ఉన్నతాధికారుల వత్తిడే కారణమని తెలుస్తుంది. దీంతో పత్రాలు పంపిణీ ఎలా జరుగుతుందో అర్ధంకాని పరిస్థితి నెలకొంది.

ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌లు అలంకారప్రాయంగా మారాయి. ఓటర్లు తమ ఓటు హక్కు 2002లో ఎక్కడ ఉందో తెలియడంలేదని, ఇల్లు మారామని, తమ ఇంటికి పత్రాలు అందలేదని, తదితర సమస్యలతో హెల్ప్‌డెస్క్‌ను సంప్రదిస్తే, వారి వద్ద సరైన సమాధానాలు రావడంలేదు. శిక్షణ పొందిన వారు లేకపోవడం, వాటిపై పూర్తిస్థాయి అవగాహన లేకపోవడంతో సెర్చ్‌చేయడం పూర్తిస్థాయి తెలియక ఓటు లేదని చెబుతున్నారు. ఉప్పల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌కు మంగళవారం ఉప్పల్‌కు చెందిన ఒక ఓటరు వచ్చి, 2002లో తమ ఓటు ఎలా తెలుసుకోవాలని అడిగారు. హెల్ప్‌డెస్క్‌లో సిబ్బంది పేరుతో సెర్చ్‌చేసి లేదని తెలిపారు. దీనితో ఇబ్బంది పడుతున్న ఓటరును సంప్రదిస్తే విషయం తెలిసింది. అనంతరం నమస్తే సిబ్బంది 2002 వివరాలను సెర్చ్ చేసి తెలపడంతో అవాక్కయ్యారు. అంటే హెల్ప్‌డెస్క్ ఎందుకు పెట్టారంటూ అసహనం వ్యక్తం చేశారు.
సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక ఓటరు సవరణ (సర్) కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ దంపతులకు బూత్ లెవల్ ఆఫీసర్ శ్రీనివాస్, సూపర్వైజర్ శివకుమార్‌లు మంగళవారం జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ఎన్యుమరేటర్ పత్రాన్ని అందజేశారు. తలసాని సతీమణి స్వర్ణ కూడా ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమంలో తమ వివరాలను అధికారులకు సమర్పించారు. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్, ఆయన సతీమణి కూడా తమ వివరాలతో కూడిన ఎన్యుమరేటర్ పత్రాలను సర్ అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యుల ఓటరు వివరాలను అధికారులు నమోదు చేసి, ప్రత్యేక ఓటరు సవరణ ప్రక్రియను పూర్తి చేశారు.
సిటీబ్యూరో, జూలై 7 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీతోపాటు డిజిటలైజేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ప్రజల నుంచి సేకరించి, పూర్తి చేసిన ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియను ఆలస్యం చేయకుండా నిర్ణీత గడువులో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సీఈవో సుదర్శన్ రెడ్డి ఆదేశించారు. అయితే క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో చాంద్రాయణగుట్ట 6.56శాతం, నాంపల్లి 6.17శాతం మినహా మిగిలిన 13 నియోజకవర్గాల్లో డిజిటలైజేషన్ ఊపందుకోలేదు. ఎన్యూమరేటర్లు ఇంటింటికి వెళ్లకపోవడం, ఫారాలను ఓటర్ల నుంచి తీసుకోవడంలో జాప్యం చేస్తుండడం, చేతిలో ఉన్న ఫారాలను డిజిటలైజేషన్ చేయడంలో అడుగడుగునా నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఆన్లైన్ ద్వారా వచ్చే ఎన్యూమరేషన్ ఫారాలను సైతం క్షుణ్ణంగా పరిశీలించి ఓటరు జాబితాను తప్పుల్లేకుండా రూపొందించాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తుండడం గమనార్హం.
