మేడ్చల్, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ): మున్సిపాలిటీలలో ఇన్చార్జి టౌన్ ప్లానింగ్ వ్యవస్థ కొనసాగుతోంది. దీంతో పర్యవేక్షణ కరువై అక్రమ కట్టడాలు, కబ్జాలు ఎక్కువైపోయాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మెజార్టీ మున్సిపాలిటీలలో టౌన్ ప్లానింగ్ విభాగంలో ఇదే పరిస్థితి ఉంది. ఇదే అదనుగా భావిస్తున్న కబ్జాదారులు యథేచ్చగా కబ్జాలకు పాల్పడటంతో పాటు అనుమతులకు మించి నిర్మాణాలు చేపడుతున్నారు.
అనుమతులు లేని నిర్మాణాలు, కబ్జాలపై స్థానికులు ఫిర్యాదు ఇస్తే తప్ప చర్యలు తీసుకోని పరిస్థితులలో మున్సిపాలిటీల టౌన్ ప్లానింగ్ అధికారులు ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మున్సిపాలిటీలలో టౌన్ ప్లానింగ్ విభాగం ఎంతో కీలకమైంది. మాస్టర్ ప్లాన్ పట్టణ ప్రణాళిక, నూతన భవనాలకు అనుమతులు ఇవ్వాల్సిన బాధ్యత టౌన్ ప్లానింగ్దే. ఈ విభాగానికి చెందిన అధికారులు ఇన్చార్జిలుగా ఉండటం మూలంగా టౌన్‌ప్లానింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో అనుమతులకు మించి నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇన్చార్జి టౌన్ ప్లానింగ్ అధికారులు మున్సిపాలిటీలకు రెండు నుంచి మూడు రోజులు మాత్రమే రావడం మూలంగా టౌన్ ప్లానింగ్ వ్యవస్థ గాడి తప్పుతోంది.
నామమాత్రపు నోటీసులతో సరి..
టౌన్‌ప్లానింగ్ అధికారుల పర్యవేక్షణ లోపంతో జరుగుతున్న కబ్జాలు, అనుమతులకు మించి నిర్మాణాలపై స్థానికులు ఇచ్చిన ఫిర్యాదులపై అధికారులు .. ఇళ్ల యజమానులకు నామమాత్రపు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలున్నాయి. మున్సిపాలిటీలలో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా తూకుంట మున్సిపాలిటీ పరిధిలో 40 అక్రమ నిర్మాణాలకు నోటీసులు, పోచారం మున్సిపాలిటీలో 12 నోటీసులు, ఘట్కేసర్ మున్సిపాలిటీలో 6 నోటీసులు ఇచ్చారు. అయితే మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిలో 263 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు గుర్తించినప్పటికీ నోటీసులు ఇవ్వడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేక అధికారుల పర్యవేక్షణ లోపం మూలంగా మున్సిపల్ సిబ్బంది విధులలో సమయ పాలన పాటించకపోవడం జవాబుదారితనం లేకపోవడంతో మున్సిపాలిటీల వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని మున్సిపాలిటీల ప్రజలు ఆరోపిస్తున్నారు.
మెజార్టీ మున్సిపాలిటీలలో ఇదే పరిస్థితి
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో 12 మున్సిపాలిటీలు, నాలుగు కార్పొరేషన్లు ఉన్నాయి. ఇందులో మెజార్టీ మున్సిపాలిటీలలో ఇన్చార్జి టౌన్ ప్లానింగ్ అధికారులే ఉన్నారు. ఒక జిల్లాలోని మున్సిపాలిటీకి కాకుండా ఇతర జిల్లా నుంచి వచ్చి ఇన్చార్జిలుగా కొనసాగుతున్నారు. వికారాబాద్ మున్సిపల్ టౌన్‌ప్లానింగ్ అధికారి మంజుభార్గవి పోచారం మున్సిపాలిటీలో ఇన్చార్జిగా ఉన్నారు. సంగారెడ్డి మున్సిపాలిటీలో టౌన్‌ప్లానింగ్ అధికారిగా ఉన్న శ్రీదేవి జిల్లాలోని నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీలకు ఇన్చార్జిగా ఉన్నారు. హెచ్ఎండీఏలో విధులు నిర్వహించే రాజీవ్‌రెడ్డి ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఇన్చార్జిగా ఉన్నారు.
మేడ్చల్ మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న రాథాకృష్ణారెడ్డి జిల్లాలోని ఎల్లంపేట్తో పాటు యాదాద్రి జిల్లా భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీలో ఇన్చార్జిగా వ్వహరిస్తున్నారు. తూకుంట, అలియాబాద్, మూడుచింతలపల్లి మున్సిపాలిటీలకు ఒక్కరే టౌన్ ప్లానింగ్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. దుండిగల్ మున్సిపాలిటీలో టౌన్‌ప్లానింగ్ అధికారిగా ఉన్న సంజన గూండ్లపోచంపల్లి మున్సిపాలిటీలలోఅదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు.