మణికొండ, డిసెంబర్ 10:
మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం ముమ్మర చర్యలు చేపడుతున్నది. ఎనిమిదేండ్ల కాలంలో జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి ఇంటికీ తాగునీరు అందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కింది. రాజేంద్రనగర్ నగర శివారు ప్రాంతం కావడంతో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వం మౌలిక వసతులు కల్పిస్తూ.. నియోజకవర్గంలోని అన్ని అన్ని డివిజన్లలో రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి.. అభివృద్ధే ఎజెండాగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతున్నది. ఈ నేపథ్యంలో నగరంతో పోల్చితే రాజేంద్రనగర్ అభివృద్ధికి కేరాఫ్‌గా నిలుస్తోంది.
ట్రాఫిక్ చిక్కులు లేకుండా..
నగరంలో రహదారులు ట్రాఫిక్ చిక్కులు లేకుండా సమగ్రమైన ప్రణాళికతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎస్ఆర్డీపీ ద్వారా 20 ప్రదేశాల్లో ఫ్లై ఓవర్లు, స్కైవాక్‌లు, గ్రేడ్ సేవరేటర్లు, రహదారుల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా 5 స్కైవేలు, 11 ప్రధాన కారిడార్లను ప్రభుత్వం నిర్మించింది. ఇందులో భాగంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం చుట్టూ ఫ్లై ఓవర్ బ్రిడ్జిలు, ఔటర్ రింగ్‌రోడ్డును నిర్మించారు. అదేవిధంగా ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి మూసీ నదిపై తూర్పు నుంచి పడమర దిశగా 42 కి.మీటర్లల్లో ఆరు లేన్ల రోడ్డును నిర్మించేందుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని ప్రధాన రోడ్లను వైట్ టాపింగ్ రోడ్లుగా మార్చేందుకు సర్కారు శ్రీకారం చుట్టింది.
ఎన్నడూ లేనంతగా.. నిరంతర విద్యుత్
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి విద్యుత్ సమస్యలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు చేపడుతుంది. తీవ్రమైన విద్యుత్ లోటును పూడ్చేందుకు సీఎం కేసీఆర్ సమగ్ర వ్యూహాన్ని అమలు చేసి నగరానికి దశాబ్దాల తర్వాత విద్యుత్ కోతలు లేని నగరంగా నిలిపారు.
మెట్రోతో.. మారనున్న రూపురేఖలు..
గచ్చిబౌలి ఔటర్ రింగురోడ్డు నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు మెట్రో రెండోదశ పనులను శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రారంభించడంతో రాజేంద్రనగర్ మరింత అభివృద్ధి చెందనున్నది. దీంతో ఇక్కడి భూముల ధరలు ఇప్పటికే కోట్లాది రూపాయలు పలుకుతుండగా మరింత సంపన్న ప్రదేశంగా మారుతుందనడంతో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఔటర్ చుట్టుపక్కల ఇప్పటికే బహుళ అంతస్తుల నిర్మాణాలతో విదేశాలను తలపించేలా ఈ ప్రాంతం దర్శనమిస్తోంది. మెట్రో రైలు వస్తే ఈ ప్రాంతానికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాగునీటి సమస్యకు పరిష్కారం..
రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని శంషాబాద్, మణికొండ, బండ్లగూడ, నార్సింగి మున్సిపాలిటీల పరిధిలో గతంలో ఏ సర్కారు చేయని పనులన్నీ తెలంగాణ ప్రభుత్వం చేసింది. జంట జలాశయాలు చెంతనే ఉన్నా గుక్కెడు నీటి కోసం అష్టకష్టాలు ఎదుర్కొన్న ఈ ప్రాంత ప్రజలకు సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో కృష్ణ, మంజీరా జలాలను ఇంటింటికీ సరఫరా చేసేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో పాటు ఇటీవలే శివారు ప్రాంతాలకు రూ.500 కోట్ల నిధులతో మణికొండలోనే మొదటి ఫేజ్ తాగునీటి రిజర్వాయర్ పనులను ప్రారంభించిన విషయం తెలిసిందే. దీంతో గండిపేట, శంషాబాద్, రాజేంద్రనగర్ మండలాల పరిధిలోని అన్ని ప్రాంతాలకు శాశ్వత తాగునీటి సమస్యకు పరిష్కారం లభించింది.
ప్రజావసరాలను గుర్తించి..
మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రజల అవసరాలను తీర్చేందుకు అనునిత్యం ప్రజల్లో ఉంటూ డివిజన్ల అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యేతో పాటు కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు నిరంతరం పనులను చేపట్టారు. పరిశుభ్రత, సురక్షిత, ఆధునికంగా, ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించేలా ప్రజలకు ప్రభుత్వ సేవలను అందించడంలో, కనీస అవసరాలను తీర్చడంలో ప్రజాప్రతినిధులు సఫలీకృతులయ్యారు.