నగరంలో ఆర్టీసీ సమ్మె అగ్గిరాజేసింది.. ఎక్కడికక్కడ బస్సులు బంద్ అయ్యాయి. మంగళవారం అర్ధరాత్రి నుంచే సమ్మె అమల్లోకి రావడంతో డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది అంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గొంతెత్తారు. తమ 32 డిమాండ్లను బేషరతుగా అంగీకరించాలని నినదించారు. బుధవారం గ్రేటర్‌లోని 25 డిపోల ముందు నిరసన వ్యక్తం చేశారు. గ్రేటర్లో ప్రతీ రోజు 2800 బస్సులు నడవగా సమ్మె ప్రభావంతో 2400 సర్వీసులు నడవలేదు. మిగిలిన 400 బస్సులు అద్దె, ఈవీ కావడంతో ఆర్టీసీ యాజమాన్యం వాటిని నడిపించేందుకు ప్రయత్నించింది.
హయత్‌నగర్, కోఠి, హకీంపేట, మీర్‌పేట తదితర ప్రాంతాల్లో ప్రైవేటు బస్సులను కార్మికులు రోడ్లపైనే నిలిపివేశారు. ఈ క్రమంలో కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం కుట్ర చేస్తూ ఆర్టీసీని కనుమరుగు చేయాలని భావిస్తున్నదని, అందులో భాగంగానే అనుభవంలేని ప్రైవేటు వారితో బస్సులు నడిపిస్తున్నదని ఆర్టీసీ జేఏసీ నాయకులు ఆరోపించారు. ఆర్టీసీ సంక్షేమం కోసం అందరం ఎంతకైనా పోరాడుతామని ప్రకటించారు. కాగా, బస్సులు నడవకపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులుపడ్డారు. మరోవైపు ఆర్టీసీ బస్సులు బంద్ కావడంతో ఓలా, ఉబర్, ర్యాపిడోల్లో ధరలు రెట్టింపు అయ్యాయి.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ)

నరక ప్రయాణం
ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రతిరోజూ గ్రేటర్లో 24 లక్షల మంది ప్రయాణం చేస్తారు. వారంతా గమ్యస్థానాలకు చేరుకోవడానికి తీవ్ర అవస్థలు పడ్డారు. ఆఫీసులు, విద్యా సంస్థలు, వ్యాపారాలకు వెళ్లే వారు బస్సులు లేక నరక యాతన అనుభవించారు. ముఖ్యంగా జేబీఎస్, ఎంజీబీఎస్ తదితర బస్టాండ్ల వద్ద ప్రయాణికులు గమ్య స్థానాలకు వెళ్లేందుకు రూ.70 చార్జీ ఉంటే 300పైనే చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఓ కుటుంబం పేర్కొంది.
ఆర్టీసీ బస్సులు బంద్ కావడంతో ఓల, ఉబర్, ర్యాపిడోల్లో ధరలు రెట్టింపు అయ్యాయి. సాధారణంగా ఉండే రూ.70 ధర బంద్ ప్రభావంతో అధిక రేటు చూపించింది. ఆటోలకు, క్యాబ్‌లకు రెట్టింపు ధరలు వసూలు చేశారు. సాధారణంగా నడిచే ఆటోలు సైతం 20 రూపాయల ఛార్జీని 40 చేశారు. కాగా, ఆర్టీసీ నడిపించిన అరకొర బస్సులు కూడా నగరంలోనే నడిచాయి. సాధారణంగా నగర శివార్లకు నడిచే అద్దె బస్సులను కూడా నగరంలోనే నడిపించారు. దీంతో నగర శివార్ల నుంచి వచ్చే వాళ్లు ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. రవి అనే వ్యాపారి నగరంలో ఓ షాపు ఉండగా ఉద్దెమ్మర్రి నుంచి రోజు వచ్చే బస్సు రాకపోవడంతో ఆ షాపు తెరవలేకపోయాడు. ఇంటికే పరిమితమయ్యాడు. ఇలా అనేక మంది నగరంలోని పలు దుఖాణాల్లో, షాపుల్లో, ఇతర వ్యాపారాల్లో విధులు నిర్వర్తించే వాళ్లంతా బస్సులు లేక ఇంటికే పరిమితం కావాల్సి వచ్చిందని తెలిపారు.

ప్రయాణికులతో చెలగాటం..!
ఆర్టీసీ యాజమాన్యం అనుభవం లేని డ్రైవర్లతో బస్సులు నడిపిస్తున్నది. ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతోంది. ఆర్టీఓల సూచనలతో హెవీ మోటార్ వెహికిల్ లైసెన్స్ ఉన్న వారిని పిలిపించి ఆర్టీసీ డ్రైవర్లుగా నియమించింది. వారికి ఆర్టీసీ బస్సులు నడిపిన అనుభవం లేదు. హెవీ మోటార్ లైసెన్స్ ఉన్నంత మాత్రాన ఆర్టీసీ బస్సులు నడపడానికి వారికి అర్హత ఉన్నట్టుగా కాదని నిపుణులు చెబుతున్నారు. నగర రోడ్లపై ఆర్టీసీ బస్సులను నడపాలంటే ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఉంటుందని వివరించారు. ఆ నిబంధనలకు తిలోదకాలు ఇస్తూ అనుభవం లేని వారికి బస్సులు ఇవ్వడం ప్రమాదకరమని హెచ్చరించారు.