శంషాబాద్ రూరల్, సెప్టెంబర్ 4 : ‘మా గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయవద్దు’ అంటూ.. ఘాన్సీమియాగూడ గ్రామస్తులు కోరుతున్నారు. ఈ మేరకు బుధవారం ఎంపీడీవో సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందజేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ.. తమ గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేయొద్దని, పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడిన గ్రామాన్ని మున్సిపాలిటీలో విలీనం చేస్తే అనేక ఇబ్బందులు వస్తాయన్నారు.
గ్రామస్తులకు తెలియకుండా పంచాయతీ కార్యదర్శి వరలక్ష్మి, ప్రత్యేకాధికారి వాల్యానాయక్ కలిసి మున్సిపాలిటీలో విలీనం కోసం తీర్మాన పత్రాలను ఉన్నతాధికారులకు అందించినట్లు వివరించారు. గ్రామ పంచాయతీ పాలకవర్గం లేకపోవడంతో కనీసం గ్రామసభ ఏర్పాటు చేసి.. ప్రజలకు తెలుపాల్సిన అధికారులు ఎవరికీ తెలియకుండా తీర్మానం పంపడం ఏమిటని ప్రశ్నించారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగే విధంగా తీర్మాన పత్రాలను పంపిన వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు ఘాన్సీమియాగూడను మున్సిపాలిటీలో విలీనం చేయకుండా గ్రామ పంచాయతీగానే కొనసాగించాలని జిల్లా కలెక్టర్‌తో పాటు జిల్లా పంచాయత్‌రాజ్ అధికారికి వినతి పత్రం అందజేస్తామన్నారు.
సూపరింటెండెంట్‌కు వినతి పత్రం అందజేసిన వారిలో చిలకమర్రి మహేందర్,ఆనంద్ ముదిరాజ్, ఇమ్రాన్, రవీందర్‌గౌడ్, మల్లేశ్, నందం, రాజు, సురేశ్‌గౌడ్, ప్రభు తదితరులు ఉన్నారు.