నగరంలో రియల్ ఎస్టేట్ రంగం కుదేలవుతున్నది. పదేళ్లుగా అప్రతిహతంగా దూసుకుపోయిన ఈ రంగాన్ని నిర్వీర్యం చేసేలా కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న ప్రయోగాలు శాపంగా మారుతున్నాయి. ఒకవైపు హైడ్రా కూల్చివేతల భయం, మరోవైపు అనుమతుల ప్రక్రియలో అస్థిరమైన విధానాలు. తాజాగా ఏకీకృత భవన నిర్మాణ నియామవళి పేరిట ప్రభుత్వం మరో పిడుగు వేసేందుకు సన్నద్ధం అవుతున్నది. ఇది అమల్లోకి రావడానికి మరో ఐదారు నెలల సమయం పడుతుందని చెప్పుతుండగా, అంతవరకు ఈ రంగంలో వచ్చే మార్పులతో అసలే ఐసీయూలో ఉన్న రియాల్టీకి పరిస్థితి ఏంటనేది నిపుణులు ఆందోళన చెందుతున్నారు.
గత ప్రభుత్వ హయాంలో టీజీపీపాస్ ద్వారా సింగిల్ విండో పద్ధతిలో కేవలం 21 రోజుల్లోనే భవన నిర్మాణ అనుమతులు వచ్చేవి. కానీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి రాగానే, పరుగులు పెడుతున్న రియాల్టీని కాలి విరిచినట్లుగా చేసింది. ఇక బిల్డ్ నౌగా మార్చింది. అయితే పేరు మారింది గానీ, పనుల్లో వేగం మాత్రం జరగలేదు. ఇప్పుడు మళ్లీ ఢిల్లీ, ముంబైల నుంచి కాపీ కొట్టి యూనిఫైడ్ బిల్డ్ రూల్స్ తెస్తామంటూ కాలయాపన చేస్తోంది. ఐదు నెలల పాటు అనుమతులు ఆగిపోతే, నిర్మాణ రంగంపై ఆధారపడిన వేలాది మంది కార్మికుల పరిస్థితి ఏంటన్న ప్రశ్నలకు సమాధానం లేదు.
సిటీబ్యూరో, మే 2 (నమస్తే తెలంగాణ) : నిన్నటి వరకు అనుమతులు ఉన్న వెంచరల్లో ప్లాట్లు కొన్నవారు, ఇప్పుడు తమ ఇళ్లు ఎప్పుడూ కూలుతాయో తెలియక ప్రాణభయంతో బతుకుతున్నారు. హైడ్రా పుణ్యమా అని రియల్ ఎస్టేట్ మార్కెట్ పూర్తిగా స్తంభించిపోయింది. కొనుగోలుదారులు వెనక్కి తగ్గుతుంటే, బిల్డర్లు వడ్డీలు కట్టలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇప్పుడు కొత్తగా వర్టికల్ మిక్స్ నిబంధనలు తెచ్చి భూమి వినియోగం పెంచుతామని చెబుతున్న ప్రభుత్వం, ఉన్న భూముల్లో జరుగుతున్న నిర్మాణాల రక్షణపై ఎందుకు మౌనంగా ఉందనేది అర్థం కావడం లేదని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పడిపోయిన మార్కెట్‌ను కోలుకునే అవకాశం ఇవ్వకుండా, వీకెండ్ వచ్చిందంటే నిర్మాణాల మీదకు బుల్డోజర్లు పంపించే కాంగ్రెస్ సర్కార్.. రియల్ ఎస్టేట్ రంగాన్ని నిర్వీర్యం చేస్తూనే ఉంది.
ఢిల్లీ మోడల్ ఇక్కడ నడిచేనా?
హైదరాబాద్‌కు ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితి, స్వరూపం ఉంది. ఢిల్లీ, ముంబై వంటి నగరాల్లో ఎఫ్ఎస్ఐ నిబంధనలు వేరు, ఇక్కడి పరిస్థితులు వేరు. కానీ వాటిని ప్రామాణికంగా తీసుకుని, క్షేత్రస్థాయిలో ఉన్న పరిస్థితులపై అవగాహన లేకుండా, కొత్త భవన నిర్మాణ ప్రణాళికలను పరిగణనలోకి తీసుకుంటే ఈ రంగం మరెన్నో సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఏకపక్షంగా అంతర్జాతీయ ప్రమాణాల పేరిట నిబంధనలు మార్చడం, స్టేట్ క్యాపిటల్ నుంచి గ్రామ స్థాయి వరకు ఒకే రీతి భవన నిర్మాణ నిబంధనలు ఏర్పాటు చేయడం అంటే రియల్ ఎస్టేట్ రంగాన్ని సామాన్యుడికి దూరం చేసినట్లే అవుతుందని అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ముఖ్యంగా రియల్ ఎస్టేట్ ధరలపై తీవ్ర ప్రభావం ఉంటుందనీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక పూటకో మాట, నెలకో రూల్ మార్చుకుంటూ పోతే పెట్టుబడిదారులు పారిపోతారని, గతంలో ఉన్న సులభంగా అనుమతుల ప్రక్రియను సంక్లిష్టం చేయడం వలన రియాల్టీ రంగం మరో పదేళ్లు వెనక్కి వెళ్లే ప్రమాదం కూడా ఉంటుందని ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ రంగ నిపుణుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఐసీయూలో ఉన్న ఈ రంగాన్ని సర్కారు బతికించాలనుకుంటే… స్టేక్ హోల్డర్స్, కొనుగోలుదారుల ఆలోచనలకు పరిగణనలోకి తీసుకుని, ఉన్న నిబంధనలను అమలు చేస్తూనే కొత్త పాలసీ అందుబాటులోకి తీసుకు రావాలని సూచిస్తున్నారు.
ఏకీకృత నియమావళి అనుమానాలెన్నో..
ఇప్పటికే కాంగ్రెస్ అమలు చేసిన పాలసీ విధానాలపై గందరగోళమైన పరిస్థితి నెలకొని ఉంది. ఏకీకృత భవన నిర్మాణ నియమావళితో ఈ రంగంలో వచ్చే మార్పులపై జనాలకు ముందుగానే అవగాహన కల్పించాలి. ఇప్పటికే జనాల్లో ఉన్న అనుమాలను నివృత్తి చేసే విధంగా, వచ్చే ఐదారు నెలల పాటు మేధోమధన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. లేదంటే హైడ్రా కారణంగా నేలమట్టమైనట్లుగా నిర్మాణ రంగంలో చోటా, మోటా, మిడ్ రేంజ్ బిల్డర్లు కనుమరుగై, కేవలం కార్పొరేట్ బిల్డర్లు మాత్రమే ఈ రంగాన్ని హస్తగతం చేసుకునే ప్రమాదం ఉంది. వీరి ప్రయోజనాల కోసమే కొత్త రాగం అందుకున్న సర్కారు.. ఈ రంగం వాస్తవంగా ఎదుర్కొంటున్న సవాళ్లను ముందుగా పరిష్కరించే ఆలోచనలు చేయాలని సూచిస్తున్నారు.