సిటీబ్యూరో, జూలై 31(నమస్తే తెలంగాణ): నగరంలో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నది. ఒకప్పుడు ఎకరం వంద కోట్లకు అమ్ముడైన భూములు కూడా ఇప్పుడు అడ్డికి పావు శేరు లెక్కన విక్రయిస్తామంటూ వ్యాపారులు రోడ్డెక్కుతున్నా.. కొనుగోలు చేసేవారు కరువయ్యారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నెట్టుకొస్తున్న రియల్ మార్కెట్లో ఇప్పుడొక అంశం శుభపరిమాణంలా కనిపిస్తోంది. భూముల ధరలు గడిచిన ఏడాదిన్నర కాలం తర్వాత 2 శాతం వృద్ధి చెందడం ఊరటనిచ్చేలా కనిపిస్తున్నది. అయినా ఇప్పటికీ కట్టిన నిర్మాణాలను అమ్ముకునేందుకు బిల్డర్లు నానా తిప్పలు పడుతున్నారని తేలిపోయింది. దీంతో గతేడాదితో పోలిస్తే ఏకంగా 11శాతం అమ్మకాలు పడిపోయినట్లుగా వెల్లడైంది. తాజాగా క్రెడాయ్-సీఆర్ఈ మ్యాట్రిక్స్ ఆధ్వర్యంలో వెల్లడించిన నివేదికలో అన్ని మెట్రో నగరాల్లో అమ్మకాల తీరుతెన్నులను పేర్కొంది.
విధానపరమైన నిర్ణయాలతో..
హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ ..పడిపోయిందనే దానికి ఎన్నో ఉదాహరణలు, మరెన్నో నివేదికల ఫలితాలే తేటతెల్లం చేస్తున్నాయి. దీనంతటికి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయాలే కారణమని నిపుణులు కూడా అంగీకరిస్తున్నారు. ఇలాంటి తరుణంలో రాకెట్ వేగం వచ్చేదెన్నడూ అని అన్ని వర్గాలు ఎదురుచూసే పరిస్థితులు వచ్చాయి. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా చేసిన ముప్పెట దాడి ఇవాళ రియల్ ఎస్టేట్ రంగంపై ఆధారపడిన ఉప రంగాలను కూడా ప్రభావితం చేస్తూ, ఉద్యోగ, ఉపాధి, పెట్టుబడి అవకాశాలను కూడా నీరుగారేలా చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎకరం వందల కోట్లకు విక్రయించిన భూములకు ఆదరణ లేకుండా పోయింది. ఒకప్పుడు శివారు ప్రాంతాలకే విపరీతమైన డిమాండ్ ఉంటే, కోర్ సిటీలో మిగిలిన భూములను విక్రయించడానికి ప్రభుత్వ యంత్రాంగమే అపసోపాలు పడుతోంది.
నివేదికతో తేటతెల్లం…
క్రెడాయ్-సీఆర్ఈ మ్యాట్రిక్స్ నివేదిక ద్వారా నగరంలో రియల్ ఎస్టేట్ వాస్తవ పరిస్థితులను అద్దం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా మార్కెట్ పుంజుకొంటున్నా… నగరంలో మాత్రం ఏమాత్రం కదలిక రాకపోవడం ముఖ్యంగా బిల్డర్లను కలవరపెడుతున్నది. ఈ నివేదిక ప్రకారం సౌత్‌లోని చెన్నయ్, బెంగుళూరు వంటి నగరాలు అమ్మకాలు, ధరల పెరుగుదలలో దూసుకుపోతున్నాయి. కానీ హైదరాబాద్‌లో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నట్లు తేటతెల్లమైంది. 2 శాతం భూముల విలువ పెరిగినా… 11 శాతం అమ్మకాలు పడిపోవడంతో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమ్మకాల్లో బెంగళూరు నాలుగు శాతం, చెన్నయ్‌లో 23 శాతం పెరుగుతుండటం సిటీ మార్కెట్ దీనస్థితిని స్పష్టం చేస్తున్నాయి.
మార్కెట్ బేజారు…
గడ్డు కాలంలో నెట్టుకొస్తున్న హైదరాబాద్ రియాలిటీ రంగానికి భూముల ధరలు పెరగడం మంచిదే. కానీ కొనుగోళ్లు పెరిగినప్పుడే మార్కెట్లోకి క్యాష్ ఫ్లో వస్తుందనేది నిపుణుల వాదన. అమ్మకాలు స్తంభిస్తే గనుక ఇన్వెంటరీ నిలిచిపోతుంది. అదే విధంగా కొత్త ప్రాజెక్టులకు బిల్డర్లు కూడా వెనకడుగు వేస్తారు. ఇలా మార్కెట్ స్తంభించే ప్రమాదం కూడా ఉంటుందనీ, ఇలాంటి పరిస్థితులను తెలంగాణ ఉద్యమ సమయంలో ఎదుర్కొన్నట్లు కొందరు బిల్డర్లు వివరించారు.
ఉద్యమ సమయంలోనూ నెలకొని ఉన్న ఆందోళనకరమైన పరిస్థితులను ఎదుర్కొనేందుకు తెలుగు రాష్ర్టాలకు చెందిన బిల్డర్లు ఎంతో సమన్వయంతో పనిచేసినట్లుగా గుర్తు చేశారు. దీంతో గడిచిన పదేండ్లలో ఊహించని స్థాయికి చేరిన సిటీ మార్కెట్ రేంజ్ కాస్తా… ఒక్క ఏడాదిలోనే నేలకూలినట్లు మారిపోయిందని ఆవేదన చెందుతున్నారు. మార్కెట్లో కదలిక తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టకపోవడమే ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంఘాలను కూడా కలవరపెడుతున్నాయి. ఇప్పటికీ రియల్ ఎస్టేట్ రంగాన్ని ప్రోత్సహించేలా ప్రభుత్వమే స్పష్టమైన విధానపరమైన నిర్ణయాలను ప్రకటిస్తే గానీ మార్కెట్లో కదలిక రాదనేది నిపుణుల అభిప్రాయం.