ఖైరతాబాద్, నవంబర్ 11: కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ముదిరాజ్‌లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం కోరారు. ఈ నెల 21న ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో నిర్వహించనున్న దశాబ్ది ఉత్సవాలు, ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ పోస్టర్లను సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. మల్లేశం మాట్లాడుతూ, గడిచిన పదేండ్లలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోకాపేటలో సుమారు రూ.300 కోట్ల విలువైన ఐదెకరాల స్థలం, రూ.5 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు.
మత్సకారులకు వెయ్యి కోట్ల బడ్జెట్, 75 శాతం సబ్సిడీతో వివిధ పథకాలు మంజూరు, జీవో నం.4 ద్వారా ముదిరాజ్ అనే పదాన్ని మత్స్యకారులుగా మార్చడం, రూ.300 కోట్లతో 63 వేల ద్విచక్ర వాహన యూనిట్లు మంజూరు, రూ.150 కోట్లతో 3,200 మందికి మినీ వాహనాలు మంజూరు, 18 ఏండ్లు నిండిన ప్రతి ముదిరాజ్ బిడ్డకు మత్స్యశాఖ సభ్యత్వం కల్పించే విధంగా ఆదేశాలు, ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి సంవత్సరం ఉచితంగా చేప పిల్లలు, రొయ్యల పంపిణీ, అందుకు కోసం రూ.500 కోట్ల మంజూరు, జీవో నం. 268 ద్వారా పంచాయతీ చెరువుల మత్స్య శాఖకు బదలాయింపు, రూ.75 కోట్లతో మత్స్యకారులకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం లాంటి పనులు చేశారన్నారు.
ప్రస్తుత, కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం అంటూ అనే హామీ ఇచ్చారని, కులగణన సక్రమంగా చేపట్టడంతో పాటు 42 శాతం రిజర్వేషన్లలో ముదిరాజుల వాటా జనాభాకు అనుగుణంగా ఇవ్వాలన్నారు. జీవో నం.15 ప్రకారం, ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి బీసీ ఏలోకి మార్చాలని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముదిరాజ్ కో ఆపరేటీవ్ సొసైటీస్ కార్పొరేషన్‌కు వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలన్నారు. అలాగే, తెలంగాణ మత్స్య శాఖ ఫెడరేషన్‌కు వెంటనే ఎన్నికలు జరిపి చైర్మన్, పాలక మండలిని నియమించాలన్నారు. సమావేశంలో మహిళా అధ్యక్షురాలు మందుల వరలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులు బల్ల సత్తయ్య, యువజన అధ్యక్షులు పండుగ బాలు, బి.యాదగిరి, కృపాసాగర్, కనకమ్మ, శ్రీనివాస్, ఉషా ముదిరాజ్, చెరుకు సాంబరాజ్, రమేశ్ ముదిరాజ్ పాల్గొన్నారు.