సిటీబ్యూరో, నవంబరు 10 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు మరికొద్ది గంటల్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నది. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ ప్రక్రియ జరుగనున్నది. గతంలో ఎన్నడూ లేనంతగా ఈ సారి పోలింగ్ సమయాన్ని అదనంగా గంట పాటు ఎన్నికల సంఘం పొడిగించింది.. సోమవారం రాత్రి కల్లా ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు తరలించారు. ఉదయం 5 గంటలకే సంబంధిత ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించి పోలింగ్ ప్రక్రియను ఉదయం 7 గంటలకు ప్రారంభించనున్నారు. తొలిసారిగా డ్రోన్ల ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షించనున్నారు.
ఈ మేరకు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, హైదరాబాద్ జాయింట్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్‌తో కలిసి పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డ్రోన్స్ సర్వెలెన్స్ ప్రాజెక్టును ఆర్వీ కర్ణన్ ప్రారంభించారు. నియోజకవర్గంలో 4,01,365 ఓటర్లు ఉండగా 139 కేంద్రాల్లో 407 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు కర్ణన్ పేర్కొన్నారు.
1200 మంది కన్నా ఎక్కువ ఉన్న పోలింగ్ స్టేషన్లు 11 ఉన్నాయన్నారు. పోలింగ్ నిర్వహణలో 3వేల మంది పాల్గొంటున్నారని, 19 మంది నోడల్ అధికారుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఉప ఎన్నిక బరిలో 58 మంది అభ్యర్థులు బరిలో నిలువగా, నోటా అదనంగా ఉంటుంది..ఐతే ఓటర్లకు వీలుగా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలతో ఫోన్ డిపాజిట్ సౌకర్యంతో పాటు ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఆర్వీ కర్ణన్ తెలిపారు.
గుర్తింపు కార్డు తప్పనిసరి..
ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటరు జాబితాలో పేరుండి ఓటర్ గుర్తింపు కార్డు (ఎపిక్ కార్డు) కాకుండా 12 ప్రత్యామ్నాయ ఫొటో ఐడీలలో దేనినైనా ఒకటి పోలింగ్ సిబ్బందికి చూపి ఓటరు తమ ఓటును వినియోగించుకోవచ్చునని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఆధార్, ఉపాధి హామీ, జాబ్‌కార్డు, బ్యాంకు, తపాలా కార్యాలయం జారీ చేసిన ఫొటోతో కూడిన పాస్‌బుక్, కేంద్ర కార్మిక శాఖ జారీ చేసిన ఆరోగ్య బీమా స్మార్ట్ కార్డు ,
ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్‌కార్డు , నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ కింద రిజిస్టార్ జనరల్ అండ్ సెన్సెస్ కమిషనర్ ఇండియా జారీ చేసిన స్మార్ట్ కార్డు, భారతీయ పాస్‌పోర్టు ఫొటోతో కూడిన పెన్షన్ పత్రాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పీఎస్‌యూలు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు జారీ చేసిన ఉద్యోగ గుర్తింపు కార్డులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డులు, కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ జారీ చేసిన యూనిక్ డిజేబుల్ గుర్తింపు కార్డు కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి చెప్పారు. ఓటరు జాబితాలో పేరు ఉండి ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఈ 12 కార్డులలో ఏ గుర్తింపు కార్డు ఉన్న ఓటు వేయవచ్చని జీహెచ్ఎంసీ కమిషనర్, జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు.

Ppp