సిటీబ్యూరో, జనవరి 17 (నమసే తెలంగాణ): బీదర్, హైదరాబాద్‌లో కాల్పులు జరిపిన దోపిడీ దొంగలు బీహార్ ముఠాకు చెందినవారుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దోపిడీ దొంగల ముఠా కోసం కోసం రెండు రాష్ర్టాల పోలీసులు కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్‌గడ్‌లలో 10 బృందాలతో గాలింపు చేపట్టారు. గురువారం ఉదయం బీదర్‌లో కాల్పులు జరిపి ఏటీఎం కేంద్రంలో నగదు డిపాజిట్ చేసేందుకు వెళ్తున్న సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపి.. వారి చేతిలో ఉన్న అల్యూమినియం బాక్స్‌తో పాటు అందులో ఉన్న రూ. 93 లక్షల నగదును దోపిడీ చేసి పరారైన విషయం తెలిసిందే. ఏపీ రిజిస్ట్రేషన్ ఉన్న ద్విచక్రవాహనంపై హెల్మెట్లు ధరించి దోపిడీకి పాల్పడిన దుండగులు.. అదే బైక్‌పై హైదరాబాద్ వైపు పరారయ్యారు. మార్గమధ్యలో ఆ బైక్‌ను, అల్యూమినియం బాక్స్‌ను వదిలేసి హైదరాబాద్‌కు చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్న తరువాత చార్మినార్ ప్రాంతంలో ట్రావెల్ బ్యాగ్స్ కొని అందులో ఆ డబ్బును దాచి పెట్టారు. ఆ బ్యాగ్‌లలో తమ వద్ద ఉన్న హెల్మెట్లు కూడా దాచిపెట్టారు. మార్గ మధ్యలో బైక్‌లు దొంగిలించి, తమ వద్ద ఉన్న హెల్మెట్లను వాడుతూ.. తమ ముఖాలు ఎక్కడ బయట పడకుండా జాగ్రత్త పడుతుంటారని తేలింది.
నిందితుల గుర్తింపు…
రెండు రాష్ర్టాల పోలీసులకు సవాలు విసిరిన దోపిడీ దొంగల ఆచూకీని శుక్రవారం రాత్రి పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. ఆ దిశగానే నిందితులను పట్టుకోవడానికి గాలింపు ముమ్మరం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే పోలీసులు ఈ విషయాన్ని నిర్ధరించడం లేదు. హైదరాబాద్ దాటి దుండగులు వెళ్లిపోయారని పేర్కొంటున్నారు.
ఆటోలో ఎక్కి సికింద్రాబాద్‌కు..
అఫ్జల్‌గంజ్‌లోని రోశన్ ట్రావెల్స్ వద్దకు వెళ్లి ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌పూర్ వెళ్లేందుకు అమిత్‌కుమార్ పేరుతో రెండు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. టికెట్లు బుక్ చేసుకునే సమయంలో ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఫోన్ నంబర్‌ను ఇచ్చారు. బస్సు వివరాలు మేసేజ్ పంపిస్తామంటే ఇక్కడే ఉంటామంటూ రాత్రి 7 గంటల వరకు అక్కడే ఉన్నారు. ఈ క్రమంలోనే తమ వద్ద ఉన్న ఫోన్ నంబర్లను దుండగులు స్వీచ్ఛాప్ చేశారు. మినీ బస్సులో ఎక్కిన తరువాత ట్రావెల్స్ మేనేజర్ జహాంగీర్పై తుపాకీతో కాల్పులు జరిపిన దుండగులు.. అక్కడి నుంచి కొంత దూరం పరిగెత్తుతూ వెళ్లారు. ఆ తరువాత ఒక ఆటోలో ఎక్కి సికింద్రాబాద్ వైపు వెళ్లారు. పోలీసులకు బేగంబజార్, ఎంజే మార్కెట్, నాంపల్లి, ట్యాంక్‌బండ్ వరకు అక్కడక్కడ సీసీ కెమెరాల్లో కొన్ని ఆధారాలు పోలీసులకు లభించాయి. ఆటోను గుర్తించిన పోలీసులు డ్రైవర్‌ను ప్రశ్నించడంతో సికింద్రాబాద్‌లోని అల్ఫా హోటల్ వద్ద వాళ్లను దించినట్లు వెల్లడించారు. దీంతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఇద్దరు దుండగులు ఛత్తీస్గడ్, బీహార్ వైపు వెళ్లి ఉంటారని పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా గాలింపు చేపట్టారు. అయితే సీసీ కెమెరాలు పూర్తిస్థాయిలో పనిచేయకపోవడంతో పోలీసులకు తగిన సమాచారం వేగంగా రాలేదని తెలుస్తున్నది. దీంతోనే దుండగులు హైదరాబాద్ దాటేంత సమయం దొరికినట్లు ఆరోపణలున్నాయి.