సిటీబ్యూరో, జూన్ 30 (నమస్తే తెలంగాణ)/ కంటోన్మెంట్: ఐటీ అధికారులమంటూ సికింద్రాబాద్ పాట్ మార్కెట్లోని నగల దుకాణంలో బంగారు బిస్కెట్లు దోచుకెళ్లిన కేసులో పోలీసులు తాజాగా శుక్రవారం మరో నలుగురిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.45లక్షల విలువజేసే 715గ్రాముల బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి గతంలో ఐదుగురు అరెస్టు చేశారు. శుక్రవారం ఉత్తర మండలం డీసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీసీపీ చందనా దీప్తి కేసు పూర్వాపరాలను వెల్లడించారు. నగరానికి చెందిన మహేందర్ బాబా సికింద్రాబాద్‌లోని పాట్ మార్కెట్లో సిద్ధివినాయక నగల దుకాణం పేరుతో బంగారు ఆభరణాలు తయారు చేసే వర్క్‌షాప్ నిర్వహిస్తున్నాడు.
ఈ వర్క్‌షాప్‌లో బంగారు బిస్కెట్లతో పాటు పాత బంగారాన్ని కరగదీసి ఆభరణాలు తయారు చేస్తారు. కాగా, పాట్మార్కెట్లోని హర్షద్ గోల్డ్మోల్టింగ్ షాప్‌లో వర్కర్‌గా పనిలో చేరిన మహారాష్ట్ర, ఖానాపూర్ ప్రాంతానికి చెందిన జకీర్ ఘని అత్తర్ కస్టమర్ల నుంచి సేకరించిన బంగారాన్ని కరిగించి, నగల తయారీ కోసం సిద్ధివినాయక గోల్డ్ షాప్‌కు తీసుకువెళ్లేవాడు. ఈ క్రమంలో అక్కడ జరిగే కార్యకలాపాలు, బంగారు బిస్కెట్లను చూసిన జకీర్ ఈ విషయాన్ని తన స్నేహితులు, అనుచరులకు చేరవేశాడు. అంతే కాకుండా ఏదైనా చేసి ఈ బంగారాన్ని తస్కరించాలని పథకం పన్నాడు. తన పథకాన్ని తన స్నేహితులు, పాతనేరస్తులైన ఖానాపూర్లోని ఆరుగురికి, గోవాలో ఉన్న ముగ్గురికి వివరించాడు. బంగారాన్ని దోచుకునేందుకు ఐటీ అధికారుల అవతారమెత్తాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో ఐటీ అధికారులుగా నమ్మించేందుకు నకిలీ ఐడీ కార్డులు తయారు చేసుకుని మే 24న మహారాష్ట్ర ఖానాపూర్‌కు చెందిన రహ్మన్ గఫూర్ అత్తర్, ప్రవీణ్‌యాదవ్, ఆకాశ్ అరుణ్ హవ్లీ, అభిజిత్ కుమార్ గోడ్కె, అమోల్ గన్పత్రవ్ జాదవ్ బస్సులో, గోవాకు చెందిన సిద్దాంత్ అలియాస్ సిదార్థ్ జాదవ్, సంజయ్ పరశురామ్ జాదవ్, శుభం వినోద్ జాదవ్, అజయ్ వినోద్ జాదవ్ ట్రైన్లో నగరానికి చేరుకున్నారు. వీరంతా కలిసి నగరంలోని ఢిల్లీ లాడ్జిలో బస చేశారు. బంగారం దుకాణంలో పనిచేసే జాకీర్ ఘని అత్తర్ సైతం ఢిల్లీ లాడ్జికి వెళ్లి తన స్నేహితులతో దోపిడీకి సంబంధించిన పథకాన్ని వివరించాడు. ఇందులో భాగంగా బాబు, లాలా అనే ఇద్దరు వ్యక్తులను పాట్‌మార్కెట్‌కు తీసుకెళ్లి అక్కడున్న సిద్ధివినాయక బంగారం దుకాణాన్ని చూపించారు. పథకం ప్రకారం మే 27వ తేదీన ఉదయం 11.40గంటల సమయంలో నిందితులంతా కలిసి పాట్మార్కెట్లోని సిద్ధి వినాయక బంగారం దుకాణంలోకి వెళ్లి తాము ఐటీ అధికారులమంటూ నకిలీ గుర్తింపు కార్డులను చూపించి అక్కడున్న వర్కర్లను బెదిరించారు. వెంటనే వారి వద్ద నుంచి సెల్ఫోన్లు లాగేసుకుని వర్కర్లందరిని ఒక గదిలో బంధించారు. దుకాణంలో ఉన్న రూ.60లక్షల విలువజేసే 17 బంగారు బిస్కెట్లను తీసుకుని ఉడాయించారు.
నగల దుకాణం నిర్వాహకుడు వికాస్ కేదేకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మే 30న రెహ్మన్ గఫూర్ అత్తర్, జాకీర్ ఘని అత్తర్, ప్రవీణ్ యాదవ్, ఆకాశ్ అరుణ్‌ను అరెస్టు చేసి, వారి నుంచి 573 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం జూన్ 15న మహారాష్ట్రకు చెందిన అభిజిత్ కుమార్‌ను అరెస్టు చేశారు. తాజాగా పరారీలో ఉన్న రుషికేష్ వినోద్ జాదవ్, శుభం వినోద్ జాదవ్, సంజయ్ పరశురామ్ జాదవ్, అముల్ గణ్పత్రావు జాదవ్‌ను శుక్రవారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.45లక్షల విలువజేసే 715 గ్రాముల బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీసు కమిషనర్ సీవీ.ఆనంద్ ఆదేశాల మేరకు ఉత్తర మండలం డీసీపీ చందనా దీప్తి, నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణా రావు, మహంకాళి డివిజన్ ఏసీపీ రమేశ్ పర్యవేక్షణలో టాస్క్‌ఫోర్స్ ఇన్స్పెక్టర్ శ్రీనాథ్‌రెడ్డి, మార్కెట్ పీఎస్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు తదితరులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి క్లిష్టమైన ఈ కేసును మూడు దశల్లో ఛేదించారు.