సిటీబ్యూరో, మే 9 (నమస్తే తెలంగాణ): పుత్తడి ధర రికార్డు స్థాయికి చేరింది… రాబోయే రోజుల్లో పెరుగుతుందా.. తగ్గుతుందా.. అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. సామాన్యుల నుంచి సంపన్నుల వరకు ఉన్న ఈ ఆలోచనను సొమ్ము చేసుకునేందుకు మాయగాళ్లు రంగంలోకి దిగారు. తక్కువ ధరకే పసిడి అంటూ నమ్మించి అందినంత కొట్టేసి ముఖం చాటేస్తున్నారు. నగరంలో అంతర్రాష్ట్రమాయగాళ్ల ముఠా నకిలీ బంగారం అంటగట్టి మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. తెలియని వ్యక్తులు, సంస్థల పేరిట వచ్చే ప్రకటనలు చూసి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఇటీవల తమ బంధువులు దుబాయ్ నుంచి వస్తున్నారు..వచ్చేటప్పుడు బంగారు బిస్కెట్లు తెస్తారంటూ ఆశచూపిస్తూ.. అడ్వాన్స్‌గా చాలా మంది వద్ద రూ.8.5లక్షలు తీసుకుని.. ముఖం చాటేయడంతో పంచాయతీ పెద్దమనుషుల వద్దకు చేరింది. అక్కడ కొంత డబ్బులిచ్చి ఎంచక్కా మోసగాడు తప్పించుకున్నాడని సమాచారం. అయితే.. పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి దగ్గరలో ఉన్న ఓ ప్రాంతంలో జరిగిన ఈ మోసంలో బాధితులు సుమారుగా కోటిరూపాయల వరకు మోసపోయినట్లు తెలిసింది.
ఈ విషయం పోలీసుల దాకా రానీయకుండా జాగ్రత్త పడినప్పటికీ.. ఆ నోటా ఈనోటా పోలీసులకు చేరింది. అయితే.. ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఇదొక్కటే కాదు.. కొన్ని నెలల క్రితం సీసీఎస్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదు ప్రకారం పలువురు మహిళల నుంచి ఒక ముఠా నగదు వసూలు చేసింది. రూ.50వేలు కట్టి చేరితే పది శాతం తక్కువ ధరకు బంగారం ఇస్తామని చెప్పి చాలామంది దగ్గర డబ్బులు వసూలు చేసింది. అలా వసూలు చేసిన సుమారు నాలుగుకోట్ల రూపాయలతో మోసగాళ్లు పరారయ్యారు. ఇలా గొలుసుకట్టు పద్ధతిలో ఐదుకు ఆరు, ఏడు అంటూ బంగారు నాణేల పేరుతో కూడా మోసాలకు పాల్పడుతున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, మధ్యప్రదేశ్ రాష్ర్టాలకు చెందిన కొన్ని ముఠాలు నగరంలోని వ్యాపారులు, గృహిణులను తేలికగా బురిడీ కొట్టిస్తున్నాయి. పాతబంగారం దొరికిందంటూ బంగారు కడ్డీలు చూపుతూ.. కడ్డీలో ఓవైపు అసలు బంగారం ఉండేలా జాగ్రత్త పడుతున్నారు. బంగారం నాణ్యత చెక్‌చేసే సందర్భంలో బంగారం ఉన్నట్టు చూపించి తక్కువ ధరకు బంగారం ఇస్తున్నామని నమ్మబలుకుతారు. దీంతో బయట లక్షరూపాయలు ఉన్న బంగారం ఇక్కడైతే రూ.80వేలకే వస్తుండడంతో జనాలు నమ్మి వాటిని కొనుగోలు చేసి మోసపోతున్నారు. కొన్నిచోట్ల పురాతన నాణేలు అంటగట్టి మాయమవుతున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఎదుటివారి దృష్టి మరల్చి చోరీలు, మోసాలకు పాల్పడుతున్న ముఠాలు కూడా నగరంలో సంచరిస్తున్నాయని పోలీసులు చెబుతున్నారు. వీరు ఎక్కువగా ఎస్ఆర్నగర్, పంజాగుట్ట, జూబ్లీహిల్స్, చిక్కడపల్లి , హిమాయత్‌నగర్, తదితర ప్రాంతాల్లో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసుల నిఘాలో తెలిసినట్లు సమాచారం. అయితే మోసపోయిన కొందరు తమకు జరిగిన మోసాలు బయటపెట్టలేక చాలావరకు వెనక్కు తగ్గుతున్నారని పోలీసులు చెప్పారు.
వాట్సప్ ద్వారా కాల్స్‌చేసి తక్కువ ధరకు బంగారం విక్రయిస్తామంటూ వలవేసి అందినకాడికి దండుకుంటున్న నేరగాడిని సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. మోసగాడు.. నగరంలో ఉన్న అనేకమంది ఫోన్ నంబర్లు సేకరించి వారికి వాట్సప్‌కాల్ చేసి తాను బంగారం వ్యాపారినంటూ పరిచయం చేసుకున్నాడు. ముంబైలో తక్కువ ధరకు బంగారం ఖరీదు చేస్తుంటానని, దాన్ని మార్కెట్ రేటు కంటే తక్కువగా విక్రయిస్తానని చెప్పాడు. వారిని నమ్మించడం కోసం తెలిసినవారి కొందరిపేర్లు చెప్పేవాడు.
ఈ క్రమంలో నగరవాసి నుంచి రూ.5లక్షలు స్వాహా చేశాడు. ఇలా ఆన్లైన్లో దుబాయ్, ముంబై పేర్లు చెప్పి తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామంటూ మొదట్లో కొంత బంగారం అంతే తక్కువ ధరకు ఇచ్చి ఆ తర్వాత పెద్ద మొత్తంలో వసూలుచేసి ఆపై స్పందించని మోసగాళ్ల వ్యవహారం కూడా బయటపడింది. ఈ విషయంలో పోలీసులు కూడా తమకు వెంటనే చెప్పి, సైబర్‌క్రైమ్‌కు ఫిర్యాదు చేస్తే తప్ప తాము స్పందించలేని పరిస్థితి ఉంటుందని, అయినప్పటికీ కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. రసీదు లేకుండా బంగారు కొనుగోళ్లు, నాణ్యత పరీక్షించకుండా తెలియనివారి వద్ద నుంచి కొనుగోలు చేసి మోసపోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నదని, ఈ విషయంలో ప్రజలే అప్రమత్తంగా ఉండి నేరాలను అదుపు చేయడంలో తమకు సహకరించాలని పోలీసులు చెప్పారు.