OU | ఉస్మానియా యూనివర్సిటీ : రాష్ట్రవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీలలో ఔట్ సోర్సింగ్ విధానాన్ని ఎత్తివేసి, ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఈ నెల 9న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఉస్మానియా యూనివర్సిటీలో సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో పద్మ శ్రీ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యూనివర్సిటీలకు నిధులు గ్రాండ్స్ విడుదల చేయకుండా నిర్లక్ష్యం ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. యూనివర్సిటీలను నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. వర్సిటీలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తూ, బడా కంపెనీలు, కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తుందని మండిపడ్డారు. కార్మిక హక్కులను కాపాడుకోవడం కోసం జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రమాదకర కార్మిక చట్టాలు కార్మికులను కట్టు బానిసల్లా మారుస్తాయని అనుమానం వ్యక్తం చేశారు. ఎనిమిది గంటల పనిని తీసేసి 12 గంటల పనిని ఎవరి ప్రయోజనాల కోసం తీసుకువస్తున్నారని ప్రశ్నించారు.
ఈ కార్యక్రమంలో ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, ఉస్మానియా యూనివర్సిటీ కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ యూనియన్ (CITU ) అధ్యక్షులు టి.మహేందర్, సీఐటీయూ నగర నాయకులు దశరథ్, యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీధర్ రావు, ఉపాధ్యక్షులు ,శ్రీను, నాగరాజు, సహాయ కార్యదర్శులు వీరేష్, పోచయ్య, అంజమ్మ, కిషోర్, కుమార్, ఈశ్వరయ్య, ప్రమీల, అరుణ, ఐలమ్మ, వీరేశం,సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.