సిటీబ్యూరో, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో రైల్ నిర్వహణ ఆగమాగమైంది. ప్రయాణికులకు మెరుగైన రవాణా సదుపాయం దేవుడెరుగు.. కనీస మౌలిక వసతులు కల్పించడమే కష్టంగా మారింది. మెట్రో సంస్థ నిర్లక్ష్యంతో నిర్వహణ గాలికొదిలేసినట్లుగా మారింది. ముఖ్యంగా స్టేషన్ల కారిడార్లు, మెట్ల మార్గాలన్నీ అధ్వానంగా తయారవ్వగా… రైళ్లలో ప్రయాణికులకు భద్రత కరువైంది. రద్దీ విపరీతంగా పెరగడంతో పీక్ అవర్స్‌లో మహిళా ప్రయాణికులపై ఆకతాయిల వేధింపులు నిత్యకృత్యమయ్యాయని ఫిర్యాదులు అందుతున్నాయి. ఇక వానకాలంలో స్టేషన్ల ప్రాంగణాల్లోకి వాన నీరు కారుతున్నా పట్టించుకునే వారు లేరని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే మెట్రో స్టేషన్లలో ‘పే అండ్ యూజ్’ విధానాన్ని అమలు చేస్తున్నప్పటికీ టాయిలెట్స్‌లలో పరిశుభ్రత కరువైంది. అలాగే స్టేషన్ల కింద, లిఫ్టు, ఎస్కలేటర్ పరిసరాలు కంపు కొడుతున్నాయి.
మౌలిక వసతుల కల్పనలో నిర్లక్ష్యం..
పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా మౌలిక వసతులు కల్పించడంలో మెట్రో నిర్వహణ సంస్థ నిర్లక్ష్యం ప్రయాణికులకు శాపంగా మారింది. నిత్యం ఐదున్నర లక్షల మంది గమ్యస్థానాలకు చేరేందుకు మెట్రోను ఆశ్రయిస్తున్నా… సౌకర్యాల విషయంలో యంత్రాంగం దృష్టి పెట్టడం లేదు. దీంతో మెట్రో ప్రయాణం అంటేనే నగరవాసులు బెంబేలెత్తుతున్నారు. ఇక ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కారణంగా మెజారిటీ మహిళలు మెట్రోకు తగ్గినా, కొన్ని మార్గాల్లో రద్దీ ఏ మాత్రం తగ్గలేదు. ముఖ్యంగా రాయదుర్గం వైపు అధిక సంఖ్యలో మహిళలు మెట్రోను ఆశ్రయిస్తున్నారు. అయితే సౌకర్యాల కల్పనలో సంస్థ విఫలమవ్వడంతో రోజురోజుకూ మెట్రోకు ఆదరణ తగ్గుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజానికి ప్రస్తుతం ఉన్న మెట్రో రైలు బోగీలు పరిమిత సేవలు అందిస్తున్నాయి. ప్రీక్వెన్సీ కారణంగా నిమిషాల వ్యవధిలోనే మరో ట్రైన్ అందుబాటులో ఉండటంతో… ప్రయాణికులు గంటల తరబడి ఎదురుచూడాల్సిన అవసరం లేకుండానే మెట్రో రైళ్లను ఎక్కే వీలు ఉంది. కానీ పీక్ అవర్స్‌లో ప్రీక్వెన్సీ తక్కువగా ఉన్నా… రద్దీ కారణంగా ప్రయాణికులకు ఇబ్బందులు తప్పడం లేదు. ముఖ్యంగా ఉదయం 7-8 లోపు, సాయంత్రం 6-7లోపు వచ్చే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో ఉన్న మూడు బోగీల్లో పరిమితికి మించి ప్రయాణించాల్సి వస్తోంది.
అయితే ప్రీక్వెన్సీ సర్దుబాటు చేసే వీలు లేకపోవడంతో… ఇప్పటికిప్పుడు పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా అదనపు బోగీలు తప్ప.. మరే మార్గం లేకపోవడంతో ప్రయాణికులు కిక్కిరిసిన మెట్రో రైళ్లలోనే ప్రయాణిస్తున్నారు. పెరిగిన రద్దీతో మెట్రో రైళ్లలో భద్రత ప్రమాదకరంగా మారింది. ముఖ్యంగా మహిళలకు కేటాయించిన బోగీలతో పాటు జనరల్ బోగీల్లో జనాల మధ్య నిలబడాలంటేనే భయపడిపోతున్నారు.ఎక్కువ రద్దీ సమయంలో మహిళలకు ఆకతాయిల వేధింపులతో పాటు సాధారణ సమయంలోనూ వేధింపులు ఎదురవడం ఆందోళన కలిగిస్తోంది. తోసుకుంటూ వెళ్లేవారి సంఖ్య ఎక్కువగా ఉండగా… అలాంటివారితో ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని మహిళలు వాపోతున్నారు. కనీసం ఆకతాయిలు చేసే చిల్లర వేషాలను కూడా ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితులు ఉన్నాయని నాగోల్-రాయదుర్గం మార్గంలో ప్రయాణించే ఓ టెక్కీ(మహిళ) వివరించారు.