సిటీబ్యూరో, జూలై 31(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఓల్డ్‌సిటీ మెట్రో ప్రాజెక్టు భవిత ఆగమ్యగోచరంగా మారింది. భూసేకరణలో ఎదురౌతున్న ఇబ్బందులతో ప్రాజెక్టు అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. ప్రభుత్వం అట్టహాసంగా ఓల్డ్ సిటీ మెట్రోకు శంకుస్థాపన అయితే చేసింది కానీ, క్షేత్రస్థాయి సమస్యలపై దృష్టి పెట్టలేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మూడు నెలల్లోనే భూసేకరణ పూర్తి చేసి, పనులు ప్రారంభిస్తామని చెప్పినా ఇంకా ఆస్తుల సేకరణ కోసం మెట్రో, రెవెన్యూ అధికారులు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఈ మార్గంలో ఉన్న మతపరమైన నిర్మాణాల విషయంలో ఎదురౌతున్న సమస్యలపై ఇప్పటికీ ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. దీంతో భూసేకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.
ముందుకు సాగని భూసేకరణ
హెచ్ఏఎంఎల్ సంస్థ ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణ్‌గుట్ట వరకు దాదాపు 7.5 కిలోమీటర్ల మేర మెట్రో రైల్ లైన్‌ను నిర్మిస్తోంది. దాదాపు రూ.2,500 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టు పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. భూసేకరణ కోసం హైదరాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం నోటిఫికేషన్ జారీచేసి, ప్రాజెక్టు కోసం 900 ఆస్తులను గుర్తించింది. ఇందులో పురాతన భవనాలు, మతపరమైన నిర్మాణాలు, రెసిడెన్షియల్, కమర్షియల్ కాంప్లెక్సులతో వేగంగా భూసేకర ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించారు.వీటిలో ఇప్పటివరకు 300 లోపు ఆస్తులను సేకరించి చెక్కులను పంపిణీ చేశారు. మిగిలిన 600 ఆస్తుల సేకరణపై చర్చలు సాగుతూనే ఉన్నాయి.
కోర్టును ఆశ్రయించిన బాధితులు..
ఓవైపు మెట్రో వర్గాలు, మరోవైపు జిల్లా రెవెన్యూ యంత్రాంగం భూసేకరణపై స్థానికులకు అవగాహన కల్పించి గజానికి రూ.81వేల చొప్పున భూపరిహారం, కమర్షియల్ ఆస్తులను కోల్పోతున్న దుకాణదారులకు తరలింపునకు అవసరమైన నిధులు ఇచ్చి భూసేకరణ చేపట్టేందుకు ప్రయత్నిస్తున్నా.. మతపరమైన కట్టడాలు, పరిహారం విషయంలో కొంతమంది కోర్టులను ఆశ్రయించడంతోనే భూసేకరణలో తీవ్ర జాప్యం జరుగుతుందని తెలిసింది. మతపరమైన, చారిత్రక భవనాల విషయంలో దాదాపు 100కు పైగా కేసులు పలు కోర్టుల్లో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలో కేసులు పరిష్కారం అయ్యేంత వరకు ఆ ఆస్తుల విషయంలో మెట్రో, రెవెన్యూ విభాగాలు ముందుకు కదల్లేని పరిస్థితులు ఉన్నాయి. ఈ క్రమంలో ఓల్డ్ సిటీ మెట్రోపై నీలినీడలు కమ్ముకున్నాయి.