సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశం అసెంబ్లీ ముగిసిన మరుసటి రోజున నిర్వహించే దిశగా కసరత్తు మొదలైంది. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి అధ్యక్షతన కార్పొరేటర్ల అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కౌన్సిల్ ఆలస్యానికి కారణాలు, ఏయే అంశాలపై చర్చ, కౌన్సిల్ మీటింగ్ తేదీ తదితర అంశాలపై విస్తృతంగా చర్చించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే జీహెచ్ఎంసీ కౌన్సిల్ ఏర్పాటు చేయాలని కార్పొరేటర్ల అఖిలపక్ష అభిప్రాయం వ్యక్తం చేసింది.
దీంతో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధికారులను సమావేశ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కార్పొరేటర్లు హేమ, గీతా ప్రవీణ్ ముదిరాజ్, సతీశ్, సింధూరెడ్డి, బీజేపీ కార్పొరేటర్లు శ్రావణ్, మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు రజిత పరమేశ్వర్ రెడ్డి, విజయారెడ్డి, సీఎన్ రెడ్డి, ఎంఐఎం కార్పొరేటర్లు మీర్జా ముస్తఫా బేగ్, సయ్యద్ మింజాదుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.