హైదరాబాద్, ఫిబ్రవరి 7(నమస్తే తెలంగాణ): రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అవుటర్ రింగ్ రోడ్డు, ఎయిర్ పోర్టుకు సమీపంలోని తొర్రూర్ ప్రాంతంలోని 105 ప్లాట్లకు శనివారం నిర్వహించిన బహిరంగ వేలంలో గజానికి గరిష్ఠంగా రూ.45వేల ధర పలికింది. బాటసింగారం ప్రాంతంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్హాల్లో రెండు రోజులపాటు కొనసాగనున్న ఈ వేలం పాట తొలిరోజున 70 ప్లాట్లను విక్రయించారు. తొర్రూరుతోపాటు ఓఆర్ఆర్కు సమీపంలోని బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడ ప్రాంతాల్లోని ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించడానికి రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ గత నెలలో నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం విదితమే.
శనివారం విక్రయించిన 70 ప్లాట్ల ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు సుమారు రూ.56 కోట్ల ఆదాయం సమకూరినట్లు మేనేజింగ్ డైరక్టర్ వీపీ గౌతం తెలిపారు. తొర్రూర్‌లోని ఓపెన్ ప్లాట్లను కొనుగోలు చేసేందుకు 150మంది పోటీపడినట్లు ఆయన చెప్పారు. 200 నుంచి 300 చదరపు గజాలున్న ఈ ప్లాట్లకు ధర గజానికి రూ.25వేలుగా నిర్ణయించగా, వేలంపాటలో రూ.41వేల నుంచి రూ.45వేల వరకూ ధర పలికింది. తొర్రూరు లేఔట్‌లోని మిగిలిన 35 ఓపెన్ ప్లాట్లకు, బహదూర్‌పల్లి, కుర్మల్‌గూడలోని మరో 32 ప్లాట్లకు ఆదివారం బహిరంగ వేలం నిర్వహించనున్నారు.
పోచారం, బండ్లగూడల్లో 71 ఫ్లాట్ల కేటాయింపు…
రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నాగోలు బండ్లగూడ, పోచారం ప్రాంతాల్లో నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీ మధ్యతరగతి, అల్పాదాయ వర్గాల కోసం ప్రత్యేకించిన ఫ్లాట్లలో 71 ఫ్లాట్లను లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించారు. బండ్లగూడలోని 15 ఫ్లాట్లు, పోచారం ప్రాంతంలో 56 ఫ్లాట్ల విక్రయం ద్వారా రాజీవ్ స్వగృహ కార్పొరేషన్‌కు సుమారు రూ.11 కోట్ల వరకు ఆదాయం వచ్చింది.