హైదరాబాద్ : నిమ్స్ దవాఖానలో దీర్ఘకాలికంగా పెండింగ్ సమస్యల కోసం నిమ్స్ నర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది చేపడుతున్న నిరసన కార్యక్రమాలను యాజమాన్యం అడ్డుకుంటోంది. శాంతియుతంగా నిరసన చేయకుండా యాజమాన్యం గేట్‌కు తాళం వేసి అడ్డుకున్న సంఘటన సోమవారం చోటు చేసుకుంది. దీంతో గేటు వద్దే ప్లకార్డులు ప్రదర్శించి నర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది తమ నిరసన తెలిపారు. యాజమాన్య మొండివైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
కాగా, సమ్మెకు సమాయత్తమవుతుండగా, వైద్యాధికారులు కొందరు బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సమ్మెకు పోతే ఉద్యోగాలు ఊడుతాయంటూ బెదిరిస్తున్నట్లు కన్సాలిడేట్ నర్సింగ్ ఉద్యోగులను బెదిరిస్తున్నట్లు సిబ్బంది ఒకరు ఆవేదనతో తెలిపారు. నిమ్స్ యాజమాన్య పెద్దతో పాటు తరచూ ఆరోపణలు ఎదుర్కొంటున్న డిప్యూటీ స్థాయి వైద్యాధికారి ఒకరు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.