సిటీబ్యూరో, జనవరి 21(నమస్తే తెలంగాణ) : సర్కారుకు హెచ్ఎండీఏ ప్రధాన వనరుగా మారింది, వేల కోట్లను భూముల వేలం ద్వారా తీసుకువచ్చి పెడుతోంది. ఇప్పటివరకు నిర్వహించిన భూముల వేలంతోనే దాదాపు రూ. 6438 కోట్లను తెచ్చింది. గతేడాది ఏడాదిలో జరిగిన వేలంలో 72 ఎకరాలను విక్రయించడంతో వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి చేరాయి. రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోవడంతో, భవన నిర్మాణ అనుమతుల కంటే ఎక్కువ మొత్తంలో భూముల వేలంతో నింపుకొంది. అత్యధికంగా కోకాపేట నియోపోలిస్ నుంచి ఎకరం రూ. 150 కోట్లకు విక్రయించగా… అదే తరహాలో 45ఎకరాల ద్వారా మరోసారి రూ. 5వేల కోట్ల అంచనా ఆదాయంతో సర్కారు అడుగులు వేస్తోంది. నగరంలో మిగిలిపోయిన వెంచర్లలోని ప్లాట్లతోపాటు, ఇతర ల్యాండ్ పార్శిళ్లను సిద్ధం చేసిన హెచ్ఎండీఏ.. ప్రభుత్వ ఆదేశాలతో సన్నాహాలు చేస్తోంది.
వేలం వేసే భూములివే..
హెచ్ఎండీఏ సిద్ధం చేసిన జాబితాలో నగరంలోని ప్రధాన ప్రాంతాల్లోని భూములు ఉన్నాయి. భూముల్లో ప్రధానంగా జాతీయ రహదారి 65ని ఆనుకుని, మూసాపేటలో ఉన్న 14 ఎకరాలు, కోకాపేట నియోపోలిస్ వెంచర్‌కు సమీపంలో ఉన్న మరో 15 ఎకరాలు, కొండాపూర్‌లోని 20 ఎకరాలతోపాటుగా బంజారాహిల్స్‌లో 8.7 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ల్యాండ్ పార్శిళ్లను వేలానికి సిద్ధం చేసింది. మొత్తంగా వీటి ద్వారా కనీసం రూ. 5వేల కోట్ల ఆదాయంపై సర్కారు ఆశలు పెట్టుకున్నది.
ఇప్పటికే నగరంలో పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు ప్రతిపాదనల్లో ఉన్నాయి. వీటిని పట్టాలెక్కించడానికి హెచ్ఎండీఏకు వస్తున్న ఆదాయం సరిపోవడం లేదు. దీంతోనే ఉన్న భూములను క్రమక్రమంగా విక్రయించడం ద్వారా నిధులు సర్దుబాటు చేసుకోవాలని చూస్తోంది. ఇక ప్రభుత్వం కూడా హెచ్ఎండీఏ చేపట్టే ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయించకపోవడంతో… ఉన్న ల్యాండ్ బ్యాంక్‌ను కరగదీసుకోవాలని చెబుతోంది. దీంతో హెచ్ఎండీఏ ఖాతాల్లో ఉన్న విలువైన భూములను మార్కెట్లోకి తీసుకువస్తోంది.
వేలంతో నెట్టుకొచ్చిన సర్కార్..
గతేడాదిలో కోకాపేట నియోపోలిస్, గోల్డెన్ మైల్, బహదూర్‌పల్లి, తొర్రూర్, తుర్కంయాంజల్ విక్రయించి, వచ్చిన ఆదాయాన్ని సర్దుబాటు చేసింది. దానికి అనుగుణంగా వేలకోట్ల రూపాయాలు ప్రాజెక్టుల ప్రతిపాదనలు చేతిలోఉన్నా.. పట్టాలెక్కించడంలో నిధుల సర్దుబాటు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలోనే కీలకమైన ప్రాజెక్టులను ప్రారంభించేందుకు అనివార్యంగానే నిధుల సర్దుబాటు సమస్యగా మారింది. దీంతోనే ఉన్న భూములతో రెవెన్యూ సమకూర్చుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి.
ఖజానా నింపుతున్న హెచ్ఎండీఏ
గతేడాదిలో కోకాపేట నియోపోలిస్, గోల్డెన్ మైల్, బహదూర్‌పల్లి, తొర్రూర్, తుర్కంయాంజల్ వంటి ప్రాంతాల్లో హెచ్ఎండీఏకు ఉన్న లే అవుట్లలో ప్లాట్లను విక్రయించింది. పలు దశల వారీగా నిర్వహించిన వేలంలో హెచ్ఎండీఏకు మంచి ఆదాయం మాత్రం కేవలం కోకాపేట నియోపోలిస్ నుంచి మాత్రమే వచ్చింది. ఇందులోనే 45 ఎకరాల ప్లాట్ల ద్వారా రూ. 3800 కోట్లు వచ్చి చేరాయి. అదే తరహాలో మరోసారి 45 ఎకరాలను కూడా విక్రయించనుంది. అయితే ఈసారి అంచనా ఆదాయం రెండింతలు చేయగా.. కొత్త ఏడాదికి భూముల వేలంతోనే హెచ్ఎండీఏ స్వాగతం పలుకుతోంది.