జవహర్‌నగర్, సెప్టెంబర్ 12: భూ వివాదాలే హత్య కు దారి తీశాయి. జవహర్‌నగర్‌లో ఈ నెల 9న కారుతో ఢీకొట్టి, కత్తితో అతి దారుణంగా మెడ కోసి హత్య చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. నిందితుల కోసం ఏడు ప్రత్యేక పోలీసులు బృందాలు రంగంలోకి దిగాయి. ఐదుగురు నిందితులను మంగళవారం అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. జవహర్‌నగర్ పీఎస్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మల్కాజిగిరి ఎస్ఓటీ ఇన్చార్జి డీసీపీ గిరిధర్ వివరాలను వెల్లడించారు. జవహర్‌నగర్ కార్పొరేషన్ పరిధి లక్ష్మీనర్సింహాకాలనీలో మాజీ సైనికుడి వద్ద 10 ఎకరాల స్థలాన్ని పరమకుశం లక్ష్మణ్, శ్రీశైలం, మరో ఇద్దరు కలిసి తీసుకున్నారు. ఆ స్థలాన్ని ప్లాట్లుగా మార్చి విక్రయించారు. ప్లాట్ల విషయంలో భాగస్వాముల మధ్య వివాదం మొదలైంది. ప్లాట్ల గొడవల నేపథ్యంలో శ్రీశైలం కొడుకు వేణు ఇటీవల మరో భాగస్వామి అయిన పరమకుశం లక్ష్మణ్‌ను బెదిరిస్తున్నాడు. అతడి తీరుతో లక్ష్మణ్ తీవ్రంగా ఇబ్బంది పడ్డాడు. భూమిలో కాలు పెడితే చంపేస్తా.. అంటూ వేణు బెదిరించాడు.
దీంతో లక్ష్మణ్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా వేణును అంతమొందించాలని పథకం వేశాడు. 20 రోజుల కిందట సుపారీ గ్యాంగ్‌తో మాట్లాడి.. వేణును చంపేందుకు ఒక్కొకరికి 5 లక్షలు, ప్లాట్లు ఇస్తానని ఒప్పందం చేసుకున్నాడు. ఈ నెల 9వ తేదీ సాయంత్రం వేణు నోబుల్ స్కూల్ వద్ద బజ్జీలు తీసుకొని లక్ష్మీనర్సింహాస్వామికాలనీకి బైక్‌పై బయలుదేరాడు. లక్ష్మణ్ కుమారుడు పరమకుశం పవన్ అ తడి వెనుకే కారులో వెళ్లాడు. చెన్నాపురం చెరువు వద్ద వేణు బైక్‌ను షిఫ్టు కారుతో నిందితులు ఢీకొట్టి, కత్తితో మెడను కోసి హత్య చేశారు. వేణు మరణించాడని నిర్ధారించుకున్నారు. ఆ తర్వాత తండ్రి లక్ష్మణ్‌కు పవన్ ఫోన్‌చేసి పరారయ్యారు. వేణును హత్య చేసేందుకు నిందితులు ఎర్రగడ్డలో 6 కత్తులు, కరం పొడి కొనుగోలు చేశారని డీసీపీ తెలిపారు. ఈ హత్య కేసులో నిందితులైన పరమకుశం పవన్(26), పరమకుశం లక్ష్మణ్(54), శివరాత్రి సురేశ్ (23), గౌడి జగదీశ్(26), మల్లెబోయిన సాయికిరణ్(23)ను అరెస్ట్ చేసి, రిమాండ్‌కు తరలించారు. జవహర్‌నగర్ ఇన్స్పెక్టర్ సీతారాం, మల్కాజిగిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ రాములు, ఎస్సైలు ఇద్రీస్ అలీ, అనిల్‌కుమార్, అనిల్‌రెడ్డి, లక్ష్మణ్‌ను ఎస్ఓటీ ఇన్చార్జీ డీసీపీ గిరిధర్, కుషాయిగూడ ఏసీపీ వెంకట్‌రెడ్డి అభినందించారు.