Metro Rail | సిటీబ్యూరో, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ వేదికగా 30 లక్షల మందికి ఉపయోగపడే మెట్రో విషయాన్ని అడిగినోళ్లే లేకుండా పోయారు. డీపీఆర్ కేంద్రానికి చేర్చి కాంగ్రెస్ సర్కారు చేతులు దులుపుకొంటే… సవరణల పేరిట కేంద్రంలోని బీజేపీ దోబూచులాడుతోంది. ఇక తమ ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించుకోవాల్సిన పార్లమెంటరీ సభ్యులు కూడా ఇవేవీ తమకు చెందినవి కానట్లుగా వ్యవహరిస్తూ… ప్రతిష్టాత్మకమైన మెట్రో విస్తరణ ప్రాజెక్టును నీరుగారిపోయేలా చేస్తున్నారు. దీంతోపాటు నగరానికి చెందిన ఏ ఒక్క ఎంపీ కూడా ఈ అంశాన్ని పార్లమెంట్ వేదిక ఇప్పటివరకు ప్రస్తావించలేదు. సమావేశాలు ప్రారంభంలో కాంగ్రెస్ ఎంపీ చామల తన అభిప్రాయాన్ని వెల్లడించినా.. ఆశించిన స్థాయిలో దీనిపై చర్చ జరగలేదు.
నిధుల విషయం దేవుడెరుగు..
హైదరాబాద్ నగరానికి మణిహారం వంటి మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులతోపాటు, నిధులు మంజూరు చేస్తేనే మనుగడ ఉంటుంది. గడిచిన ఏడు నెలలుగా కనీసం ఈ ప్రాజెక్టులకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ఆమోదించలేదు. నిధుల విషయం దేవుడెరుగు.. కనీసం అనుమతులిచ్చినా, ప్రాజెక్టుకు జీవం పోసినట్లు అవుతుంది. కానీ సమర్పించిన డీపీఆర్లను ఏడు నెలలుగా నాన్చుతూనే ఉంది. దీంతో నగరంలో కీలకమైన నార్త్ సిటీ మెట్రోపాటు, హయత్నగర్, పటాన్చెరు వరకు విస్తరణ ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ముఖ్యంగా శరవేగంగా విస్తరిస్తున్న నార్త్ సిటీ ప్రాంతానికి మెట్రో నిర్మాణం అత్యంత కీలకం. ఈ ప్రాంతంలో విస్తరిస్తున్న పారిశ్రామిక, నివాస సముదాయాలతో కోర్ సిటీ తరహాలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో ఆర్టీసీ మినహా మాస్ ట్రాన్స్పోర్టేషన్ సదుపాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇబ్బడిముబ్బడిగా పెరిగిన వ్యక్తిగత వాహనాలతో ఈ ప్రాంతానికి రాకపోకలు అంటేనే నరకాన్ని తలపిస్తున్నాయి. స్థానికులు ఈ స్థాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మెట్రో విషయంలో కేంద్రాన్ని ఒత్తిడి చేయడంలో కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు వెనుకడుగు వేస్తున్నారు.
ప్రశ్నించకపోతే… అనుమతులు హుళక్కే
సికింద్రాబాద్, మల్కాజిగిరితోపాటు, చేవెళ్ల ఎంపీ స్థానాల్లో బీజేపీ పాగా వేసింది. ప్రస్తుతం ప్రతిపాదిత ప్రాజెక్టు కూడా ఈ మూడు పార్లమెంటరీ నియోజకవర్గాల్లో ప్రధానంగా విస్తరించి ఉంది. కానీ కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో ఏ ఒక్క ఎంపీ కూడా ఇప్పటివరకు ప్రయత్నించలేదు. ముఖ్యంగా నార్త్ సిటీ మెట్రో ఆవశ్యకతను వివరిస్తూ ఇప్పటికే మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో పార్టీలకతీతంగా ఎంపీలను కలిసి తమ గోడు వినిపించింది.
ఇక హైదరాబాద్ మెట్రో ఎండీ కూడా తెలంగాణ ఎంపీలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించి… మెట్రో విస్తరణ ప్రాధాన్యతను వివరించారు. కానీ ఇప్పటికీ వరకు చేసిన ప్రయత్నాలేవి ఫలించలేదు. ఓవైపు ఏపీకి రూ. 10వేల కోట్లు, బెంగళూరు మెట్రో ప్రారంభోత్సవానికి కేంద్రం సహకరిస్తుందే తప్పా… తెలంగాణ ప్రాజెక్టుల విషయంలో మొదటి నుంచి నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది.
చర్చ ఏదీ..?
ఫేజ్-2 మెట్రోపై వర్షాకాల సమావేశాల్లో చర్చించాలని మేడ్చల్ మెట్రో సాధన సమితి డిమాండ్ చేసింది. కేంద్రం వద్ద పెండింగ్లో ఉన్న మెట్రో ప్రతిపాదనల ఆవశ్యకతను అసెంబ్లీ, పార్లమెంట్ వేదికగా చర్చ జరగాలని కోరింది. అదే విధంగా చట్టసభలో ఆమోదించిన తీర్మానాన్ని కేంద్రానికి అందజేసి, నగరానికి కీలకమైన మెట్రో నిర్మాణానికి కృషి చేయాలని ప్రభుత్వానికి సూచించింది.
ఫేజ్-2 పార్ట్ ఏ, పార్ట్- బీ డీపీఆర్లను గతేడాది నవంబర్ 4న, ఫేజ్-2 పార్ట్ బీని ఈ ఏడాది జూలై 20న కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం అందజేసినా.. ఇప్పటికీ ఆమోదం పొందలేదని, ఈ క్రమంలో కేంద్ర సర్కారుపై ఒత్తిడి పెంచేలా రాష్ట్రంలోని శాసనసభ్యులు చొరవ తీసుకోవాలని, అదేవిధంగా బీజేపీ ఎంపీలు కూడా మెట్రో సాధనకు ప్రాధాన్యతనివ్వాలని కోరింది. కానీ ఇప్పటివరకు ఈ అంశంపై చర్చనే జరగలేదు.