హైదరాబాద్ మెట్రో విస్తరణలో కేంద్రం రాష్ర్టానికి మళ్లీ మొండి చేయి చూపింది. చోటే భాయ్ డ్రీమ్ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీకి మెట్రో పరుగులు పెట్టించాలని కలలు కంటుంటే… బడే భాయ్ ఆశలు నీళ్లు చల్లుతున్నారు. నగరానికి రావాల్సిన మెట్రో విస్తరణ మరోసారి వెనక్కి వెళ్లిపోయింది. ఇదే సమయంలో ఢిల్లీలో మెట్రో విస్తరణ కోసం కేంద్రం రూ. 12వేల కోట్లను మంజూరు చేసి సిటీ మెట్రో ప్రాజెక్టును నీరుగార్చేలా వ్యవహరిస్తున్నది కేంద్రం.
సిటీబ్యూరో, డిసెంబర్ 24(నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మెట్రో విస్తరణ అంశం హైదరాబాద్-ఢిల్లీ మధ్య నలిగిపోతుంది. రెండో దశ మెట్రో విస్తరణ కోసం రూ. 48వేల కోట్ల అంచనాతో డీపీఆర్ రూపొందించి అనుమతులు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఈ ప్రాజెక్టు విషయంలో కేంద్రం దృష్టి సారించలేదు. కనీసం ఫేస్-2 పార్ట్ ఏలో ఉన్న నాగోల్ శంషాబాద్, రాయదుర్గం కోకాపేట, ఎంజీబీఎస్ చాంద్రాయణ్‌గుట్ట, మియాపూర్, పటాన్చెరు, ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్, పార్ట్ బీలో జేబీఎస్ నుంచి మేడ్చల్, జేబీఎస్ నుంచి శామీర్‌పేట, ఎయిర్ పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మొత్తంగా 166 కిలోమీటర్ల మేర కేంద్ర, రాష్ట్ర వాటాలతో నిర్మించాల్సిన ప్రాజెక్టును పక్కనపెట్టేసింది. అయితే ప్రాజెక్టు ఆమోదంలో నిధుల సర్దుబాటుపై రాష్ట్ర సర్కారు ప్రతిపాదించిన విధానాలతోనే జాప్యం జరుగుతుందనే విమర్శలు ఉన్నాయి. ఇదే సమయంలో దేశంలోని ఇతర మెట్రో ప్రాజెక్టులను చకచక ఆమోదిస్తున్న కేంద్రం.. హైదరాబాద్ మెట్రోపై విముఖత వ్యక్తం చేస్తూనే ఉంది.

నగరంలో మెట్రో విస్తరణ ప్రాజెక్టు త్రిశంకు స్వర్గంలా మారింది. వేల కోట్ల అంచనాలతో సమర్పించిన ప్రతిపాదనలు కేంద్రం బుట్టదాఖలు చేస్తోంది. రాష్ట్ర సర్కారు నగరంలో మెట్రో ప్రాజెక్టును విస్తరిస్తామని చెప్పి… 160 కిలోమీటర్ల మేర డీపీఆర్‌ను రూపొందించి కేంద్రానికి అప్పగించింది. డీపీఆర్‌లో ఉన్న లోపాలు, నిర్మాణంలో ఉన్న సంక్లిష్టతలను మెట్రో విస్తరణకు ఆటంకాలు మారుతుండగా, కేంద్రం ఇవే విషయాలను లేవనెత్తుతూ మెట్రో విస్తరణ ప్రాజెక్టుపై అనుమతులు ఇవ్వకుండా పక్కన పెడుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ నగరంలో నాలుగో దశ మెట్రో విస్తరణకు మాత్రం ఒకేసారి రూ. 12000 కోట్లను మంజూరు చేసేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది.
