HMDA | సిటీబ్యూరో, ఫిబ్రవరి 24 (నమస్తే తెలంగాణ) : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన మాజీ ప్లానింగ్ డైరెక్టర్ శివబాలకృష్ణ అవినీతి ప్రభావం హెచ్ఎండీఏను వెంటాడుతోంది. వారం రోజుల పాటు ఏసీబీ అధికారులు హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలో పెద్ద ఎత్తున సోదాలు నిర్వహించి, అనేక విషయాలను రాబట్టారు. అక్కడ జరిగిన అవినీతిలో చాలా మంది ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇక నుంచి హెచ్ఎండీఏ అధికారుల అవినీతిని బయటపెట్టేందుకు విజిలెన్స్ సోదాలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఇష్టారాజ్యంగా వ్యవహరించిన అధికారులను ఇంటికే పంపిస్తామని చెప్పడంతో అధికార యంత్రాంగంలో వణుకు మొదలైంది. మహానగరాభివృద్ధిలో కీలకమైన హెచ్ఎండీఏ పనితీరుపై ప్రధానంగా దృష్టి సారించి వరసగా ఉన్నత స్థాయి సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.
అదే క్రమంలోనే శుక్రవారం నిర్వహించిన సమీక్షలో హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ పరిధిలో చాలా భవనాలకు సంబంధించిన ఫైల్స్ కనిపించడం లేదని, ఆన్లైన్లో లేకుండా ఇష్టారాజ్యంగా అనుమతులు ఇచ్చారని, అన్లైన్లో లేకుండా ఇచ్చిన అనుమతుల జాబితా తయారు చేయాల్సిందేనని సీఎం తేల్చిచెప్పారు. దీంతో ప్రణాళికా విభాగంలో మిస్సయిన ఫైళ్లపై ఉత్కంఠ నెలకొంది. పురపాలక, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ సీఎం రేవంత్ రెడ్డి వద్దే ఉండడంతో అధికారుల్లో మరింత భయాందోళన కనిపిస్తోంది. శివ బాలకృష్ణకు సహకరించిన వారితో పాటు జోన్ల వారిగా ఉన్న ప్లానింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్లానింగ్ అధికారులు, జూనియర్ ప్లానింగ్ అధికారులు… ఇలా అందరూ కలిసి ఇచ్చిన అనుమతులను విజిలెన్స్ అధికారులు పరిశీలిస్తే ఎలాంటి నిజాలు బయటకు వస్తాయోన్న భయం ప్లానింగ్ విభాగంలోని అధికారులను వెంటాడుతోంది. డిప్యూటేషన్‌పై వచ్చిన వారితో పాటు ఏండ్ల తరబడిగా హెచ్ఎండీఏలో ఒకే చోట పనిచేస్తున్న అధికారులు సోదాల పేరు చెప్పగానే హడలిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది.