మేడ్చల్, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ఎలాంటి రాజకీయ ఒత్తిడులకు లోను కాకుండా నిజమైన అర్హులకే ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని, రేషన్ కార్డులు జారీ చేయాలని లేదంటే ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ హెచ్చరించారు. అధికారంలోకి వచ్చేందుకు అలవికాని హామీలన్నీ ఇచ్చి అవి నెరవేర్చలేక బూటకపు గణాంకాలతో గ్యారంటీలు నెరవేర్చినట్టు చూపించి కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజలందరినీ మోసగిస్తున్నదని వారు ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పథకాలు అందించేందుకు చేస్తున్న సర్వేలు సరిగా జరగలేదని ఆరోపించారు. శనివారం వారిద్దరూ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం హామీల అమలు తీరును ప్రశ్నించారు.
ఆదాయ అర్హతను పెంచాలి
జీహెచ్ంఎసీ పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి 10 లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే 5.56 లక్షల దరఖాస్తులనే పరిశీలించారు. స్థలం ఉన్న వారికి ఇండ్లు మంజూరు చేస్తునే ఆస్తి పన్ను కడుతున్న వారందరికీ ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలి. ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వేలో జియో ట్యాంగిగ్ చేయలేదు. వివిధ రకాల సాకులు చూపి అర్హులైన దరఖాస్తుదారులను అనర్హులుగా చూపేందుకు సర్కారు ప్రయత్నిస్తున్నది. కాంగ్రెస్ నాయకులు సూచించినవారినే లబ్ధిదారులుగా ఎంపిక చేస్తున్నారని తెలుస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో ఇండ్ల కోసం 10 లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే..కేవలం 10 వేల మందికే మాత్రమే ఇచ్చేందుకు ప్రభుత్వం యోచిస్తున్నది. రేషన్‌కార్డుల జారీకి ఆదాయ అర్హతను 3 లక్షలకు పెంచాలి.
-మర్రి రాజశేఖర్‌రెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే
గ్యారంటీల్లో అవకతవకలు సహించం
అర్హులకు పథకాలు అందకుంటే ప్రజలతో కలిసి ఉద్యమిస్తాం. గ్యారెంటీల అమలులో అధికారులు రాజకీయ ఒత్తిడులకు అధికారులు గురికావొద్దు. అర్హుల ఎంపిక ప్రక్రియలో అవకతవకలు జరిగితే సహించేంది లేదు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి 1.43 లక్షల దరఖాస్తులను, రేషన్‌కార్డులకు 1.22 లక్షల దరఖాస్తులను స్వీకరించారు. ఈ నెల 26 తర్వాత అర్హులందరికీ 4 గ్యారెంటీలను అందించాలి. లేదంటే ఉద్యమిస్తాం.
-కేపీ. వివేకానంద్ , కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే