ఖైరతాబాద్, డిసెంబర్ 28 : ‘నిమ్స్ కార్మికుడు లింగయ్యపై జరిగిన ఘటన బాధాకరం.. 24 గంటల సమయం ఇవ్వండి….బాధ్యులపై చర్యలు తీసుకుంటాం’ అని డైరెక్టర్ డాక్టర్ నగరి బీరప్ప అన్నారు. శనివారం నిమ్స్ కార్మికులు, వివిధ కార్మిక సంఘాలతో డైరెక్టర్ సమావేశమయ్యారు. లింగయ్యపై జరిగిన ఘటనపై ఆయా సంఘాల నాయకులతో చర్చించారు. సెక్యూరిటీ అధికారి రామారావు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు వల్ల అన్యాయంగా అమాయకుడిని ఎలాంటి నిజ నిజాలు తెలుసుకోకుండా పోలీసులు చితకబాదారని ఆయా నేతలు తెలిపారు. డైరెక్టర్ మాట్లాడుతూ నిమ్స్‌లో ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, లేదా సూపరింటెండెంట్, ఆర్ఎంఓకు తెలుపాలని సూచించారు. ఏకపక్ష నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయన్నారు. 24 గంటల్లో పూర్తి విచారణ జరుపుతామని, బాధ్యులు ఎంతటి వారైనా వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.