వనస్థలిపురం, మే 15 : ప్రసవం సమయంలో శిశువు మృతిచెందిన ఘటన వనస్థలిపురం ఏరియా దవాఖానలో చోటుచేసుకున్నది. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతిచెందినట్లు సోషల్ మీడియాలో పుకార్లు శికారు చేశాయి. వివరాల్లోకి వెళితే.. సూర్యాపేట ప్రాంతానికి చెందిన దంపతులు హయత్నగర్ బాలాజీనగర్లో నివాసముంటున్నారు. సదరు వివాహిత మూడవ కాన్పు కోసం వనస్థలిపురం ఏరియా హాస్పిటల్లో మంగళవారం చేరింది. అదేరోజు అర్ధరాత్రి ఆమెకు నొప్పులు రావడంతో వైద్యులు అత్యవసరంగా ప్రసవానికి ఏర్పాటు చేశారు. ప్రసవం సమయంలో శిశువు మృతిచెందింది. దీంతో వైద్యుల నిర్లక్ష్యం వల్లనే శిశువు మరణించినట్లు వాట్సాప్లో మెసేజ్లు చక్కర్లు కొట్టాయి. జరిగిన ఘటనపై దంపతులుగానీ, వారి కుటుంబ సభ్యులు గానీ పోలీసులకు, వైద్యాధికారులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు స్పష్టం చేశారు.
గర్భిణికి మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత నొప్పులు రావడంతో హాస్పిటల్ డ్యూటీ డాక్టర్స్ ప్రసవం చేశారు. ప్రసవం సమయంలో శిశువు బొడ్డు తాడు జారింది. సాధారణంగా బొడ్డు తాడు జారడం వల్ల శిశువుకు ఆక్సిజన్ అందక మరణించే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అది ఈ వివాహిత విషయంలో జరగడం దురదృష్టకరం. దీనిపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అనవసరమైన పుకార్లు పుట్టిస్తూ ప్రభుత్వ దవాఖానలపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ దవాఖానలకే కాకుండా అక్కడ సేవలు అందిస్తున్న వైద్యసిబ్బంది మానసిక ైస్థెర్యాన్ని దెబ్బతీస్తుంది.