సిటీబ్యూరో, ఏప్రిల్ 22(నమస్తే తెలంగాణ): కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కోసం ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించడంతో న్యాయం గెలిచిందంటూ…బీఆర్ఎస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షగట్టిన కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి హైకోర్టు తీర్పు ఒక గట్టి చెంపపెట్టు అని అభివర్ణించారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఏర్పాటు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు వంటి వారిపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దు అని హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ తరపున స్వాగతిస్తున్నామన్నారు.
కాళేశ్వరం గొప్పతనం అర్థం కావడానికి కాంగ్రెసోళ్లకు రెండున్నర సంవత్సరాలు పట్టిందని దుయ్యబట్టారు. కాళేశ్వరం ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల సాగునీటి పథకమని తెలిపారు. ఇప్పటికైనా కాంగ్రెస్ సర్కార్ రాజకీయ కుట్రలు పక్కన పెట్టి రైతన్నల కోసం పనిచేయాలని హితవు పలికారు. కాగా, హైకోర్టు తీర్పు నేపథ్యంలో బుధవారం బీఆర్ఎస్ నేతలు తెలంగాణ భవన్ వద్ద బాణాసంచా కాల్చి సంబురాలు జరుపుకొన్నారు. స్వీట్లు పంచుకొని సందడి చేశారు.