దుర్గంధం..విషపు గాలలు.. తాగలేని నీరు..విజృంభిస్తున్న రోగాలు.. ఇలా జవహర్‌నగర్ యార్డు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నది. పరిసర ప్రాంతాలు కాలుష్య కోరల్లో చిక్కుకొని పీల్చేగాలి విషమై పోయింది. దీంతో అక్కడ మనుగడ సాగించడం దినదినగండంగా మారుతోంది. గుట్టలు.. గుట్టలుగా చెత్త
పేరుకుపోవడంతో కాలుష్యం కోరలు చాచుతున్నది. రకరకాల వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇండ్లు అమ్ముకొని ఎక్కడికైనా వెళ్దామన్నా.. కొనేవారు లేరు. అటు ఉండలేక.. ఇటు వెళ్లలేక జనం గోస వర్ణనాతీతం. రోగాలతో కష్టపడి సంపాదించిన సొమ్మంతా దవాఖానలకే ఖర్చు పెట్టాల్సి వస్తున్నది ప్రజలు వాపోతున్నారు.
శ్వాసకోస వ్యాధులతో పిల్లలు, పెద్దలు అనారోగ్యానికి గురవుతున్నారు. గాలి పీల్చుకుందామన్నా.. భయపడాల్సిన పరిస్థితి ఉంది. కాలుష్యం కాటేస్తున్నా.. స్థానిక ప్రజలు నిస్సహాయ స్థితిలో దుర్భర జీవితాన్ని గడపాల్సి వస్తున్నది.
అభివృద్ధి చెందిన నగరాల్లో హైదరాబాద్ ఒకటి. కానీ ప్రస్తుతం గుట్టలు గుట్టలుగా చెత్త పేరుకుపోవడంతో విషపు గాలులు, దుర్వాసనతో ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారు. వ్యాధుల బారిన పడుతున్నారు. దుర్గంధం, కాలుష్యం కాటేస్తున్న నిస్సహాయ స్థితిలో దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఇది
జవహర్‌నగర్ పరిసరాల్లోని గ్రామాల ప్రజల దుస్థితి. డంపింగ్ యార్డుతో ఈగలు, దోమలు కారణంగా ప్రజలు కలరా, మలేరియా, టైఫాయిడ్, చర్మవ్యాధుల బారిన పడుతున్నారు.నిత్యం ఏదో ఒక వ్యాధితో శారీరకంగా, ఆర్థికంగా నష్టపోతున్నారు. రోగనిరోధక శక్తిని కోల్పోయి దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. ప్రభుత్వానికి విన్నవించినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు.
– సిటీబ్యూరో/ మేడ్చల్, జూన్ 26(నమస్తే తెలంగాణ):
విషపు గాలులు, దుర్గంధ భరితమైన వాతావరణంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. 20కి పైగా గ్రామాల్లో నిత్యం ఎవరో ఒకరూ దవాఖాన పాలవుతున్నారు. మునుపెన్నడూ చూడని, సోకని వ్యాధుల బారిన పడుతున్నారు. ఎవరికీ ఎప్పుడు ఎలాంటి వ్యాధులు వస్తున్నాయో తెలియని దయనీయమైన దుర్భర జీవనాన్ని సాగిస్తున్నారు. తమకు సంబంధం లేకపోయినా.. తమ ప్రమేయం లేక పోయినా దుర్గంధం,కాలుష్యం కాటేస్తున్నా ఏమి చేయలేని పరిస్థితుల్లో జీవిస్తున్నారు. ఇది జవహర్‌నగర్ పరిసరాల్లోని గ్రామాల ప్రజల దుస్థితి. నిత్యం ఏదో ఒక వ్యాధి బారిన పడుతూ శారీరకంగా, ఆర్థికంగా చితికిపోతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ తో పాటు చుట్టూ పక్కల ఉన్న మున్సిపాలిటీల నుంచి వచ్చిన చెత్తతో వ్యాధులు, కాలుష్య కారకాలను భరిస్తూ అవస్థలు పడుతున్నారు. దుర్గంధం, కాలుష్యం వల్ల తాగునీటిని కూడా కొనుక్కుని తాగుతున్నారు. కలరా, మలేరియా, టైఫాయిడ్, చర్మ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం ఏదో ఒక జ్వరంతో బాధపడుతూ రోగనిరోధక శక్తిని కోల్పోయి వృద్ధులు దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారు. తమ ప్రమేయం లేకుండానే ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆర్థిక, శారీరక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తమ ఇండ్లకు చుట్టాలు కూడా రాని దుర్భర జీవనాన్ని సాగిస్తున్నారు. జవహర్‌నగర్ పరిసర ప్రజలు అనధికార వెలివేతను ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వానికి ఎన్ని వినతులు ఇచ్చినా పట్టించుకోకపోవడంతో తీవ్ర అవస్థలు పడుతున్నారు.
జవహర్ నగర్ డంపింగ్ యార్డును రాంకీ సంస్థ నిబంధనలు పాటించకుండా నిర్వహిస్తున్నది. చెత్త వినియోగం, రీసైక్లింగ్ ప్రణాళికబద్ధంగా చేపట్టడం లేదు. రీసైక్లింగ్ వేగవంతంగా జరగకపోవడం వల్ల చెత్త గుట్టగుట్టలుగా పేరుకుపోతున్నది. గ్రేటర్‌తో పాటు పరిసర మున్సిపాలిటీల చెత్త మొత్తం ఇక్కడే డంపు
చేయడం వల్ల దుర్వాసన, కాలుష్యంతో పరసర గ్రామాల ప్రజలు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. డంపింగ్ యార్డును ఏర్పాటు చేసిన సమయంలో 2,500 మెట్రిక్ టన్నుల చెత్త మాత్రమే వచ్చేది. ఇప్పుడు 10 వేల మెట్రిక్ టన్నులు దాటుతుండటంతో దుర్వాసన, కాలుష్యం తీవ్రత పెరిగిపోతున్నది.
– సమ్మిరెడ్డి, డంపింగ్ యార్డు బాధిత జేఏసీ కో కన్వీనర్
నగరం నలుమూలల నుంచి వచ్చే చెత్తను ఒకేదగ్గర గుట్టలు గుట్టలుగా పోగు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నది. డంపింగ్ యార్డు కెపాసిటీని మించి చెత్తను ఇక్కడికి తరలిస్తున్నారు. చెత్తను డంపింగ్ చేయడం తప్ప వినియోగించడంలో నిర్వహణ పూర్తిగా గాలికొదిలేశారు. జవహర్ నగర్ డంపింగ్ యార్డు నుంచి సుమారు 10 కిలోమీటర్ల మేరకు కాలుష్యం ఏర్పడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దుర్వాసన రాకుండా క్యాపింగ్ చేశారు. ప్రస్తుతం క్యాపింగ్ మీద చెత్తను వేయడంతో దుర్వాసన మరింత పెరిగింది.
– మేకల కావ్య, మాజీ మేయర్, జవహర్‌నగర్
డంపింగ్ యార్డు పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు కాలుష్యం, దుర్వాసన వల్ల అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. కలుషితమైన గాలి, నీరుతో పాటు దుర్వాసన వల్ల కలరా, టైఫాయిడ్, మలేరియా, అలర్జీ వంటి వ్యాధులు సోకుతున్నాయి. దుర్వాసన వల్ల శ్వాసకోశ వ్యాధులతో పాటు ఊపిరితిత్తులు చెడిపోయో
ప్రమాదం ఉంది. ప్రతిరోజు కాలుష్యం ఉన్న గాలిని పీల్చుకోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది. దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. నీటి కాలుష్యంతో పాటు దుర్వాసన వల్ల చర్మవ్యాధులు వ్యాప్తి చెందుతాయి.
-డాక్టర్ వేణుగోపాల్, జనరల్ ఫిజీషియన్
డంపింగ్ యార్డు సమీపంలోని ప్రాంతాలన్నీ విషపూరితంగా మారాయి. శ్వాసకోస వ్యాధులతో పిల్లలు, పెద్దలు అనారోగ్యానికి గురవుతున్నారు. గాలి పీల్చుకుందామన్నా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. చెత్తను తరలించే క్రమంలో రాంకీ యాజమాన్యం నిబంధనలు పాటించడం లేదు. ఉదయం నుంచి రాత్రి
వరకు చెత్తను డంపింగ్ యార్డుకు తీసుకువస్తున్నారు. చెత్త, దుమ్ము, చెడు గాలి ఇండ్లలోకి చేరి ఇబ్బందులు పడతున్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి డంపింగ్ యార్డును తొలగించాలి.
– సందీప్, కార్మిక్‌నగర్
విపరీతమైన దుర్వాసన, కాలుష్యం వల్ల మా ఇండ్లలోకి బంధువులు రావడమే మానేశారు. ఎవరైనా ఒక్కసారి వస్తే మళ్లీ రావడం లేదు. ఎంత దగ్గరి బంధువులైనా ఇంటికి వచ్చినా భోజనం చేయకుండా వెళ్లిపోతున్నారు. ఇంత దుర్వాసనలో ఎలా ఉంటున్నారంటూ ప్రశ్నిస్తున్నారు. వారికి ఏమీ చెప్పలేకపోతున్నాం. ఈ బాధలు ఎదుర్కొంటున్న మమ్మల్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. నిరుపేదల జీవితాలతో ప్రభుత్వం ఆటలాడటం సరికాదు. ఇకనైనా దుర్వాసన, కాలుష్య బాధల నుంచి విముక్తి కల్పించండి.
– పద్మ,కార్మికనగర్
జవహర్‌నగర్ డంపింగ్ యార్డు సమీప గ్రామాల ప్రజల ఇబ్బందులను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అధికారులు, మంత్రులకు ఎన్ని వినతులు ఇచ్చినా స్పందన కరవైంది. కాలుష్యం, దుర్వాసనలో మా బతుకులు చితికిపోతున్నా చూస్తున్నారు. వేలాది మంది అనారోగ్యాల బారిన పడి శారీరకంగా,
మానసింగా, ఆర్థికంగా నష్టపోతున్నా పట్టించుకోవడం లేదు. ప్రతి ఇంట్లో నిత్యం ఎవరో ఒకరు అనారోగ్యం బారిన పడుతున్నారు. ఇప్పటికైనా డంపింగ్ యార్డును తొలగించి మమ్మల్ని ఆదుకోవాలి.
– రాజు, బండ్లగూడ
డంపింగ్ యార్డు నుంచి వచ్చే వాసన భరించలేక పోతున్నాం. ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలందరూ రోగాల బారిన పడుతున్నారు. దమ్మాయిగూడ పరిధిలో ఎక్కడ బోర్లు వేసినా నీళ్లు పసుపు పచ్చగా వస్తున్నాయి. తాగడానికి నీళ్లు లేక డబ్బులు పెట్టి కొనుక్కోవల్సిన దుస్థితి వస్తున్నది. బోర్ల నుంచి వచ్చిన నీరు దుర్వాసన
వస్తుండంతో అవసరాలకు కూడా వాడుకోలేని పరిస్థితి ఏర్పడింది. దుర్గంధమైన వాసన వల్ల శ్వాస పీల్చుకోలేకపోతున్నాం. డంపింగ్ యార్డు నుంచి రోజురోజుకు దుర్వాసన పెరిగిపోతున్నది.రమేశ్‌గౌడ్, దమ్మాయిగూడ
జవహర్ నగర్ డంపింగ్ యార్డు నుంచి వస్తున్న దుర్వాసన వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. కాలుష్య నియంత్రణ మండలి, ప్రభుత్వ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. దుర్వాసన, కాలుష్యం వల్ల చర్య, శ్వాస కోశ వ్యాధులు ప్రబలి చిన్న పిల్లలు, వృద్ధులు చనిపోతున్నారు. మా
ప్రాణాలు పోతున్నా అధికారులు, ప్రభుత్వ ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. ఇక్కడి నుంచి డంపింగ్ యార్డును తొలగించి మా ప్రాణాలను కాపాడాలి. రాంకీ సంస్థ యజమాన్యం నిబంధనలు పాటించకుండా చెత్తను గుట్టలు పేరుకుపోయేలా చేస్తున్నది.
– నరహరిగౌడ్, దమ్మాయిగూడ