సిటీబ్యూరో, మే 14 (నమస్తే తెలంగాణ ) : ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన జీహెచ్ఎంసీకి భరోసా కల్పించాల్సిన సర్కారు సంస్థ ఉనికిని ప్రశ్నార్థకం చేసింది. జీహెచ్ఎంసీని సైబరాబాద్ (సీఎంసీ), మల్కాజిగిరి (ఎంఎంసీ)గా విభజించిన సర్కారు..ఆస్తుల విభజన, అప్పులను సీజీజీ నేతృత్వంలో కమిటీ వేయగా.. దాదాపు రూ. 4,717 కోట్ల అప్పులను సర్కారు ఆదుకోవాలంటూ ప్రతిపాదనలు సమర్పించింది. ఈ నేపథ్యంలోనే అప్పులను టెకోవర్ చేసుకునేందుకు ససేమిరా అంటున్నది. ఓటీఎస్ (వన్ టైం సెటిల్మెంట్) ద్వారా సర్దబాటు చేసుకోవాలంటూ ఉచిత సలహా ఇవ్వడం విశేషం..కాగా బల్దియా చేసిన వేల కోట్ల అప్పులను నేరుగా టేకోవర్ చేసేందుకు సాంకేతిక ఇబ్బందులు ఉన్న దృష్ట్యా, పన్ను బకాయిల రూపంలో నిధులను సర్దుబాటు చేసి సంస్థను బలోపేతం చేయాలని నిర్ణయించింది.
ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ భవనాల నుంచి రావాల్సిన భారీ బకాయిలను వన్ టైమ్ సెటిల్ మెంట్ ద్వారా చెల్లించడం.. అప్పుల భారాన్ని తగ్గించాలని ఇటీవల కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. అయితే ఇప్పటి వరకు ఎ లాంటి అధికారిక జీవో వెలువడలేదు. ఈ తరుణంలోనే ప్రభుత్వ కార్యాలయాల నుంచి రావాల్సిన ఆస్తి పన్నును ఓటీఎస్ ద్వారా సర్దుబాటు చేయడం ద్వారా మూడు కార్పొరేషన్లకు సుమారు రూ. 1,686 కోట్లు తక్షణమే అం దుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు..మిగిలిన దాదాపు రూ.3వేల కోట్ల అప్పులు ఏడాది కాలంలో ఒక్క జీహెచ్ఎంసీతోనే ఎలా సాధ్యమవుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రూ.2వేల కోట్ల సంగతేంది?
స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి జీహెచ్ఎంసీకి ఆరేండ్లుగా రావాల్సిన స్టాంపు డ్యూటీ రూ.3,030 కోట్లను గతేడాది జనవరి నెలలో రిలీజ్ చేసింది. మొత్తం రూ. 3,169 కోట్లు రావాల్సి ఉంది. ఇందులో స్టాంప్ డ్యూటీకి సంబంధించి రూ. 3030 కోట్లు, మ్యూటేషన్ ఫీజుల కింద రూ. 139 కోట్లు రావాల్సి ఉండగా, ఇందులో స్టాంప్ డ్యూటీ మొత్తాన్ని బల్ధి యా పర్సనల్ డిపాజిట్స్ (పీడీ) అకౌంట్లో జమ చేసింది. అయితే ఈ నిధులను రెవెన్యూ ఖర్చు కోసం మాత్రమే వినియోగించాలని నిబంధన పెట్టింది.
డెవలప్మెంట్కు ఒకేసారి వాడుకునేందుకు వీలులేకపోవడం, ఉద్యోగుల జీతాలు, మెయింటనెన్స్ లోన్ల రీ పేమెంట్స్ కోసం వినియోగించారు. మొత్తంగా రూ. 1000 కోట్లను మాత్రమే వినియోగించుకున్నారు. ఇంకా నెలవారీగా ఈ నిధులను రెవె న్యూ ఖర్చులకు వినియోగించుకోవాలని అధికారులు భావిస్తున్న తరుణంలో, కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో తీసుకున్నట్లుగా సర్కారు బల్ధియా ఈ నిధులను వెనక్కి తీసుకున్న కోలుకోని షాక్‌కు గురి చేసింది. ఉన్న ఫళం గా రూ. 2వేల కోట్లకు పైగా లాగేసుకుని కనీసం ఆ ప్రస్తావన తీసుకురాకపోవడంపై తీవ్రంగా మండిపడుతున్నారు.
రూ. 500కోట్ల కేటాయింపు ఎక్కడ?
జీహెచ్ఎంసీని మూడు కార్పొరేషన్లుగా విడగొట్టి, ఒకో దానికి రూ. 500 కోట్లు ఇస్తామని ప్రగల్భాలు పలికిన పాలకులు..ఆ హామీని గాలికి వదిలేశారు. స్పెషల్ ఆఫీసర్ జయేశ్ రంజన్ ప్రతి కార్పొరేషన్‌కు రూ. 500కోట్ల మేర నిర్వహణ ఖర్చులకు ఇస్తామని ప్రకటించారు. కానీ బడ్జెట్లో కనీసం నయా పైసా కేటాయింపులు జరపలేదు. ఫలితంగా నగర శివారులోని 27 పురపాలికలను జీహెచ్ఎంసీలో కలపడం ద్వారా ఆ ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయన్న ఆశలు ఆవిరైపోయాయి. విలీనం ముందు బడంగ్‌పేట, నార్సింగి, మణికొండ పురపాలికలు ప్రతి ఏటా రూ.200కోట్ల మేర సర్ఫ్లస్లో బడ్జెట్ ఉండేదని, ఇప్పుడు మౌలిక వసతుల కల్పనపై తీవ్ర ప్రభావం పడుతుందని స్థానికులు మండిపడుతున్నారు.