హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉన్నత విద్యకు నిధుల కేటాయింపులో సర్కారు వివక్ష కనబరుస్తున్నది. చిన్న వర్సిటీలను చిన్నచూపు చూస్తున్నది. ఉస్మానియా, కాకతీయ తప్ప మిగతావి అన్నీ చిన్న వర్సిటీలే. వీటికి సొంతంగా సమకూరే ఆదాయం తక్కువ, ఖర్చులు ఎక్కువ. వీటికే సర్కారు సరిపడా నిధులివ్వడం లేదు. 2025-26 విద్యా సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వం వర్సిటీలకు రూ.500 కోట్లు కేటాయించింది. ఇం దులో అంబేద్కర్ వర్సిటీకి రూ.25కోట్లు, ఎంజీయూ, పాలమూరు, శాతవాహన, తెలుగు, తెలంగాణ వర్సిటీలకు రూ.35 కోట్ల చొప్పున ఇవ్వనుండగా, కేయూ, ఓయూ, చాకలి ఐలమ్మ వర్సిటీలకు రూ.100 కోట్ల చొప్పున సర్కారు ఇవ్వనున్నది. ఈ క్రమంలో చిన్న వర్సిటీలకు ఇచ్చే నిధులు సరిపోవనే వాదనలు వినిపిస్తున్నాయి.
ఓయూలో విద్యాశాఖ అధికారుల భేటీ..
నిధుల లేమి, ఫ్యాకల్టీ కొరతతో న్యాక్, ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్స్‌లో మన వర్సిటీలు వెనుకబడ్డాయి. వీటిని మెరుగుపర్చడమే ధ్యేయంగా విద్యాశాఖ అధికారులు ఇటీవల ఓయూలో వీసీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ప్రభుత్వ సలహాదారు కేశవరావు, విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా, కళాశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, 12 వర్సిటీల వీసీలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. శాతవాహన వర్సిటీ న్యాక్ గుర్తింపు పొందలేదు. తెలంగాణ, ఓయూల న్యాక్ గడువు ముగిసింది. ఆర్జీయూకేటీ అతి తక్కువ గ్రేడ్‌ను సొంతం చేసుకున్నది. న్యాక్ గుర్తింపు, నివేదికల తయారీపై ఇటీవల జరిగిన భేటీలో వీసీలకు అవగాహన కల్పించారు. సర్కారు ఇవ్వబోయే నిధులు సహా డీపీఆర్‌ల రూపకల్పనపై చర్చించారు.
ఆ మూడు వర్సిటీలకు నిధులేవి?
రాష్ట్రంలోని వర్సిటీలకు 2024-25 బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించారు. కానీ, నిధుల విడుదలలో మొండిచెయ్యి చూపించారు. కొన్నింటికి లక్షల్లోనే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. 2025-26 బడ్జెట్లోనూ రూ.500 కోట్లు కేటాయించారు. 9 వర్సిటీలకు నిధులిస్తామన్నారు. కానీ, జేఎన్ఎఫ్ఏయూ, జేఎన్టీయూహెచ్, ఆర్జీయూకేటీలకు నయా పైసా కేటాయించకపోవడం గమనార్హం.