నేరేడ్మెట్, సెప్టెంబర్ 29: కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసి హైడ్రామాలు ఆడుతుందని మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి(MLA Marri) ఆగ్రహం వ్యక్తం చేశారు. వినాయకనగర్ డివిజన్ బండ చెరువు సమీపంలోని, మౌలాలి పరిధిలోని శంకరయ్య కాలనీ, సింహాద్రినగర్, ఎన్ఎండిసి కాలనీ, శివానంద్నగర్ కాలని తదితర కాలనీప్రజలు హైడ్రా(HYDRAA) వల్ల భయాందోళనకు గురవుతున్నట్లు తెలుసుకుని ఆదివారం పలు కాలనీలను పర్యటించి ప్రజలకు భరోసాను కల్పించారు.
గత 30 సంవత్సరాల నుంచి ఇండ్ల పర్మిషన్లు , పన్నులు చెల్లించి ఇండ్లు నిర్మాణం చేపట్టుకున్నామని వివిధ కాలనీప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్దిని గాలికి వదిలేసి అనవసరమైన డ్రామాలు ఆడుతూ హైడ్రాతో ప్రజలను భయాబ్రాంతులకు గురిచేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఆరు గ్యారెంటీలు ఆట ఎక్కించి దృష్టి మలచి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తొందని అన్నారు.
ప్రభుత్వం అంటే ప్రజలకోసం ప్రజాసంక్షేమం కోసం పనిచేయాలని, అలా కాకుండా వారిని ఆవేదనకు గురిచేస్తున్నారని తెలిపారు. ప్రజలు భయాందోళనతో నిద్రలేని రాత్రులు గడుపుతూ అనారోగ్యాల పాలవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరంతరం ప్రజలకు అండగా ఉంటానని, ప్రజలు ఎటువంటి ఆందోళనకు గురికావద్దని వారికి ఎమ్మెల్యే హామి ఇచ్చారు.