మెట్రో స్వాధీనం చేసుకోవడమే తరువాయి.. మెట్రో ఆస్తులను లెక్కగట్టి వాటిని వేలం వేసేందుకు సర్కార్ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఇందులో భాగంగా నగరంలో మెట్రోకు సంబంధించిన భూముల చిట్టాను లెక్కించే పనిలో అధికారులు నిమగ్నమైనట్లు తెలుస్తోంది. మరో 2-3 నెలల్లో ఆయా భూములు, ఆస్తులను అమ్మకం లేదా దీర్ఘకాలిక లీజు కోసం కట్టబెట్టే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. 69 కిలోమీటర్ల మేర అందుబాటులో ఉన్న మెట్రో సంస్థకు నగరవ్యాప్తంగా 300 ఎకరాలకి పైగా భూమి అందుబాటులో ఉంది. మెట్రోస్టేషన్లు, పార్కింగ్ యార్డులు, డిపోలకు సమీపంలో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉన్న భూములతో రెవెన్యూ వస్తోంది.
సిటీబ్యూరో, మే 6 (నమస్తే తెలంగాణ) : నగరంలో రెండు భారీ డిపోలతోపాటు, 57 స్టేషన్లను కలిగి ఉన్న మెట్రో వ్యవస్థ నిర్మాణానికి అప్పట్లోనే రూ.18,880 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో 70శాతం రుణాలతో సర్దుబాటు చేయగా.. మిగిలిన మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర సర్కార్లతో పాటు ఎల్అండ్టీ నిర్మాణ సంస్థ భరించింది. అయితే రాష్ట్ర సర్కార్ వాటాగా ఎల్అండ్టీ సంస్థకి ఏకంగా 250 నుంచి 300 ఎకరాల భూమిని కట్టబెట్టింది. ఈ భూమిని డెవలప్ చేయడం ద్వారా మెట్రో నిర్వహణ సంస్థ ఏటా 55శాతం రెవెన్యూ సృష్టించాలనే ఒప్పందంలో ఉంది.
కానీ నిర్వహణ నుంచి ఇటీవల ఎల్ అండ్ టీ సంస్థ తప్పుకోవడంతో.. భూములన్నీ ప్రభుత్వ అధీనంలోకి వచ్చాయి. అయితే ఇప్పటికే ఎల్ అండ్ టీ సంస్థకు ఇవ్వాల్సిన నిధుల సర్దుబాటుపై తర్జనభర్జనలు పడుతున్న రాష్ట్ర సర్కార్.. మెట్రోకు ఉన్న భూములను ఆర్థిక వనరులుగా మార్చే మార్గాలను అన్వేషిస్తోంది. మెట్రోకు మియాపూర్ డిపో కోసం 99 ఎకరాలు, ఫలక్నుమా(నిర్మాణం కాలేదు) వద్ద 17 ఎకరాలు, నాగోల్ డిపో వద్ద మరో 96 ఎకరాలు కలిపి మొత్తంగా 212 ఎకరాలు ఓపెన్ జాగాలు ఉన్నాయి.
ఇందులో 70-80శాతం మెట్రో అవసరాలకు రెండు మూడు ఫ్లోర్లలో వినియోగించి, మిగిలిన 20శాతం భూమిని నిర్మాణ సంస్థ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ చేసుకునే వెసులుబాటునిచ్చింది. ఇక వీటితోపాటు 25 మెట్రో స్టేషన్ల సమీపంలో మరో 57 ఎకరాలు ఖాళీ జాగాలు ఉండగా, మిగిలిన మరో 30 ఎకరాల విస్తీర్ణంలో మెట్రో స్టేషన్ల పై భాగంలో ల్యాండ్ బ్యాంక్ కలిపి మొత్తంగా మెట్రో సంస్థకు 300 ఎకరాలు భూములు ఉన్నాయని గతంలో తేల్చింది. అయితే టేకోవర్ తర్వాత ఉన్న భూముల విలువను తాజాగా అంచనా వేసేందుకు రంగం సిద్ధం చేసిన సర్కార్ లెక్కలు తేలిన వెంటనే వాటిని ఓపెన్ మార్కెట్లోకి తెచ్చేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.