సిటీబ్యూరో: మూసీ సుందరీకరణ విషయంలో ప్రచారమే లక్ష్యంగా ప్రభుత్వం డంబాచార ప్రకటనలతో ఇటు జనాలను అటు అధికారులను అయోమయానికి గురిచేస్తోంది. పూటకో మాటతో మంత్రులు చేస్తున్న ప్రకటనలు మరిన్నీ అనుమానాలకు తావిస్తోంది. ఓవైపు మూసీ ప్రక్షాళనకు అంచనా వ్యయాన్ని రూ. లక్ష కోట్లకు పెంచగా, తాజాగా అసెంబ్లీ సాక్షిగా మంత్రులు చేసిన ప్రకటనలతో మూసీ సుందరీకరణ కాంగ్రెస్ ప్రభుత్వం చేయగలుగుతుందా అనే అనుమానాలు జనాల్లో వ్యక్తమవుతున్నాయి.
అసెంబ్లీ వేదికగా బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క మూసీని థేమ్స్ నది తరహాలో తీర్చిదిద్దేందుకు డీపీఆర్ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసీ సుందరీకరణపై నెలకొన్న గందరగోళానికి తెరదించేలా మరోసారి ప్రభుత్వాన్ని నిలదీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
మంత్రి శ్రీధర్ బాబు స్పందిస్తూ..మూసీపై డీపీఆర్ సిద్ధం కాలేదని కుండ బద్ధలు కొట్టారు. దశల వారీగా మూసీని అభివృద్ధి చేసుకునేందుకు రూపొందించాల్సిన ప్రణాళికలను తయారు చేసేందుకు ఆ నిధులను వినియోగిస్తామని వివరణ ఇచ్చారు. ఇలా అస్పష్టమైన ప్రకటనలు, దిశానిర్దేశం లేని ప్రచారంతో మూసీ ఒక డంబాచారంగా మారుతుందనే విమర్శలను కాంగ్రెస్ ప్రభుత్వం మూటగట్టుకుంటున్నది.