సిటీబ్యూరో, మార్చి 8 (నమస్తే తెలంగాణ) : జీహెచ్ఎంసీలో నకిలీ జనన, మరణ ధ్రువపత్రాల వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నది. సరైన పత్రాలు లేకుండా కేవలం తెల్ల కాగితాలు అప్లోడ్ చేసి భారీ ఎత్తున జనన, మరణ ధ్రువపత్రాలు జారీ కావడం, నాన్ అవెలబులిటీ సర్టిఫికెట్ తీసుకుని ఆర్డీఓ ఉత్తర్వు విధానంలోనే ఎక్కువ అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఇందులో భాగంగానే 27,328 జనన, 4126 మరణ ధ్రువపత్రాలను రద్దు చేశారు. అయితే ఈ అక్రమాల తంతును నిగ్గు తేల్చేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) బృందం బుధవారం విచారణ చేపట్టింది. సీజీజీ (సెంట్రల్ ఫర్ గుడ్ గవర్నెన్స్) నివేదిక ఆధారంగా జారీ చేసిన మీ సేవా సెంటర్లపై దృష్టి సారించింది. మరో పక్క జీహెచ్ఎంసీ కేంద్ర కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సమీక్షా నిర్వహించారు. సీఎంఓహెచ్ డాక్టర్ పద్మజ, స్టాటిస్టికల్ అధికారులు, వైద్యాధికారులపై తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమాల వెనుక అసలు ఎవరి పాత్ర ఎలా ఉందని, విచారణలో తేలిన వారిపై కఠినంగా వ్యవహరించాలని మేయర్ కమిషనర్ డీఎస్ లోకేశ్‌కుమార్‌కు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. ప్రధానంగా ప్రాథమికంగా అక్రమాలు జరిగిన 15 మీ సేవా కేంద్రాలపై విచారణ జరిపి, నిర్వాహకులు, సంబంధిత దరఖాస్తు చేసిన కంప్యూటర్ ఆపరేటర్ల్లపై కేసులు పెట్టాలని, అవసరమైతే వాటి లైసెన్స్‌లు రద్దు చేయాలని మేయర్ చెప్పినట్లు తెలిసింది. జీహెచ్ఎంసీ వైద్య విభాగంలో నలుగురిపై అధిక ఫిర్యాదులు వస్తున్నాయని, ఆ నలుగురు అధికారులపై వేటు వేయాలని ఆదేశించినట్లు సమాచారం. ఆ నలుగురిలో సూపరింటెండెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో అన్ని విభాగాల్లో ఏళ్ల తరబడి ఒకే స్థానంలో కొనసాగుతున్న వారిని బదిలీ చేయాలని కమిషనర్‌కు మేయర్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.