బేగంపేట్ నవంబర్ 26: రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. శుక్రవారం వెస్ట్ మారేడ్‌పల్లిలోని తన నివాసం వద్ద సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని 58 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరాటం చేసి సాధించుకున్న రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలనే సంకల్పంతో సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. పేదింటి ఆడపడుచుల వివాహానికి ప్రభుత్వ పరంగా ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని తెలిపారు. రాష్ట్రం అమలు చేస్తున్న పథకాలను ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకొని అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయని వివరించారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేదలకు ప్రభుత్వం పెద్డపీట వేస్తుందన్నారు. కార్పొరేటర్ మహేశ్వరి, లక్ష్మీబాల్‌రెడ్డి, తహసీల్దార్లు బాలశంకర్, చంద్రకళ, మాజీ కార్పొరేటర్లు తరుణి, శేషుకుమారి అరుణగౌడ్ పాల్గొన్నారు.