శామీర్ పేట, ఏప్రిల్ 8 : ఈత సరదా ఇద్దరి ప్రాణాలను బలితీసుకుంది. శామీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలోని శామీర్‌పేట పెద్ద చెరువు కాల్వ వద్ద ఈ ఘటన మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం… కూకట్పల్లి ఆల్విన్ కాలనీ ఎల్లమ్మబండ కు చెందిన పదిమంది స్నేహితులు జిప్టోలో డెలివరీ బాయ్స్ గా పనిచేస్తున్నారు.
మంగళవారం శామీర్‌పేట కట్ట మైసమ్మ ఆలయం వద్ద దావత్ చేసుకుందామని వచ్చారు. అమ్మవారి దర్శనం అనంతరం శామీర్‌పేట చెరువు కాలువ వద్ద వంట వండుకొని విందు ఆరగించారు. అనంతరం కృష్ణ(34), యశ్వంత్(24), ప్రవీణ్ లు సరదాగా ఈత కోసమని కాలువలో దిగారు. కృష్ణ, యశ్వంత్లకు ఈతరాకపోవడంతో కొంచెం లోపలికి వెళ్లి నీట మునిగిపోయారు. ఈ విషయాన్ని గుర్తించిన స్నేహితులు ప్రవీణ్, విష్ణు బయటికి తీసుకురావడానికి ప్రయత్నించారు.
యశ్వంత్ దొరికాడు కాని అప్పటికే అతడి మృతి చెందాడు, కాగా కృష్ణ నీటిలో గల్లంతు కావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కృష్ణను గజ ఈతగాళ్ల సహాయంతో వెలికితీశారు. కృష్ణకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కృష్ణ ఆంధ్రప్రదేశ్ నుంచి బతుకు దెరువు కోసం నగరానికి వచ్చారు. యశ్వంత్‌ను నాగర్ కర్నూల్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఈ మేరకు శామీర్‌పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.