సిటీబ్యూరో, సెప్టెంబరు 8 (నమస్తే తెలంగాణ): జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి తుది ఓటర్ల జాబితా సమగ్రంగా సిద్ధం చేసేందుకు అన్ని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు పూర్తి సహకారం అందించాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు. సోమవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సంక్షిప్త సవరణ కార్యక్రమంలో రాజకీయ పార్టీ ప్రతినిధులతో కమిషనర్ సమావేశం నిర్వహించారు.
భారత ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం ఇంటిగ్రేటెడ్ డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ఈనెల 2వ తేదీన ప్రచురించామని కమిషనర్ చెప్పారు. ముసాయిదా జాబితా ప్రకారం మొత్తం 139 లొకేషన్లు, 407 పోలింగ్ స్టేషన్లు ఉండగా 3 లక్షల 92 వేల 669 మంది ఓటర్లు ఉన్నారని వివరించారు. ఈ జాబితాను అన్ని రాజకీయ పార్టీలకు అందజేయడంతో పాటు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ వెబ్సైట్లలో కూడా అందుబాటులో ఉంచినట్లు పేరొన్నారు.
30న తుది ఓటర్ల జాబితా..
ప్రతి అర్హులైన ఓటరును జాబితాలో చేర్చేందుకు, తప్పుల్లేని ఓటర్ల జాబితా సిద్ధం చేసేందుకు రాజకీయ పార్టీల సహకారం అత్యంత అవసరమని కమిషనర్ చెప్పారు. తుది ఓటర్ల జాబితా ఈనెల 30, 2025న ప్రచురించబడుతుందని స్పష్టం చేశారు. ఈ సమావేశానికి ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు జాయింట్ సీఈఓ పల్లవి విజయవన్శి, అదనపు కమిషనర్ (ఎలక్షన్స్) మంగతాయారు హాజరయ్యారు.
రాజకీయ పార్టీల తరపున నందేశ్ కుమార్ (బహుజన్ సమాజ్ పార్టీ), పి.వెంకటరమణ, పవన్ కుమార్ (భారతీయ జనతా పార్టీ), విజయ్ (ఆమ్ ఆద్మీ పార్టీ), ఎం.శ్రీనివాసరావు (కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా-మార్సిస్టు), రాజేష్ కుమార్ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్), జయసింహ, కె.మాధవ్ (భారత్ రాష్ట్ర సమితి), జోగేందర్ సింగ్, ప్రశాంత్ యాదవ్ (టీడీపీ), సయ్యద్ ముస్తాక్ (ఏఐఎంఐఎం) తదితరులు హాజరయ్యారు. కాగా సమావేశానికి ముందుగా.. హైదరాబాద్ జిల్లాలో జీఐఎస్ ఆధారిత నజరి నక్ష తయారీ కార్యాచరణ ప్రణాళికపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చించారు.
ఓటరుగా నమోదు చేసుకోవాలి
ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ లెవల్ ఏజెంట్లను(బీఎల్ఏల) నియమించి, పారదర్శకంగా, ఖచ్చితంగా జాబితా సవరణలో భాగస్వాములు కావాలని పార్టీ ప్రతినిధులను కమిషనర్ కోరారు. ఈనెల 17 వరకు దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణకు అవకాశం ఉందన్నారు. వచ్చే జూలై 1, 2025 నాటికి 18 ఏళ్లు పూర్తిచేసుకున్న అర్హులైన పౌరులు, ఈనెల 17లోపు తప్పనిసరిగా ఓటరుగా నమోదు అయ్యేలా చూడాలన్నారు.
జాబితాలో ఏమైనా సవరణలు, మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటే సంబంధిత దరఖాస్తు ఫారాలు సమర్పించాలని చెప్పారు. ఇప్పటివరకు ఫారం-6, 6ఏ, 7, 8 ద్వారా వచ్చిన 2,855 దరఖాస్తులు , అభ్యంతరాల్లో 8.62 శాతం దరఖాస్తులను పరిషరించామని, మిగతా దరఖాస్తులను సాధ్యమైనంత త్వరగా పరిషరిస్తామని కర్ణన్ తెలిపారు. ప్రజాప్రతినిధులు సహకరించాలి.